మన పిల్లలు బాగా చదవాలి.. ఎదగాలి

పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదు.. కుటుంబాలు అప్పులపాలు కాకూడదు

నెల్లూరులో ఓ పిల్లాడి తండ్రి చెప్పిన మాట‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోను

పిల్లల చదువుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు 

జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ

ప్రతి త్రైమాసికం డబ్బు మరో త్రైమాసికం పూర్తికాకముందే చెల్లింపు

కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తింపు 

ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద గతప్రభుత్వం పెట్టిన రూ.1778 కోట్ల బకాయిలను  చెల్లించాం

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కోసం రూ.9,274 కోట్లు ఖర్చు చేశాం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

ప్రభుత్వ స్కూళ్లలో చేరికలకు ఎమ్మెల్యేలతో రికమెండేషన్లు అడిగే పరిస్థితి

ఏప్రిల్‌ 5వ తేదీన రెండో ద‌ఫా జగనన్న వసతి దీవెన చెల్లిస్తాం

విద్యార్థులు, వారి తల్లులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సచివాలయం: ‘‘చదువులు అనేది ఎవరూ దొంగలించలేని ఆస్తి. చదువు జీవితాలను మార్చేస్తుంది. మన పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదు. పిల్లల చదువుల కోసం ఏ కుటుంబం అప్పులపాలుకాకూడదు, పిల్లల చదువులు ఆగిపోకూడదు. పేదరికం నుంచి ఒక కుటుంబం బయటకు రావాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్దచదువులు చదివాలి అని గట్టిగా నేను నమ్మిన సిద్ధాంతం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం) కింద అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.709 కోట్లను సీఎం వైయస్‌ జగన్‌ జమ చేశారు. అంతకుముందు విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
‘ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల 10.82 లక్షల మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి రూ.709 కోట్లు నేరుగా ఆ పిల్లల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇంతమంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు కల్పించినందుకు సంతోషంగా ఉంది. 

సంక్షేమ పథకాల్లో చాలా సంతోషాన్ని కలిగించే కార్యక్రమం విద్యాదీవెన, వసతి దీవెన అని చెబుతాను. 100 శాతం అక్షరాస్యత ఉన్న సమాజంలో శిశు మరణాలు, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లుల మరణాలు కూడా తక్కువగా ఉంటాయి. క్వాలిటీ ఆఫ్‌ లైఫ్, క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ స్టాండెట్స్‌ కూడా ఎడ్యుకేషన్‌ మారుస్తుంది. ఎడ్యుకేషన్‌ లేని, ఉన్న కుటుంబాన్ని చూస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. 

ఒక పిల్లాడు ఒక ఊరు నుంచి డాక్టర్‌ అయితే.. ఆ కుటుంబం బాగుపడటంతో పాటు ఆ గ్రామం కూడా బాగుపడుతుంది. చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద డాక్టర్లుగా ఎదిగినవారు.. ఆ గ్రామాలను గుర్తుపెట్టుకొని మంచి చేయడానికి చాలా తాపత్రయపడతారు. అమెరికా నుంచి డబ్బు కూడా పంపిస్తుంటారు. వారి జీవితాలను వెనక్కి వెళ్లి చూస్తే.. చదువు వల్లే వారు ఆ స్థాయికి వెళ్లారని ఎవరికైనా అర్థం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు మారాలి. మన పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదు. డబ్బులు లేకపోవడం వల్ల చదువులు ఆగిపోవడం రాకూడదని గట్టిగా నేను నమ్మిన సిద్ధాంతం. 

ఫీజురీయింబర్స్‌మెంట్‌ అంశం మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా.. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర సాగుతున్నప్పుడు ఒక తండ్రి చెప్పిన ఘటన నా కళ్ల ముందు ఒక ఘటన కనిపిస్తుంది. గతంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా కేవలం రూ.30 వేలు మాత్రమే రావడంతో ఆ పిల్లాడి తండ్రి నా దగ్గరకు వచ్చి తన కొడుకు సూసైడ్‌ చేసుకున్నాడని చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభుత్వం అరకొరగా రూ.30 వేలు ఇస్తుంటే.. మిగతా రూ.70 వేలు ఎక్కడ నుంచి తేగలుగుతాం. నా తల్లిదండ్రుల మీద భారం పెరుగుతుందని బాధపడి. తన తండ్రి మీద భారం మోపడం ఇష్టంలేక పిల్లాడు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఆ తండ్రి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. 

ఆ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు. నా చిట్టి చెల్లెల్లు, నా చిట్టి తమ్ముళ్లు గొప్పగా చదవాలి. చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు. చదువులు చదివితేనే మన పరిస్థితులు బాగుపడతాయి. మనం మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్తామని గట్టిగా నమ్మిన వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ఆర్‌. ప్రతి పేదవాడికి తోడుగా నిలబడే గొప్ప కార్యక్రమం చేశారు. ఇంతకుముందున్న నాయకులంతా చెప్పేవారే.. కానీ చేసేవారు కాదు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల జీవితాలు మార్చాలని తాపత్రయం పడినవారు ఎవరూ లేరు. వైయస్‌ఆర్‌ తప్ప. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అనే పథకం ఆ రోజుల్లో నాన్నగారు తీసుకువచ్చారు. నాన్న చనిపోయిన తరువాత మళ్లీ పాలకులు ఆ వివక్ష చూపించారు. మొక్కుబడిగా కొద్దోగోప్పో సరిగ్గా ఇవ్వకపోవడం. పథకాలన్నీ నాశనం చేసే పరిస్థితుల్లోకి తీసుకువచ్చారు. మనం వచ్చిన తరువాత వాటికి జీవం పోశాం. 

