తొలి కేబినెట్‌ సమావేశంలో సీఎం వరాల జల్లు

అవినీతిర‌హిత రాష్ట్ర‌మే ల‌క్ష్యం

జుడీషియల్‌ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు 

అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం

2014 నుంచి 2019 వరుకు పెండింగ్‌లో ఉన్న రైతులు సబ్సిడీలు  చెల్లిస్తాం

అక్టోబర్‌ 2 నుంచి అమల్లోకి గ్రామ సచివాలయ వ్యవస్థ

రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి

రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు 

అర్హులకు ఇంటి ఇల్లాలు పేరు మీద ఇళ్ల స్థలాలు

నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు 

అమ్మ ఒడి ద్వారా జనవరి 26 నుంచి తల్లులకు చెక్కులు పంపిణీ

రాష్ట్ర ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి

సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కమిటీ

పారిశుధ్య కార్మికులకు రూ.18వేల వేతనం 

డ్వాక్రా యానిమేనిటర్లు, బుక్‌ కీపర్స్‌కు రూ.10 వేల గౌరవ వేతనం

 అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.11,500 గౌరవ వేతనం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌ సమావేశంలోనే వరాల జల్లు కురిపించారు.ఇచ్చిన మాట నిలబెట్టుకొనే దిశగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.జుడీషియల్‌ కమిటీ ఏర్పాటు,రైతులు,మహిళలు,ఉద్యోగులు  అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మిక ప్రయోజనాలే ఎజెండా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అవినీతిరహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలని ఆకాంక్షించిన సీఎం.. మంత్రులపై అవినీతి ఆరోపణలోస్తే తొలగిస్తామని హెచ్చరించారు.అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట నిచ్చేవిధంగా రూ.1150 కోట్లు కేటాయింపుతో పాటు అంగన్‌వాడీ టీచర్లు,కార్యకర్తలలు,డ్వాక్రా యానిమేటర్లు,బుక్‌ కీపర్స్,పారిశుధ్య కార్మికులు వేతనాలు పెంపు వంటి కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని, కన్నబాబులు మీడియాకు వివరించారు.   ఆ వివరాలు  ఇలా.. 

