హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లు జారీ చేయడంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇలాంటి బాండ్లను జారీ చేసినప్పుడు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని విమర్శించిన వారు, ఇప్పుడు అదే పని ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతు (అన్ కండిషనల్), మార్చడానికి వీలు లేని (ఇర్రివోకబుల్) గ్యారెంటీ ఇవ్వడం, అలాగే మద్యం అమ్మకాలపై వచ్చే స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా అప్పు తీర్చడానికి మళ్లించాలని నిర్ణయించడంపై ఆయన మండిపడ్డారు. ఎస్క్రో అకౌంట్ పెద్ద ఫ్రాడ్ అని అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు అవే విధానాలు పాటిస్తున్నాడంటే తాను ఫ్రాడ్ చేశానని ఒప్పుకుంటున్నాడా? అని నిలదీశారు. లేదా నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసింది కరెక్టేనని ప్రజల ముందు ఒప్పుకోవాలని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. నెలకు రూ.9 వేల కోట్ల చొప్పున, 18 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2.66 లక్షల కోట్లు అప్పులు చేసిందనీ, కానీ డిసెంబర్ 15 వచ్చినా, ఇంకా అనేక శాఖల్లో జీతాలు చెల్లించలేదని చెప్పారు. మరి తెస్తున్న అప్పంతా ఏమవుతోంది అన్న ఆయన, వాటికి లెక్కలు చూపాలని కోరారు. ప్రెస్‌మీట్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: నాడు తప్పు అన్నారు. ఇప్పుడు ఒప్పు అయిందా?: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణకు, నిబంధనల మేరకే బాండ్లు జారీ చేస్తే.. దారుణంగా విషం చిమ్మి, రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ తీవ్ర దుష్ప్రచారం చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు మీరు చేస్తోంది ఏమిటి? ఏపీబీసీఎల్ ద్వారా.. రూ.3 వేల కోట్ల నాన్ కన్వర్టబుల్ బాండ్లు. గ్రీన్‌షూ ఆప్షన్‌లో మరో రూ.2,750 కోట్లు.. రెండూ కలిపి మొత్తం రూ.5,750 కోట్లు 9.15 శాతం వడ్డీతో అప్పు చేస్తున్నారు. అంటే, భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి, ఆ రుణం సేకరిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే.. ఆ రుణానికి ప్రభుత్వం బేషరతుగా, మార్చడానికి వీలులేని విధంగా గ్యారెంటీ ఇచ్చింది. దాని వల్ల భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనూ, ప్రభుత్వానికి ఏ విధమైన వెసులుబాటు ఉండదు. ఇంకా దారుణమైన అంశం ఏమిటంటే.. మద్యం సరఫరాలో ఏపీబీసీఎల్‌కు వచ్చే ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ ద్వారా లింక్ చేస్తున్నారు. అంటే, మధ్యలో గ్యారెంటీగా ఉన్న ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ఆ అకౌంట్ నుంచి నేరుగా రుణం తిరిగి చెల్లింపు జరుగుతుంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఆ హక్కు రాసిచ్చింది. నాడు విషం చిమ్మారు. దుష్ప్రచారం చేశారు: గత ప్రభుత్వ హయాంలో రుణాలకు ప్రయత్నించినప్పుడు ఇదే ఎల్లో మీడియా నానా యాగీ చేసింది. ‘మద్యంపై మళ్ళీ రుణానికి విఫల యత్నం’. ‘ప్రభుత్వ ఆదాయాన్ని మళ్లించి ఇలా కార్పొరేషన్ల నుంచి రుణాలు సమీకరించడం రాజ్యాంగ విరుద్ధమని సాక్షాత్తు కేంద్రం పేర్కొంది’.. అంటూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అంతే కాదు.. ‘ఏపీ కార్పొరేషన్లు రుణాలు ఇచ్చే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకులను