పాల‌న చేత కాక చేతులేత్తేశారు

మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా

వైయ‌స్ఆర్ జిల్లా:  ఎన్నిక‌ల స‌మ‌యంలో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కూట‌మి నేత‌లు ఇప్పుడేమో ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటూ చేతులెత్తేశార‌ని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా మండిప‌డ్డారు. ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు `తొలి అడుగు` అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంద‌న్నారు.  పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చార‌ని సూటిగా ప్ర‌శ్నించారు. బుధ‌వారం క‌డ‌ప న‌గ‌రంలో అంజాద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ..`
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పథకాలు అమలు చేయలేము అని నేరుగా మంత్రులతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక రాష్ట్రాన్ని అమ్మాలి అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఆడ‌బిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరం. యువగళం పాదయాత్ర లో లోకేష్ , బాబు ష్యూరిటీ -భవిష్యత్ కు గ్యారెంటీ అంటూ ప్రచారం చేశారు. ఎన్నో పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు గాలికి వదిలేశారు. 
అప్పుల సామ్రాట్ అని చంద్రబాబు కు దేశంలో బిరుదు ఇవ్వొచ్చు. రైతులకు సకాలంలో ఎరువులు అందక, పెట్టుబడి సహాయం లేదు, రుణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పథకాల అమలుపై ఈ ప్ర‌భుత్వానికి శ్ర‌ద్ధ లేదు కానీ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాకు టికెట్ పెంచే దానిపై ధ్యాస ఉంది. 

ఎమ్మెల్యే మాధ‌విరెడ్డి చుట్టూ అవినీతిప‌రులే
టీడీపీ క‌డ‌ప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అండదండలతోనే తిరుమలేశ్ అవినీతి అరాచకాలకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే దగ్గర అవినీతి చేసే వాళ్ళు, వసూలు రాజాలు, భూ కబ్జా దారులు తప్ప నేతలు ఎవరు లేరు. తిరుమలేశ్ అరాచకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి కి తక్కువేం కాకుండా ఇతను కూడా పెద్ద స్థాయిలో దందాలు వసూళ్లకు పాల్పడ్డాడు. తిరుమలేశ్ అవినీతిపై విచారణ జరిపించాలి.అతని అవినీతిని బయట పెట్టాలి` అని అంజాద్‌బాషా డిమాండ్ చేశారు. 

Back to Top