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే విద్యార్థులందరికీ పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రతీ త్రైమాసికానికి ఇవ్వడమే కాకుండా.. వసతి దీవెన అనే గొప్ప ఆలోచన చేసి.. బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల కోసం ఆ పిల్లలు ఇబ్బందులుపడే పరిస్థితి రాకూడదని, మెడిసిన్, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ చదివే వారికి రూ. 15వేలు, ఐటీఐ చదివే వారికి రూ.10 వేలు ఇస్తున్నాం. అది కూడా సంవత్సరానికి రెండు దఫాల్లో అందజేస్తున్నాం. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. 

గత ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ పరిస్థితి.. అరకొర ఫీజురీయింబర్స్‌మెంట్‌లు ఇచ్చేవారు. రూ.70 వేలు, లక్ష రూపాయల ఫీజులు ఉన్నప్పటికీ వారిచ్చింది కేవలం రూ.30 వేలు మాత్రమే. అది కూడా సమయానికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. 2017–18, 2018–19 సంవత్సరాలకు ఏకంగా రూ.1778 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఆ బకాయిలను చిరునవ్వుతోనే చెల్లించాం. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కొరకు ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్షరాల మనం ఖర్చు చేసింది.. గత ప్రభుత్వ బకాయిలుతో సహా కలిపి.. రూ.9,274 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా గొప్ప విప్లవాత్మక మార్పును తీసుకువచ్చాం. ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశాం. ప్రతి త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు మరో త్రైమాసికం పూర్తికాకముందే చెల్లిస్తున్నాం. తల్లులు వెళ్లి ఫీజులు కట్టడం మొదలుపెడితే.. కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. కాలేజీల్లో ల్యాబ్‌లు, వసతులు బాగలేకపోయినా తల్లులు ప్రశ్నిస్తారు. ఆ హక్కును తల్లులకు ఇస్తూ.. కాలేజీల్లో కూడా మెరుగైన వసతులు తీసుకువచ్చేలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

 ఈ సంవత్సరానికి సంబంధించి వసతి దీవెన కింద ఇప్పటికే రూ.10 వేలు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా ఏప్రిల్‌ 5వ తేదీన ప్రజల్లోకి వెళ్లి ఏదో ఒక చోట బహిరంగ సభ ద్వారా అందజేస్తాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించండి.. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ వర్తింపుకు, వసతి దీవెన వర్తింపునకు ఎలాంటి నిబంధనలు లేవు. అందరికీ వర్తింపజేస్తాం. కుటుంబాలు బాగుపడాలంటే.. పిల్లలు పెద్దచదువులు చదివితేనే భావి ప్రపంచంలో పోటీవాతావరణంలో మెరుగైన ఉద్యోగాలు చేస్తూ జీతాలు సంపాదిస్తూ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ జీవిస్తారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి అన్నగా, తమ్ముడిగా, ఆ పిల్లలకు మంచి మేనమామగా ఇచ్చే గొప్ప కార్యక్రమం ఇది. దీని వల్ల సంపూర్ణంగా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. మొట్టమొదటిసారి ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి గవర్నమెంట్‌ స్కూళ్లకు చేరికలు జరుగుతున్నాయి. మనం అధికారంలోకి రాకముందు 2018–19లో ప్రభుత్వ స్కూళ్లలో 37.60 లక్షల పిల్లలు ఉంటే.. ఈరోజు 43.60 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. దాదాపు 6 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్‌ బడుల్లోకి చేరుతున్నారు. స్కూళ్లలో చేరికల కోసం ఎమ్మెల్యేలు రెకమండేషన్‌ లెటర్లు ఇచ్చే పరిస్థితి తీసుకువచ్చాం. నాడు–నేడు అనే గొప్ప కాన్సెప్టుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇంతకుముందు క్లాస్‌ టీచర్‌కే దిక్కులేని పరిస్థితి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్టును తీసుకువస్తున్నాం. మొత్తం ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకువస్తున్నాం. 

గతంలో టెక్ట్స్‌ బుక్స్, యూనిఫాం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి.. ఈరోజు జగనన్న విద్యాకానుక పేరుతో మూడు జతల యూనిఫాం, షూ, స్కూల్‌ బ్యాగ్, బైలింగ్వల్‌ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌ ఇస్తున్నాం. అక్కడి నుంచి మొదలుపెడితే.. పిల్లల మధ్యాహ్న భోజన మెనూ గురించి ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరేమో.. పిల్లలు ఏం తింటున్నారో అని ఆలోచించి.. ఆరోజుకు ఒక మెనూ ఇస్తూ ఆ పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో మిడ్‌డే మిల్స్‌కు సరుకుల కూడా 8–9 నెలల వరకు డబ్బులు ఇచ్చేవారు కాదు. ఆయాలకు కూడా వేతనాలు ఇచ్చేవారు కాదు. గతంలో సంవత్సరానికి రూ.600 కోట్లు అయ్యే కార్యక్రమానికి.. ఈరోజు రూ.18 వందల కోట్లు అవుతుంది. 

అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చి స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ను విపరీతంగా పెంచే కార్యక్రమం దిశగా అడుగులువేస్తున్నాం. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇవే కాకుండా.. హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో సిలబస్‌లో కూడా మార్పులు చేస్తున్నాం. జాబ్‌ ఓరియంటెడ్‌ సిలబస్‌ను తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అప్రెంటిస్‌షిప్‌ విధానం కూడా అమలయ్యేలా అడుగులు ముందుకుపడుతున్నాయి. ఎడ్యుకేషన్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు బాగుపడాలి, మంచి జరగాలి. పేదరికం అనేది చదవులకు అడ్డకాకూడదు.. ప్రతి పేదవాడు కూడా గొప్పగా చదవాలని ఆరాటపడుతూ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top