హెచ్చరించింది’.. అంటూ కథనాలు రాశారు. (అంటూ నాడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసిన కథనాలు చూపారు). నిజానికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు కొత్త కాదు. అవి తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. కార్పొరేషన్లకు మంజూరైన రుణం తొలుత వాటి పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలో జమ అవుతుంది. అక్కణ్నుంచి ఆ నిధులను ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటుంది. అప్పుడు అదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. కానీ, నాడు దాన్ని తప్పు పడుతూ, ఎల్లో మీడియాలో దుమ్మెత్తిపోశారు. సంపద సృష్టి అంటే అప్పు చేయడమా?: అంటే ఆరోజు మేము కార్పొరేషన్ల ద్వారా రుణం సేకరిస్తే అది తప్పు. అదే ఇప్పుడు మీరు చేస్తే ఒప్పు. అంటే మీరు చేస్తే అది సంపద సృష్టి. మేము చేస్తే అప్పు. అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎస్క్రో అకౌంట్ గురించి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఫ్రాడ్ వినలేదని గత మా ప్రభుత్వంపై బురద జల్లాడు. ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్, బారోయింగ్ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మాపై నిందలేసి, ఇప్పుడు వాళ్లు చేస్తున్నదీ అదే కదా. ఆయన ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి, తప్పు అని మాట్లాడారో.. ఇప్పుడు అదే చేశారు. ఇన్ని విధాలుగా అంత అప్పు చేస్తున్న మీరు, ఆ నిధులను దేనికి వాడుతున్నారు?. కానీ ఎక్కడైనా సంక్షేమానికి అప్పులు చేసినట్టు చూపించగలరా? చేసిన అప్పును ఫలనా పథకానికి ఖర్చు చేసినట్టు మీ ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయా?. కమీషన్ సంగతేమిటి?: ఇంకా, మొన్ననే ఏపీఎండీసీ బాండ్ల మీద రూ.9 వేల కోట్ల అప్పు చేసి రూ.150 కోట్లు కమీషన్ ఇవ్వలేదా? అంటే మీ ప్రకారంగా ఆ కమీషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు ఇంచుమించు రూ.200 కోట్లు ఏదో ఇస్తున్నారా లేదా? లేదు మేము కమీషన్ ఇవ్వలేదని చెప్పగలరా?. గతంలో రూ.166 కోట్ల కమిషన్ ఇచ్చారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతుంటే పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఇప్పుడు మీరు రూ.150 కోట్లు కమీషన్ ఇచ్చారు కదా? మరి దాన్ని ప్రశ్నించరా?. వీటన్నింటికీ మీ వద్ద సమాధానం ఉందా?: పంచాయతీరాజ్ డిపార్టుమెంట్‌కి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.900 కోట్లు వస్తే ఇంతవరకు ఎందుకు స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? వాటిని ఎందుకు వేరే వాడుకున్నారు? అది లేట్ అయినందువలన మళ్లా ఇంకొక రూ. 1000 కోట్లు రావాల్సింది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? – ఉచిత ఇసుక ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దొరుకుతుందా? కూటమి నాయకులను కాదని వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడైనా ఇసుక వ్యాపారం జరుగుతుందా? – ఈ రాష్ట్రంలో కూటమి నాయకులక నెలకింత మామూలు లేంది మద్యం షాపుల దందా ఎక్కడైనా జరుగుతుందా? – జాతీయ రహదారులను కి.మీ రూ.30 కోట్లతో నిర్మిస్తుంటే అమరావతి అని చెప్పి ఎనిమిది లేన్లు, 10 లేన్లు కి.మీకు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డుకైతే ఒక్కో కి.