ముమ్మాటికీ పవన్‌ దత్తపుత్రుడే

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

కాదంటే 2024 ఎన్నికల్లో ఆ విషయాన్ని స్పష్టం చేయాలి

ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా? అన్నది చెప్పాలి

రైతు కుటుంబాలకు సాయం పేరుతో పవన్‌ రాజకీయం

రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ విమర్శలు

నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్న జనసేనాని

ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రకటన

దేశంలో ఎక్కడా కౌలు రైతులను ఆదుకోవడం లేదు

చివరకు పీఎం కిసాన్‌లో కూడా కేంద్రం ఇవ్వడం లేదు

పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై కేంద్రాన్ని ఒప్పించాలి

కౌలు రైతులకు మేలు జరిగేలా చట్టం చేయించాలి
 
గత ప్రభుత్వంలో ఏనాడూ రైతులను పట్టించుకోని పవన్‌

చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేయకపోయినా అడగలేదు

ఆ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కనీసం ప్రశ్నించలేదు

అప్పుడైనా, ఇప్పుడైనా ఎంతసేపూ జగన్‌గారిపైనే విమర్శలు

అదే పవన్‌కళ్యాణ్‌ గతి తప్పిన అనైతిక రాజకీయం

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య

తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముమ్మాటికీ చంద్ర‌బాబు దత్తపుత్రుడేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, 
మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం సీఎం వైయ‌స్‌ జగన్‌ తెచ్చిన పథకాలు అమలు చేస్తుంటే పవన్‌కి కనపడటం లేదా? అని ప్రశ్నించారు.  ‘2014లో తనను చూసి ఓటేయమన్నారు. టీడీపీ, బీజేపి తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానన్నారు. కానీ రైతులకు రుణమాఫీ పేరుతో టీడీపీ, బీజేపీ దగా చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు?. ఐదేళ్లలో కేవలం 15 వేల కోట్లను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంటే మీరేం చేస్తున్నారు?, ఎందుకు ఆనాడు మీ నోట మాట రాలేదు?,  మీకు తెలిసిందల్లా కేవలం వైయ‌స్ జగన్ ని ప్రశ్నించటం మాత్రమే అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు:
    ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు పేరుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాజకీయం చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించి, రాజకీయ కార్యక్రమం చేయడాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేయడాన్ని ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీద, చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జగన్‌గారి రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, పవన్‌ ఇక్కడ రైతులకు మేలు జరగడం లేదని అసత్యాలు చెబుతున్నారు.

అంతరాత్మను ప్రశ్నించుకోవాలి:
    2014లో ఇదే పవన్‌కళ్యాణ్‌ ఏం చెప్పారు. తనను చూసి బీజేపీ, టీడీపీని గెలిపించాలని కోరారు. వారు తప్పు చేస్తే నిలదీస్తానని అన్నారు.
ఆ ఎన్నికల్లో రైతుల రుణాలు రూ.86,712 కోట్లు మాఫీ చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వారిని దగా చేశారు. ఒకసారి పవన్‌ తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. రూ.86 వేల కోట్లకు పైగా ఉన్న రైతు రుణాలను రకరకాల కమిటీల పేరుతో 24 వేల కోట్లకు కుదించి, చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వని చంద్రబాబు, రైతులను మోసం చేశాడు. ఆ సమయంలో పార్టనర్‌గా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఏనాడూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. తప్పు పట్టలేదు.

పవన్‌ ప్రశ్నించడం అంటే..:
    పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించడం అంటే, విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, జగన్‌గారిని విమర్శించడమే. ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఏమీ చేయడం లేదని విమర్శించడమే.
    ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించలేదు. విత్తనాల సేకరణ బకాయిలు చెల్లించలేదు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేయలేదు. 

కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు?:
    రైతులకు అండగా జగన్‌గారి ప్రభుత్వం నిలబడినట్లుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ నిలబడ్డాయా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఆ ప్రభుత్వాలు ఏవీ కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కౌలు రైతులకు ఏ విధంగానూ మేలు చేయడం లేదు. అయినా ఏనాడూ పవన్‌కళ్యాణ్, కేంద్రాన్ని నిలదీయడం లేదు.
    కానీ రైతులకు ఇన్ని రకాలుగా మేలు చేస్తున్న జగన్‌గారిపై మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకంలో కౌలు రైతులకు లబ్ధి చేయడం లేదు. అయినా ఒక్కసారి కూడా ప్రశ్నించరు. పైగా వెటకారంగా, జగన్‌గారికి కౌలు రైతుల సమస్యలు తెలియదని, వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉండవన్న విషయం తెలియదని అంటున్నారు.

కేంద్రం నుంచి ఎందుకు ఇప్పించడం లేదు?:
    ఇప్పుడు మీరు కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఇస్తున్నామంటున్నారు కదా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీది అంటున్నారు కదా, మరి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా ఎందుకు తీసుకురావడం లేదు. మీరు కేంద్రంతో అంట కాగుతున్నా, ఆ పని ఎందుకు చేయడం లేదు.
    జగన్‌గారు అధికారం కావాలంటున్నాడు. నాకు అధికారం ఉందా? ఇన్ని పనులు చేస్తున్నాను అని ఆనాడు అన్నారు కదా? మరి ఇప్పుడు మళ్లీ అధికారం కావాలని ఎందుకు అనుకుంటున్నారు.

ఏం సాధించారు?:
    ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవని, రాష్ట్ర ప్రజల కోసమే ఆయనతో తగాదా పడ్డానని చెబుతున్న పవన్‌కళ్యాణ్, 2019 తర్వాత ఏం సాధించారు? కనీసం ప్రత్యేక హోదా అయినా సాధించారా?
2019 ఎన్నికల ఫలితాలు రాగానే, జగన్‌గారు చెప్పారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది కాబట్టి, హోదా కోసం పట్టు బట్టలేమని చెప్పారు.
    మరి మీరు వారితో సయోధ్యలోనే ఉన్నారు కదా? ఏం సాధించారు? హోదా తీసుకురాగలిగారా? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేయకుండా నిలబెడుతున్నారా? ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పండి.

అప్పుడో మాట. ఇప్పుడొక మాట:
    వైయ‌స్ జగన్‌గారిని సీబీఐ దత్తపుత్రుడు అంటున్నారు. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఏం మాట్లాడారు.
వైయ‌స్ జగన్‌గారి వ్యతిరేక ఓట్లు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని అన్నారు. చంద్రబాబుతో కలవాలని బీజేపీకి కూడా చెబుతానన్నాడు.
    మరి ఆనాడు 2014లో ఏం చెప్పారు. అప్పుడు పార్టీ పెట్టి చంద్రబాబుకు ఓటేయమన్నారు. ఆ తర్వాత 2019లో ఏం చెప్పారు. చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలకపోతే జగన్‌గారికి మేలు జరుగుతుంది కాబట్టి, విడిగా పోటీ చేశానని చెప్పారు. మళ్లీ ఇప్పుడేమంటున్నారు. 2024లో జగన్‌గారి వ్యతిరేక ఓట్లు చీలకుండా అందరూ ఏకం కావాలని కోరుతున్నానన్నారు. ఆ విధంగా చంద్రబాబుకు మేలు చేయాలని పవన్‌కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారు.

దత్తపుత్రుడు కాకపోతే..:
    మీరు చంద్రబాబు దత్తపుత్రుడు కాకపోతే, 2024లో ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తాడో చూద్దాం. ఇప్పటం మీటింగ్‌లో చెప్పిన దానికి భిన్నంగా వెళ్తారేమో చూడాలి.
    మరి వైయ‌స్ జగన్‌గారిని సీబీఐ దత్తపుత్రుడు అంటున్నావు కదా. ఇదే వైయ‌స్ జగన్‌గారి గురించి పార్లమెంటులో బీజేసీ సభ్యులు ఏమన్నారో చూడండి. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం మంచి. బయటకు పోయాడు కాబట్టే, ఆయనపై కేసులు పెట్టారన్నారు.
    అలా సోనియా, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు జగన్‌గారిని నమ్మారు కాబట్టే, 2019లో ఆయనకు ఘనంగా పట్టం కట్టారు. మీరు కూడా 2024లో ఒంటరిగా ఎన్నికలకు పోతే, ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తే, చంద్రబాబు దత్తపుత్రుడు కాదంటాము.

