ప్రజాదర్బార్‌పైనా ఎల్లో మీడియా విష ప్రచారం

దుష్ప్రచారంపై  వైయ‌స్ఆర్‌సీపీ నేతల ధ్వజం

వైయ‌స్ఆర్ జిల్లా: మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో మూడోరోజు భాకరాపురంలోని క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌కు జనం పోటెత్తారు. ఉదయం నుంచే వేలాది మంది తరలి రావడంతో, వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. దీన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషం చిమ్ముతూ, దుష్ప్రచారం చేసింది. క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర రాళ్ల దాడి జరిగిందని, ప్రజా స్పందన లేకపోతే అక్కడికి పార్టీ నాయకులు జనాలను తరలించారని, కాంట్రాక్టర్లు జగన్‌ను నిలదీశారని.. పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. 

ఎల్లో మీడియా విష ప్రచారంపై పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. 

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఏమన్నారంటే..:

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
– పచ్చ మీడియా జగన్‌ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఓర్వలేక పోతోంది. అభూత కల్పనలు సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వైయ‌స్‌ జగన్‌ కార్యాలయంపై దాడి చేశారనడం పచ్చి అబద్ధం. ఇక్కడ అటువంటిది ఏమీ జరగలేదు.
తెల్లవారక ముందు నుంచే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ దుష్ట పరిపాలనను జగన్‌కు వివరించారు. వైయ‌స్‌ జగన్‌ వెంట జనం నడుస్తున్నారనే పచ్చ మీడియా ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. ఇప్పటికైనా ఇలాంటి అభూత కల్పనలు అపాలి. జగన్‌ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి ఆయన్ని తొలగించడం టీడీపీకి, పచ్చ మీడియాకు సాధ్యం కాదు.

పి.రవీంద్రనాథ్‌రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్ జిల్లా అధ్యక్షుడు.
– దేశంలో వైయ‌స్‌ జగన్‌ కు ఉన్న చరిష్మా ఎవరికీ ఉండదు. స్వయంకృషితో ఆయన రాజకీయంగా ఎదిగారు. ఒంటరి పోరాటం చేస్తూ, పార్టీ స్థాపించి, ప్రజల మనసు గెల్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జిల్లాకు వచ్చారు. వైయ‌స్ జగన్‌ను చూసేందుకు ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రజలు ఆయన నివాసం వద్దకు తరలి వస్తున్నారు. వైయ‌స్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలు దారుణం. జగన్‌ ఇంటిపై రాళ్ళ దాడి అని ప్రసారం చేయడం విడ్డూరంగా ఉంది. వేలాది మంది జగన్‌ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. దానిపై కూడా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో దరిద్ర పరిపాలన కొనసాగుతోంది.

సింగారెడ్డి సతీష్‌కుమార్‌రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
– వైయస్‌ జగన్‌ మూడు రోజుల పర్యటనలో విపరీతమైన జన సందోహం. సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు, ప్రజలు. కార్యకర్తలు సెల్ఫీ కోరినా, తీయలేని పరిస్థితిలో జనపోటు. పులివెందుల నుంచి తాతిరెడ్డిపల్లె 25 కి.మీ మాత్రమే. నిన్న (బుధవారం) అక్కడికి వెళ్లిన జగన్‌కు అడుగడుగునా జన నీరాజనం. ఎక్కడికక్కడ ప్రజలు, అభిమానులు తరలి రావడంతో తాతిరెడ్డిపల్లెకు చేరుకోవడానికి ఏకంగా 7 గంటలు పట్టింది.
జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడటంతో అవి పగిలాయి. దాన్ని బూతద్దంలో చూపుతూ జగన్‌గారిపై దాడి అంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం నిజంగా విడ్డూరం. ఇలా విష ప్రచారం చేయడానికి సిగ్గుండాలి. ఇకనైనా ఇలాంటి చౌక బారు రాజకీయాలు మానుకోవాలి.

సాంబశివారెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నేత.
– ఇది చేతకాని ప్రభుత్వం. తమ చేతగానితనాన్ని ప్రజలు జగన్‌కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు. పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ 7 నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్‌ను కలిసేందుకు పులివెందుల వచ్చారు. ఆయన ఎంతో ఓపిగ్గా ఉదయం నుంచి నిలబడే అందరినీ కలిశారు. వారి సమస్యల విన్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి.

Back to Top