మీకు ఏకంగా రూ.180 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. – మేము అంత కష్టపడి మెడికల్ కాలేజీలు కడితే దాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. – సూపర్ సిక్స్ పేరుతో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు, ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వాలి. ప్రతి రైతుకి ఏడాదికి 20 వేలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. గ్యారెంటీ సంతకం చేసిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి కదా. మీరు గ్యారెంటర్ కదా? మీరు సంతకం పెట్టినారు కదా? మూడు సిలిండర్లు ఎంతమందికి అందాయి? – బాబోస్తే 50 ఏళ్లు నిండుతానే ప్రతి అక్క ఖాతాలో నెలకు రూ.4 వేలు ఇస్తామని చెప్పి చెప్పారా లేదా? దానికి మీరు గ్యారెంటర్ కదా? మీరు సంతకం పెట్టినారు కదా? ఇస్తారా? మద్యం ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతుంది?: ఎక్సైజ్ డిపార్టుమెంట్ 2024–25 ఫస్ట్ ఆరు నెలల ఆదాయం రూ. 6,782 కోట్లు. 2025–26 ఫస్ట్ ఆరు నెలలు ఆదాయం చూసుకుంటే రూ. 6,992 కోట్లు వచ్చింది. అంటే మార్జినల్ 3% పెరిగింది. గోవా నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కి వస్తే వాళ్ళే సిగ్గుపడతారు. కూల్ డ్రింకులు ఎలా దొరుకుతాయో గ్రామాల్లో ఇప్పుడు మందు అలా దొరుకుతుంది. అసలు బ్రెడ్, బన్ను కూడా దొరుకుతుందో లేదో గానీ మందు మాత్రం దొరుకుతుంది. అయినా 10 శాతం మినిమం పెరగాల్సిన మద్యం ఆదాయం ఎందుకు మూడు శాతమే పెరిగింది? ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు? ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డ్యూప్లికేట్ మందు వస్తుందా? దొంగ మందు వస్తుందా? మాట మాట్లాడితే మద్యం కుంభకోణం అంటున్నారు కదా. అసలు సిండికేట్ కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు. అప్పుడు ప్రభుత్వం అమ్మింది. మేము రూ.120 లకు మందు అమ్మినప్పుడు నాసిరకం అన్నారు. ఇప్పుడు రూ.99 లకు మందు ఇస్తున్నారు. రూ.120 లకు అమ్మేది నాసి రకం మందు అయితే, రూ. 99 లకు మంచి మందు దొరుకుతుందా? వీటికితోడు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలుంటే ఆరు డిస్టిలరీలు 2014 కంటే ముందు ఉండేవి. మిగతా 14 డిస్టిలరీలు 2014–19 మధ్య టీడీపీ హయాంలో అనుమతులిచ్చినవే. మా హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. నెలకు సగటున రూ.9 వేల కోట్ల అప్పు: నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉండగా మరో శ్రీలంకగా రాష్ట్రం. మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే. ‘ఐదు రాష్ట్రాల అప్పు పరిస్థితి ఆందోళనకరం‘. అందులో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్. అని ఈనాడులో రాశారు. ‘ది ప్రింట్ సంచలనాత్మక కథనం‘. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది అంటూ దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏపీని సింగపూర్ చేశారా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలో అప్పుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. కాగ్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో రెవెన్యూ రాబడి దారుణంగా పడిపోయింది. నిజం చెప్పాలంటే 2014–19 మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో అప్పు సగటు పెరుగుదల 22.6% గా ఉంటే, 