పశు వధ ఫ్యాక్టరీ మూసేవరకు పోరాడుతాం

ఎమ్మెల్యే అరిమిల్లికి దమ్ముంటే నా పై కూడా కేసులు పెట్టించు  

మాజీ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు స‌వాల్‌

తణుకు: పశు వధ ఫ్యాక్టరీ  మూసేవరకు ప్రాణాలకు తెగించి  పోరాడతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. త‌ణుకు నియోజక వర్గంలో ప్రజల కంటే పశువుల్ని వధించే కసాయివాడు ఎక్కువయ్యడా....? అని ఎమ్మెల్యేను ప్ర‌శ్నించారు. ప‌శు వ‌ధ ఫ్యాక్టరీ పై పోరాడుతున్న గో సేవా సమితి సభ్యుడు శ్రీనివాస్ పై కేసులు పెడతారా...? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే అరిమిల్లికి దమ్ముంటే త‌న‌పై కూడా కేసులు పెట్టించు అంటూ కారుమూరి స‌వాలు విసిరారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

పంచాయ‌తీ తీర్మానం, నో అబ్జాక్షన్ సర్టిఫికెట్ లేకుండానే ప‌శు వ‌ధ‌ ఫ్యాక్టరీని ఎలా న‌డుపుతార‌ని కారుమూరి నాగేశ్వ‌ర‌రావు నిల‌దీశారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రోజు కూడా ఒక్క పశువుని  కూడా  వధించకుండా అడ్డుకున్నామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక‌.. రెండు నెలల నుంచి పశువధ జరుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చుట్టూ పక్కల ప్రజలు గ‌గ్గోలు పెడుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.  ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు చీమ కుట్టినట్టు కూడా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్తర‌ ప్రదేశ్ నుంచి వచ్చిన వ్య‌క్తుల‌కు స్థానిక ఎమ్మెల్యే వంత పాడ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.  ఈ ఫ్యాక్టరీ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించిన కూడా ఇక్కడ అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. తాను దమ్మున్న నాయ‌కుడిని కాబ‌ట్టి మా ప్ర‌భుత్వంలో ప‌శు వ‌ధ‌ ఫ్యాక్టరీని ఒక్క రోజు కూడా నడవనివ్వలేదని, నీక్కూడా  దమ్ము, దైర్యం ఉంటే పశువధ ఫ్యాక్టరీని మూసివేయించాల‌ని కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ఛాలెంజ్ చేశారు.  

Back to Top