కూటమి ఆరు నెలల పాలనంతా మోసాల మయం

మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం

అడుగడుగునా అరాచకాలు, హింస, దౌర్జన్యాలు 

హామీల అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం 

పేదలకు భరోసా ఇచ్చేలా ఒక్క కార్యక్రమం లేదు

కష్టాల్లో ఉన్న రైతులను పూర్తిగా గాలికొదిలేశారు

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఊసే లేదు

యువతకు ఉద్యోగాల్లేవు. నిరుద్యోగ భృతి లేదు

ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 3 లక్షల పింఛన్ల కోత 

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆక్షేపణ

తాడేపల్లి: కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో మోసాలు, అరాచకాలు తప్ప, ప్రజా సంక్షేమం ఏ మాత్రం లేదని వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు.

నియంత పాలన:
– ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్‌ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏమీ చేయకపోయినా, అన్నీ చేసినట్లు అసత్య ప్రచారాలు తప్ప, ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు.
– ఒక పక్క అప్రజాస్వామిక నియంత పాలన సాగిస్తూ.. మరోవైపు ఈ రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని తన ఆరు నెలల పాలనపై చంద్రబాబు ట్వీట్‌ చేయడం దారుణం. 
– ప్రతీకార రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు ఆరు నెలల్లో ఏరోజూ కనిపించలేదు. 

దీన్ని సక్సెస్‌ అంటారా?:
– వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా దాదాపు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక దాన్ని రద్దు చేసి మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశ కల్పించారు. ఆ వెంటనే టెట్‌ అన్నారు. రిజర్వేషన్లు అన్నారు. ఈ ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ప్రకటన మినహా, ఆ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
– దీపం–2 గ్రాండ్‌ సక్సెస్‌ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఏడాదికి ఒక్క సిలిండర్‌ ఎంతమందికి అందుతుందో తెలియదు. రాష్ట్రంలోని 1.54 కోట్ల కుటుంబాలకు పథకాన్ని వర్తింప చేయాలంటే దాదాపు రూ.4,115 కోట్లు అవసరం కాగా, రూ. 895 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే కేవలం ఒకే సిలిండర్‌ పంపిణీ చేయడం కూడా పథకం సక్సెస్‌ అయినట్లా?.
– చందాలు వసూలు చేసి భోజనాలు పెట్టే అన్న క్యాంటీన్లలో నాణ్యత శూన్యం. అందుకే అందులో ఒకసారి తిన్నోళ్లు రెండోసారి దాని ముఖం చూడటం లేదు. 
– మా ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల పింఛన్లు ఇస్తే, ఈ ఆరు నెలల్లోనే వాటిని 63 లక్షలకు కుదించారు. పైగా మరో 10 లక్షల పెన్షన్లు కట్‌ చేయాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పడం విజయవంతమైన పాలనకు నిదర్శనం అనుకోవాలా?. అలా పెన్షన్లలో కోత పెట్టి ఏటా రూ.4,800 కోట్లు మిగుల్చుకోవాలని కుట్ర చేస్తున్నారు. 
– ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు. 83 లక్షల మంది పిల్లలకు పథకం అమలు చేయడానికి ఏటా రూ.12,450 కోట్లు అవసరం కాగా ఒక్క పైసా ఇవ్వలేదు. 
– అన్నం పెట్టే రైతన్నను కూడా ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. మా హయాంలో ఏడాదికి రూ.13,500 చొప్పున రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకున్నాం. అందులో రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వ నిధులని హేళన చేసిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పి, అదీ ఎగ్గొట్టారు. రైతులకు పెట్టుబడిగా ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా నిండా ముంచేశాడు. 
    అందుకే రైతుల సమస్యలపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తున్నాం.
– ఎన్నికలప్పుడు 18 ఏళ్లు నిండిన అమ్మాయి కనపడితే చాలు.. నీకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఊదరగొట్టారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 2.07 కోట్ల మంది మహిళలు ఉంటే వారికి ఏడాదికి రూ.37,313 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 
– ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఇస్తామని నమ్మించారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి అంత కంటే లేదు.

6 నెలల్లో 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం:
– అదే గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఎం ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా వారంతా బాధ్యతలు చేపట్టారు. 
– దాదాపు 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇంకా 2.60 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించి ఇంటి గడప వద్దే సంక్షేమ పథకాలు అందించాం.
– ఇప్పుడు గూగుల్‌తో ఒప్పందం జరిగిందని, లక్షల్లో ఉద్యోగాలొస్తాయని చెబుతున్నారు. మరి మా హయాంలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీతో ఇలాంటి ఒప్పందం చేసుకుని సర్టిఫికెట్‌ కోర్సుల్లో శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించామన్నది మరిచిపోయారా?.

డైవర్షన్‌ పాలిటిక్స్‌తో సరి:
– ఆరు నెలల కూటమి పాలనంతా అసూయ, ప్రతీకారం, రాగ ద్వేషాలు, అహంకారంతో నడుస్తోంది. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధిస్తున్నారు. అడుగడుగునా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన సాగుతోంది. 
– ప్రభుత్వానికి కష్టమొచ్చినప్పుడల్లా డైవర్షన్‌ పాలిటిక్స్‌ తోనే టైంపాస్‌ చేస్తున్నారు. రుషికొండ భవనాలు, తిరుమల లడ్డూ వ్యవహారం, జెత్వానీ కేసు, మదనపల్లి ఫైల్స్, బోట్లతో బ్యారేజ్‌ను కూల్చాలనే కుట్ర.. ఇలా ప్రతి నెలా ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి, దుష్ప్రచారం చేస్తున్నారు. చివరకు మా నాయకుడి కుటుంబాన్ని కూడా వదలకుండా తప్పుడు ప్రచారం చేశారు. 
– ఇన్ని కుట్రలు కుతంత్రాలతో పాలన సాగిస్తూ తాము సచ్చీలురమని చెప్పుకోవడం హాస్యాస్పదం.
– రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే.. నాటి ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున సూచించారు.

Back to Top