అబద్ధాలు ఆపండి.. బాబూ

మాజీ మంత్రి కన్నబాబు 

వైయ‌స్ జగన్‌ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు

వైయ‌స్ జగన్‌ హయాంలోనే జీడీపీ వృద్ధి చెందింది 

చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఒక బ్రహ్మపదార్థం

రూ. 14 లక్షల కోట్లు మా హయాంలో అప్పులు చేసినట్టు తప్పుడు ప్రచారం

అసెంబ్లీలో చెప్పిన రూ.6 లక్షల కోట్ల అప్పుల మాట అబద్ధమా?

కక్షసాధింపునకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ మారిపోయింది

తాడేపల్లి: మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని.. చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో రిసోర్స్‌ ఫండ్‌ 10,500 కోట్లు సాధించామని తెలిపారు. పయ్యావుల కేశవ్‌ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అప్పులపై దుష్ప్రచారం:
– మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు కేవలం రూ.6.46 లక్షల కోట్లు అని మీ బడ్జెట్‌లోనే క్లియర్‌గా చెప్పారు. కాగ్‌ రిపోర్ట్‌ కూడా అదే నిర్ధారించింది. దాన్నే సాక్ష్యాలతో సహా, ప్రజలకు వివరించాం.
– అయినా అప్పటికి రాష్ట్ర అప్పులు రూ.9.74 లక్షల కోట్లు అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. మీ రాజకీయ జీవితమంతా అబద్దాలతోనే నిండిపోయింది. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్‌సిక్స్‌ ఎగ్గొట్టడానికే పదే పదే అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ప్రజలను మోసం చేసి, నయవంచనకు గురి చేయడానికే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.

అమానవీయ మాటలు:
– తన తల్లిని అవమానించేలా జగన్‌గారే పోస్ట్‌లు పెట్టారంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుగారు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
– నిజానికి ఆ పోస్టు పెట్టిన వ్యక్తి, చంద్రబాబుగారి ఐ–టీడీపీ సభ్యుడే అని, అతణ్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసి కూడా ఆయన అమానవీయంగా మాట్లాడుతున్నారు.
– రాజకీయంగా లబ్ది వస్తుందనుకుంటే ఎంతటి స్థాయికైనా చంద్రబాబు దిగిపోతారు.

తానే అబద్ధాని సృష్టించి..!:
– ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబుగారి సతీమణిని ఉద్దేశించి ఎవరూ, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆమె పేరు ప్రస్తావించలేదు.
– అయినా అసెంబ్లీలో తన భార్యను ఏదో అన్నారంటూ, చంద్రబాబు తనకు తానే ఒక అబద్ధాన్ని సృష్టించి, నానాయాగీ చేశారు. స్వయంగా తన భార్య మీద తాను సృష్టించిన అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, డ్రామాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేశారు.
– అధికారం కోసం, రాజకీయ స్వలాభం కోసం ఒక మనిషి, ఒక రాజకీయ నాయకుడు చేయకూడని ఎన్నో పనులు చంద్రబాబు చేశారు. – రాజకీయంగా తన మేలు కోసం ఎవ్వరినైనా వాడుకోవడం చంద్రబాబు నైజం.

మీరు ఎన్డీఏలో ఉండి కూడా చేయలేనిది!:
– మా ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, అదే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఎప్పుడు వెళ్లినా ఏదో ఒకటి సాధించుకొస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.
– కానీ అది పూర్తిగా అవాస్తవం. నాడు సీఎం తన ఢిల్లీ పర్యటనల్లో రాష్ట్రానికి అనేకం సాధించారు. అందుకు ఒక ఉదాహరణ:
– రాష్ట్ర విభజనతో 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు  ఏర్పడిన రీసోర్స్‌ గ్యాప్‌ రూ.17వేల కోట్లు భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. 
– కానీ, విభజిత రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో కేంద్రం నుంచి కేవలం రూ.3900 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. నాటి సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీలో పర్యటించినా, నాలుగేళ్లు ఎన్డీఏలో కొనసాగినా, మిగిలిన రీసోర్స్‌ గ్యాప్‌ ని«ధులు రాబట్టలేకపోయారు.
– అదే జగన్‌గారు ఎన్డీఏలో కొనసాగకపోయినా, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిధుల్లో రూ.10,460.87 కోట్లు విడుదల చేయించారు. 

వైయస్సార్‌సీపీ–ఆర్థిక పురోగతి:
– ఇంకా తమ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య సగటు వార్షిక వృద్ధి రేట్‌ (సీఏజీఆర్‌) ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) గణనీయంగా పెరిగి 13.5 శాతం నమోదు కాగా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అది కేవలం 10.50 శాతమే అంటూ.. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు అనడానికి అది నిదర్శనమని అన్నారు.
– కానీ, వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఆ 5 ఏళ్లలో రెండేళ్లు కరోనా మహమ్మారి అన్నింటిపై ప్రభావం చూపింది. అయినప్పటికీ జీఎస్‌డీపీ గణనీయంగా పెరిగింది. అందుకే దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర వాటా (జీఎస్‌డీపీ), టీడీపీ హయాంలో కంటే పెరిగింది.
– జీడీపీలో జీఎస్‌డీపీ వాటా టీడీపీ ప్రభుత్వ హయాంలో 4.47 శాతం ఉండగా, వైయస్సార్‌సీపీలో ఆ వాటా 4.83 శాతానికి పెరిగింది. 

