తాడేపల్లి: మాజీ సీఎం వైయస్ జగన్‌కు హాని కలిగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏకంగా వైయస్ జగన్ తల నరుకుతానంటూ టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్యచౌదరి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ పర్యటనలకు ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించకపోవడం, ఏకంగా సీఎం చంద్రబాబు ఆయనను భూస్థాపితం చేస్తానని హెచ్చరించడం, జీవించే హక్కు లేదని తన పార్టీ వారితో బెదిరించడం చూస్తుంటే, పెద్ద ఎత్తున కుట్రకు తెగబడుతున్నారనే విషయం అర్థమవుతోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. తప్పు చేసినా మాకేం కాదనే ధైర్యం నిందితుల్లో పెరిగిపోయింది. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎంకి కనీస భద్రత కల్పించడడం లేదు. ఆయన పర్యటనల్లో వరుసగా పోలీసుల భద్రతా వైఫల్యం కనిపిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉండటం లేదు. 'జగన్ తల నరికితే తప్పేంటని' తన వయసును, అనుభవాన్ని మరిచి టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. తానొక ముఖ్యమంత్రిననే విషయం కూడా మరిచిపోయి వైయస్ జగన్‌ని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతూ ఇటువంటి ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కట్ డ్రాయర్‌తో పరిగెత్తిస్తానని సకల శాఖల మంత్రి నారా లోకేష్ బెదిరిస్తాడు. ప్రశ్నించే గొంతుక ఉండకూడదు అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే వైయస్ జగన్‌ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోనే 766 మంది వైయస్సార్సీపీ నాయకుల మీద హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. ఇందులో 370 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాడులకు గురైన వారు 200 మందికిపైనే. పొదిలి, సత్తెనపల్లిలో తాజాగా నమోదైన కేసులు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై కేసులు కాకుండానే 2,400 కేసులు నమోదు చేశారు. ఆఖరుకి సీనియర్ జర్నలిస్ట్ కేఎస్సార్ మీద కూడా అక్రమ కేసు పెడితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవ్వితేనే కేసు పెడతారా అంటూ ఈ తప్పుడు కేసుపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఎన్ని దాడులు చేసినా, ఎంత అన్యాయం చేసినా నిందితుడు టీడీపీ కార్యకర్త అయితే వారి మీద కేసులు పెట్టడం లేదు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు చంద్రబాబు తన పాలనతో రాష్ట్రాన్ని ఏ విధంగా అథోగతిపాలు చేస్తున్నారో పాత్రికేయుల సమావేశంలో మాజీ సీఎం వైయస్ జగన్ చాలా స్పష్టంగా ఆధారాలతో సహా వెల్లడించారు. చంద్రబాబు పాలనలో ఏడాదిలోనో రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిందని, ఏపీఎండీసీ ఆదాయాన్ని కుదువపెట్టి అప్పులు తేవడమే కాకుండా దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్ర ఖజానా మీద ప్రైవేటు వ్యక్తులకు యాక్సిస్ ఇవ్వడంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. సూపర్ సిక్స్ పేరుతో చేసిన వంచన గురించి మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో అదుపుతప్పిన శాంతిభద్రతల గురించి, వైయస్సార్సీపీ నాయకుల మీద నమోదు చేస్తున్న అక్రమ కేసులు అరెస్టుల గురించి ఆధారాలతో సహా వివరించారు. కూటమి నాయకుల అసమర్థతపై వైయస్ జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ర్యాలీలో ఒక వ్యక్తి ప్రదర్శించిన ప్లకార్డు విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానంను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నరాఉ. 'రప్పా రప్పా' అంటూ పుష్ప- 2 సినిమా డైలాగును పట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నారు. ప్లకార్డు ప్రదర్శించిన యువకుడు టీడీపీ కార్యకర్తే ఏ ప్లకార్టు గురించైతే కూటమి నాయకులు రచ్చ చేస్తున్నారో ఆ ప్లకార్డు పట్టుకున్న యువకుడికి టీడీపీ సభ్యత్వం కూడా ఉంది. సభ్యత్వ కార్డులో ఆ వ్యక్తి పేరు రవితేజ బొడ్డెద్దు అని వుంది. 2024-26 సంవత్సరానికి ఆ టీడీపీ మెంబర్ షిప్ కార్డు ఇచ్చారు. ఆయన తండ్రి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఆ యువకుడి కుటుంబమంతా కూడా తెలుగుదేశం పార్టీయే. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వైయస్ జగన్ బయటకొస్తుంటే ఆయనకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక తన పార్టీ కార్యకర్తల చేతికి ఇలా వివాదాస్పద ప్లకార్డులిచ్చి అలజడి సృష్టించాలని తెలుగుదేశం పార్టీయే కుట్రలు చేస్తోంది. ర్యాలీలో ఈ ప్లకార్డ్ ప్రదర్శిస్తున్నారనే విషయాన్ని మొదట బయటపెట్టింది టీడీపీకి చెందిన మంత్రి రామానాయుడు. ఆయన తన పార్టీ కార్యాలయంలో కూర్చుని ఈ ప్లకార్డుపై మీడియాతో మాట్లాడి విశేష ప్రచారం కల్పించారు. టీడీపీ సోషల్ మీడియా దాన్ని మరింత బయటకు తీసుకెళ్లింది. అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచే ఇలాంటి ప్లకార్డులు తయారు చేసి వైయస్ జగన్ పర్యటనలను అభాసుపాలు చేసేందుకు కుట్ర చేశారు.