ఇదే మా డిమాండ్‌:
    కేంద్రంలో మీకు చేతనైతే, మీలో నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంతో కౌలు రైతుల కోసం చట్టం చేయించాలి. మీరు ఆ పని చేస్తే మేము కూడా అభినందిస్తాం. మేము ఒకటే డిమాండ్‌ చేస్తున్నాం. మీలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంతో పోరాడి, వెంటనే కౌలు రైతుల కోసం చట్టం చేయించండి.

నర్సీపట్నం నాయకుడికి సమర్థనా!:
    ఎవరైనా ప్రశ్నిస్తే, మేము దాడులు చేస్తున్నామా? నర్సీపట్నం నాయకుడి మాటలు వినసొంపుగా ఉన్నాయా? అలాంటి దిగజారుడు మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా? నీవు కనీసం వాటిని ఖండించవు. ప్రశ్నించవు. ఎంతసేపూ చంద్రబాబు మాటలనే వల్లె వేస్తున్నావు. అందుకే
ఇవాళ్టి సభలో కూడా నర్సీపట్నం నాయకుడి గురించి మాట్లాడావని మాకు తెలుసు.

తప్పనిసరిగా ఆదుకుంటాం:
    ఎక్కడైనా, ఏమైనా లోపాలుంటే వెంటనే సరి దిద్దుకుంటాం. బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకున్నాం. చివరకు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతుల కుటుంబాలు.. 458 గుర్తించి వారికి కూడా పరిహారం ఇచ్చాం.

సిద్ధంగా ఉన్నాం:
    దసరా పండగ తర్వాత చూపిస్తానంటున్నాడు. గతంలో కూడా అలా చాలా పండగలు చెప్పాడు. అవి వచ్చాయి. పోయాయి. కాబట్టి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం.

బాబు ప్రయోజనాల కోసమే:
    గత మార్చి 14న ఇప్పటం మీటింగ్లో ఏం చెప్పాడు? ఇప్పుడు ఏమంటున్నాడో చూస్తున్నాం. చంద్రబాబు పార్టీ కేడర్‌లో ధైర్యం పోయింది కాబట్టి, వారికి తిరిగి ధైర్యాన్నిచ్చేలా ఆనాడు ఇప్పడంలో మాట్లాడాడు.
మళ్లీ ఇవాళ అసత్యాలు చెబుతున్నాడు. ఏదేమైనా 2024లో టీడీపీతో కలిసే వెళ్తాడు.
    రాజధాని రైతులను మోసం చేశాడు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధగ్రస్తులకూ ఏదో చేస్తానని చెప్పి మోసం చేశాడు. ఇంకా ఎందరిని మోసం చేస్తాడు.

    అదే వైయ‌స్‌ జగన్‌గారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారు. మూడేళ్లలోనే మేనిఫెస్టోలో 95 శాతం ఎవరైనా అమలు చేశారా? ఇంకా చెప్పనివి కూడా జగన్‌గారు ఎన్నో చేశారు.

నిజమైన బీసీ ఆ పని చేయడు:
    రాజకీయాల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే, ప్రశ్నించకూడదా? ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోకూడదా? దాన్ని తప్పు పట్టకుండా, సమర్థించడం ఎంత వరకు సబబు? అంటే రాజకీయాల్లో ఉండి, ఏదైనా చేయొచ్చా?.
    నర్సీపట్నం నాయకుడు నిజమైన బీసీ అయితే, ఇలా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేయడు. ఎందుకంటే వారిలో నిజాయితీ ప్రవర్తన ఉంటుంద‌ని పేర్ని నాని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top