  •   రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో జరిగిన మొదటి కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులందరికి తమ తమ శాఖల్లో గత ఐదేళ్లలో జరిగిన తప్పులు, అవినీతి ఎక్కడ జరిగిందో పరిశీలించాలని సూచించారు. అన్నింటిలో ప్రక్షాళన చేయాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని సీఎం అదేశించారు. జూడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తిని కోరాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. జూడిషయల్‌ కమిషన్‌ ఏ శాఖల్లో కాంట్రాక్టులు, టెండర్లు..ఇలా ప్రతిది కూడా అందజేయాలని తీర్మానించాం. ఎవరైనా సరే ఈ టెండర్లు చూసుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. అన్నింటింటి పరిశీలించి తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని జూడిషియల్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచిస్తే..ఆ సూచనలు పాటిస్తాం.
  • ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు అవినీతిరహిత రాష్ట్రంగా చేయాలన్నదే సీఎం లక్ష్యం. ఎవరైనా పొరపాటు చేసినా, అవినీతి మరక అంటినా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటానని మంత్రివర్గ సమావేశంలో వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. మంత్రులు ఎవరైనా పక్క చూపులు చూస్తే  ఇంటికి వెళ్తారని సీఎం హెచ్చరించారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని దేశమంతా చూడాలన్నదే సీఎం ఉద్దేశం. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు గ్రామ వాలంటీర్ల ద్వారా చేరవేస్తాం. వీటిని అమలు చేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇస్తాం. ఎక్కడా కూడా నామినేషన్‌ పద్ధతి ఉండదు. గ్రామ వాలంటీర్లు ఆగస్టు 15 నుంచి పనులు ప్రారంభిస్తారు. అక్టోబర్‌ 2 నుంచి కూడా గ్రామ సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగ నియమకానికి డిగ్రీ అర్హత ఉండాలి. 
  • రైతు భరోసా పథకం అక్టోబర్‌ 15న ప్రారంభిస్తాం. ఈ పథకం కింద ప్రతి రైతుకు 12500 అందజేస్తాం. సుమారు 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. బ్యాంకుల్లో జమా చేయకుండా ఉండేందుకు ఈ పథకాన్ని బ్యాంకులకు సంబంధం లేకుండా అందజేస్తాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చెక్కులు గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. ధరల స్థిరీకరణకు సీఎం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తాం. రైతులందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే పేరు ప్రకటిస్తాం. పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు కూడా  వడ్డీ చెల్లించే అవసరం లేకుండా ప్రభుత్వమే బ్యాంకులతో ఒక ఒప్పందం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా కూడా అనుమానాలకు, దాటవేసే కార్యక్రమాలు ఉండవు.
  • చంద్రబాబు పాలనలో రూ.2 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా బకాయిలు పెట్టారు. మాది రైతు ప్రభుత్వంగా నిరూపించుకునేందుకు రైతుకు ఉన్న బకాయిలు చెల్లించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. ప్రకృతి వైఫరిత్యాల సహాయ నిధి రూ.2 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరికరణ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రైతులకు ఉచిత బోర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 200 రిగ్గులు అందుబాటులో ఉంచుతాం. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తాం. పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఏదైనా పంట నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది.
  •  వైయస్‌ జగన్‌ పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు  ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం లేక  ఇబ్బందులు పడుతున్న అందరిని గుర్తించి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కొనుగోలు చేసి ఉగాది రోజున ఆడపడుచులకు ఇంటి స్థలాలు ఇస్తాం. ఆ పట్టాపై బ్యాంకు రుణం తీసుకునే అవకాశం కల్పిస్తాం. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు మీదుగా రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానించాం. 
  • పిల్లలను కూలీలుగా తయారు చేయకుండా ఉండేందుకు అమ్మ ఒడి కార్యక్రమం కింది ఏటా రూ.15 వేలు చొప్పున ప్రోత్సాహం ఇచ్చేందుకు జనవరి 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. సహకార రంగం పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటాం. మూతపడిన సహకార పరిశ్రమలు తెరిపించేందుకు నిర్ణయం తీసుకున్నాం. 
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జులై 1 నుంచి 27 శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 4 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. పాదయాత్రలో సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కోరారు. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం. దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆయా శాఖల మంత్రులతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి సలహాలు ఇవ్వాలని సూచించారు.
  • పారిశుద్ధ పనులు చేసే కార్మికులకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మెప్మా, సెర్ఫ్‌ సంస్థలో పని చేసే యానిమేటర్లు, బుక్‌ కీపర్లు, విలేజ్‌ పర్సన్‌కు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి ఎక్కువ ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.11500 నిర్ణయం తీసుకున్నాం. పౌర శాఖలో ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం ఇస్తున్నారు. నాణ్యత లేని బియ్యం ఇస్తుండటంతో చాలా చోట్ల తినడం లేదు. వాటిని బయట విక్రయిస్తున్నారు. ఇకపై చౌక దుకాణాల్లో మంచి, నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 5, 10, 15 కేజీల చొప్పున ప్యాక్‌ చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికే చేరవేస్తాం. బియ్యంతో పాటు మరో ఐదు రకాల నిత్యావసర సరుకులు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అందజేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసర వస్తువులను గడపకే చేరవేస్తాం. 
  • రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మరమ్మతులు చేయించి ఆధునీకరిస్తాం. మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజేషన్‌ చేసేందుకు, పౌష్టికాహారం, వేడి వేడి భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. వంట చేసే ఆయాలకు నెలకు రూ.3 వేల వేతనం ఇస్తాం. రాష్ట్రంలో విద్యా క్రమబద్ధీకరణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సహేతుకమైన ఫీజులు తీసుకుంటున్నారా? నాణ్యమైన విద్యను అందిస్తున్నారా అన్న అంశాలను సమీక్షించి చర్యలు తీసుకుంటాం. ఫీజులు, మౌలిక వసతుల కల్పనకు సీఎం ఆదేశించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్‌ స్కూళ్లలో 25 శాతం ఉచితంగా చదువులు చెప్పాలి. ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తున్నాం. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యేలు సమీక్షిస్తారు. 104, 108 వాహనాలన్నింటిని కూడా మరమ్మతులు చేయించి రోడ్లపైకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాన్ని ఏర్పాటు చేస్తాం. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా ఏర్పాటు.
  • ఆశా వర్కర్ల వేతనాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గిరిజన, కొండ ప్రాంతాల్లో పని చేసే ఆశా వర్కర్లకు రూ. 400 నుంచి రూ.4 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 
  • అవినీతికి తావులేని ఇసుక విధానం అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి తప్ప..వ్యక్తులకు ఆదాయం రాకుండా విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నాం. 
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం తీర్మానించింది. రూ.6400 కోట్ల అప్పులకు  2900 కోట్లు ప్రవీడెండ్‌ ఫండ్‌ బ్యాంకుకు జమ చేసేవారు. డీజిల్‌ రేట్లు పెరగడంతో ఆర్టీసీపై భారం పడింది. ఆర్టీసీని విలీనం చేసేందుకు మానవీయకోణంలో వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆర్థిక శాఖ, రవాణ శాఖ మంత్రులు, అనుభవం ఉన్న అధికారులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటాం. 
  • ఎలక్ట్రిక్‌ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉంది. ఆదిశగా స్టడీ చేయాలని సూచించారు. గతంలో నామినేట్‌ చేయబడిన అన్ని రకాల కమిటీలను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
  • అన్ని హామీలను అమలు చేస్తాం..ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతిదాన్ని అధ్యాయనం చేశారు.  ఇది వైయస్‌ జగన్‌ పరిపాలన, రౌతు కొద్ది పాలన ఉంటుంది. దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూసేలా పాలన ఉంటుంది. కొన్ని మీడియాలు వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం గురించి కథనాలు రాస్తున్నాయి. చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నదే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యం. దాన్ని అధిగమిస్తారు.
Back to Top