2019–24 మధ్య వైయస్ఆర్‌సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ 13.5%. శాతానికి తగ్గించాం. కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకుంటే కేంద్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదల 2014–19 మధ్య సగటున 4.4% ఉంటే 2019–24 మధ్య 6.6% కి పెరిగింది. అదే సమయంలో మిగతా రాష్ట్రాలను చూస్తే కోవిడ్ వలన అన్ని రాష్ట్రాలు కలిసి 2014–19లో 1.9% పెరిగినాయి. కానీ 2019–24 లో 2.4% పెరిగినాయి. కానీ మన రాష్ట్రం చూస్తే టీడీపీ హయాంలో పెరిగిన దానికన్నా తక్కువే పెరిగింది. ఏడాదిన్నరలో కూటమి ప్రభుత్వ అప్పులు: ఏప్రిల్ 3, 2025 – రూ.5750 కోట్లు. మే 6, 2025 – రూ.6,822 కోట్లు. జూన్ 3, 2025 – రూ.7 వేల కోట్లు. జూన్ 10, 2025 – రూ.17 వేల కోట్లు. జూలై 15, 2025 – రూ.3600 కోట్లు. ఆగష్టు 5, 2025 – రూ.5 వేల కోట్లు. సెప్టెంబర్ 2, 2025 – రూ.5 వేల కోట్లు. సెప్టెంబర్ 30, 2025 – రూ.2 వేల కోట్లు. అక్టోబర్ 7, 2025 – రూ.1900 కోట్లు. నవంబర్ 4, 2025 – రూ.3 వేల కోట్లు. మొన్న డిసెంబర్ 2న – రూ.3 వేల కోట్లు. కార్పొరేషన్ల నుంచి చేసిన అప్పులు చూస్తే.. సివిల్ సప్లైస్ నుంచి – రూ.7 వేల కోట్లు, మార్క్ ఫెడ్ నుంచి రూ.18,700 కోట్లు, ఏపీఐఐసి – రూ.8500 కోట్లు, ఏపీఎండిసి – రూ.9 వేల కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ – రూ.6710 కోట్లు, విద్యుత్ సంస్థలన్నీ కలిసి – రూ.10,385 కోట్లు.. ఈ విధంగా మొత్తం కార్పొరేషన్ల మీద రూ.71,295 కోట్లు అప్పులు చేశారు. దీంట్లో ఏ కార్పొరేషన్ డబ్బు ఆ కార్పొరేషన్ కోసం వాడామని చెప్పగలుగుతారా? ఇంకా మార్క్‌ఫెడ్ నుంచి తెచ్చిన రూ.18,700 కోట్లు ఏం చేశారు? రైతులకు ఒక్క రూపాయి గిట్టుబాటు ధర చెల్లించకుండా మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు తెచ్చారు. ఇది కాక అమరావతికి మొత్తం రూ.40 వేల కోట్లు అప్పు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కెఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, ఎన్‌ఏబిఎఫ్‌ఐడి నుంచి రూ.7,500 కోట్లు, ఏపీఎఫ్‌ఎల్ నుంచి రూ.1500 కోట్లు తెచ్చారు. దీనికి ఎంత వాడారో లెక్కలు చెప్పగలరా? చివరకు పోలవరంకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు రూ.1107 కోట్లు వాడుకున్నారు. ఏం ఏం చేస్తున్నారో దేనికీ లెక్కలు లేవు. ఇవన్నీ కాక ఏపీఎండిసి ద్వారా రూ.9 కోట్లు తెచ్చారు. చరిత్రలో కనీవినీ ఎరుగని అనే రీతిలో రూ.1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు. 400కుపైగా మైనింగ్ లీజులు తాకట్టు పెట్టినారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పలు శాఖల్లో ఇంకా జీతాలు ఇవ్వలేదు: రికార్డు స్థాయిలో అప్పు చేస్తున్నారు. మరోవైపు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి, సంక్షేమ పథకం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కూడా లేదు. అయినా, డిసెంబరు రెండో వారం పూరై్తనా ఇప్పటికీ పలు శాఖల సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. పౌర సరఫరాలు, వైద్య–ఆరోగ్యం, ల్యాండ్ రికార్డ్స్–సర్వే, వ్యవసాయం, పరిశ్రమలు, సహకార, రవాణా, సమాచార–పౌర సంబంధాలు, ఖనిజాభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖలతో పాటు, ఇంకా పలు విభాగాల్లో ఇప్పటికీ నవంబరు నెల జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.