రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్‌ రాద్దాంతం

 

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే పల్నాడులో పర్యటన

సరస్వతి పవర్‌ భూములపై ఆరోపణల పర్వం

మాజీ ఎమ్యెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజం

సరస్వతి పవర్‌ భూములు ప్రభుత్వం కేటాయించలేదు

వాటిని జగన్‌గారు రైతుల నుంచి కొనుగోలు చేశారు

ఆనాడే నాలుగు రెట్లు ఎక్కువ ధర చెల్లించి కొన్నారు

ఆ భూములపై ఇన్నేళ్లలో, ఎవరైనా ఫిర్యాదు చేశారా?

సూటిగా ప్రశ్నించిన కాసు మహేష్‌రెడ్డి

అక్కడ అటవీ, అసైన్డ్‌ భూములుంటే విచారణ చేయండి

నిజాలు నిగ్గు తేల్చండి. తప్పని తేలితే ఏ చర్యకైనా సిద్ధం

ఆ ప్రాంతంలో సంఘీ, మైహోమ్, ఇమామ్‌ సిమెంట్స్‌..

కంపెనీలు కూడా పరిశ్రమలకు భూములు తీసుకున్నాయి

కానీ, ఆ సంస్థలేవీ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించలేదు

మరి వాటిని వదిలి సరస్వతి పవర్‌నే ఎందుకు టార్గెట్‌?

రాష్ట్రంలో శాంతి భద్రలు దారుణంగా క్షీణించాయి

దాన్నుంచి డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే ఇదంతా కాదా?

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కాసు మహేష్‌రెడ్డి..

 నర్సారావుపేట:    రాజకీయ ప్రయోజనాల కోసమే సరస్వతి పవర్‌ భూములపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ రాద్ధాంతం చేస్తున్నారని, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా పల్నాడులో పర్యటించిన ఆయన, ఆ సంస్థ భూములపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆక్షేపించారు. సరస్వతి పవర్‌ భూములను ప్రభుత్వం కేటాయించలేదని, 1,011 ఎకరాలను జగన్‌గారు దాదాపు 20 ఏళ్ల క్రితం రైతుల నుంచి కొనుగోలు చేశారని ఆయన వెల్లడించారు. అప్పట్లోనే మార్కెట్‌ ధర కంటే ఆయన నాలుగు రెట్లు ఎక్కువ చెల్లించారని తెలిపారు. అందుకే ఇన్నేళ్లలో ఎవరూ, ఎక్కడా ఆ భూములపై ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు.
    ఆ రోజుల్లో ఎవరూ అక్కడికి వెళ్లడానికి చొరవ చూపని పరిస్థితుల్లో, అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాథి కల్పించే లక్ష్యంతో జగన్‌గారు అక్కడ భూములు కొనుగోలు చేశారని తెలిపారు. తద్వారా ఆ ప్రాంత అభివృద్ధిని ఆయన కాంక్షించారని చెప్పారు. 
    ఇప్పుడు కూడా పల్నాడులో బాగా వెనకబడిన ప్రాంతమైన మాచవరం మండలంలో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్‌ కాలేజీ పనులు మొదలు పెట్టడమే కాకుండా, 30 పడకలు కూడా లేని చోట ఏకంగా 600 పడకలతో ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తి చేశారని కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు. అది ఆ ప్రాంత అభివృద్ధిపై జగన్‌గారికి ఉన్న చిత్తశుద్ధి అని గుర్తు చేశారు.
    ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఆరోపిస్తున్నట్లుగా సరస్వతి పవర్‌ భూముల్లో అటవీ, అసైన్డ్‌ భూములుంటే, విచారణ జరిపించి, నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే సవాల్‌ చేశారు. అక్కడ తమ తప్పు ఉందని తేలితే, ఏ చర్యకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నిజానికి ఆ ప్రాంతంలో సంఘీ, మైహోమ్, అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్, ఇమామ్‌ సిమెంట్స్‌ కంపెనీలు కూడా పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకున్నాయని, కానీ అవేవీ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించలేదని వెల్లడించారు. అయినా వాటన్నింటినీ వదిలి కేవలం సరస్వతి పవర్‌నే  టార్గెట్‌ చేయడం, డైవర్షన్‌ పాలిటిక్స్‌ కాక మరేమిటని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయన్న ఆయన, దాన్నుంచి డైవర్షన్‌ కోసమే ఈ రాద్దాంతమని స్పష్టం చేశారు.
    నిజానికి టీడీపీ, కాంగ్రెస్‌ కోర్టు ద్వారా అడ్డుకోకపోయి ఉంటే, జగన్‌గారు అక్కడ కంపెనీ ఏర్పాటు చేసి ఉండేవారని కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. ఎప్పటికైనా అక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం కాలుష్య, మైనింగ్‌ పర్మిషన్‌ తీసుకుని, లైసెన్సు కూడా పునరుద్దరణ చేసుకున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పల్నాడుకు వచ్చిన పవన్‌కళ్యాణ్‌ అక్కడ అభివృద్ధి కోసం మాట్లాడుతారనుకుంటే, రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడడం బాధాకరమని అన్నారు.
    పిడుగురాళ్ల, దాచేపల్లిలో డయేరియా బారిన పడి చనిపోయిన వారి గురించి మాట్లాడి, గతంలో మంజూరు చేసిన రక్షిత మంచినీటి పథకం కార్యరూపం దాల్చేలా పవన్‌ చొరవ చూపుతారని ఆశిస్తే, చివరకు తమకు భంగపాటు తప్పలేదని కాసు మహేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top