అందులో మీ ఘనత లేదు:
– తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో కేంద్ర పన్నుల నుంచి అత్యధిక వాటా రూ.5,776 కోట్లు పాందామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి అందులో ఈ ప్రభుత్వ ఘనత ఏమీలేదు.
– కేంద్రం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఎక్కువ నిధులు ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం పన్నుల నుంచి ఎక్కువ నిధులు ఇచ్చింది.
– అన్ని రాష్ట్రాలకు కలిపి తొలి విడతగా ఈ ఏడాది జూన్‌లో రూ.1,39,751 కోట్లు, ఆ తర్వాత అక్టోబరులో రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వ గొప్పతనం ఏమిటి?

పాలు, కోడిగుడ్ల బిల్లులు ఎగ్గొట్టారు:
– మా ప్రభుత్వం చిక్కీల బిల్లు పెండింగ్‌లో పెట్టి పోయిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. ఇంతకంటే హేయం మరొకటి ఉండదు.
– మరి అలా అనుకుంటే 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోతూ, పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇచ్చే పాలు, కోడిగుడ్లకు సంబంధించి రూ.148 కోట్లు పెండింగ్‌లో పెట్టింది. దాన్ని మేం చెల్లించాం. మరి దాన్నేమనాలి?. 
– ఇంకా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతూ అన్నీ కలిపి రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టిపోయారు. విద్యుత్‌ డిస్కంలకు రూ.21,541 కోట్లు బకాయిలు పెట్టారు. అవన్నీ జగన్‌ తీర్చలేదా? 

పరిమితికి మించి అప్పులు చేసింది మీరే:
– వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై కేంద్రం విస్మయం చెందిందని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. కానీ ఏనాడూ మా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేయలేదు.
– నిజం చెప్పాలంటే, అది టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 2014–19 మధ్య ఆ ప్రభుత్వం పరిధికి మించి రూ.16,418.99 కోట్ల అప్పులు చేసి పోతే, మా ప్రభుత్వం వచ్చాక ఆ రుణం తీర్చింది.

సూపర్‌సిక్స్‌ అమలు చేయరేం?:
– రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరాయని ఎన్నికల ముందు  గగ్గోలు పెట్టిన టీడీపీ.. ఆ సమయంలో కూడా సూపర్‌సిక్స్‌ హామీలు ఘనంగా ప్రకటించింది. పక్కాగా అమలు చేస్తామని చెప్పింది.
– కానీ, ప్రభుత్వ వాస్తవ అప్పులు కేవలం రూ.6,46,531 కోట్లు మాత్రమే అని, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. మరి అలాంటప్పుడు ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి, సూపర్‌సిక్స్‌ను ఎందుకు అమలు చేయడం లేదు?.

మరి అది దగా సంస్థేనా?:
– ఏపీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను, బ్యాంకింగ్‌ కంపెనీతో సమానంగా ఏర్పాటు చేసి, దాని ద్వారా నిధులు సేకరించి, పథకాల కోసం ఖర్చు చేశారని పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఆ సంస్థకు ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి, అది కచ్చితంగా ఫ్రాడ్‌ అని ఆయన ఆక్షేపించారు.
– అధికారంలోకి వస్తే రైతు రుణాలు దాదాపు రూ.94,937 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ, రైతుల రుణమాఫీ కోసం కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే వ్యయం చేసింది. అలా రైతులను మోసం చేసింది.
– ఇంకా అందుకోసం ప్రత్యేకంగా రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారు.
– అంటే చేయని రుణమాఫీ చేశామని చెప్పి మోసం చేయడం తప్పు కాదు కానీ.. రైతుల హామీలు అమలు చేసేందుకు మేం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం తప్పా? ఇదేనా మీ ఆర్థిక నిపుణత?.

వైఫల్యాలు కప్పి పుచ్చేందుకే..:
– తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, హమీలు అమలు చేయడం లేదని చెప్పుకోలేకనే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై పచ్చి అబద్ధాలు సృష్టించి ప్రచారం చేయడమే కాకుండా తనను తాను గొప్ప మేధావిగా ప్రచారం చేసుకుంటున్నారు. 
– చంద్రబాబుకి సంక్షేమం మీద శ్రద్ద లేదని ఎవరికైనా అర్థమవుతుంది. 

5 నెలలు. 57వేల కోట్లు:
– మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో సంక్షేమ పథకాల కింద ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం.
– మరి ఈ ప్రభుత్వం ఏ ఒక్క  పథకం అమలు చేయకుండానే, కేవలం ఈ 5 నెలల్లోనే రూ.57వేల కోట్ల అప్పు చేసింది. దేని కోసం ఆ రుణం?
– అయినా మీది ఆర్థిక నైపుణ్యం ఉన్న ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. అదే మీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.

జీఓల్లో గోప్యత ఎందుకు?:
– పారదర్శక ప్రభుత్వం అని చెప్పే మీరు ఈ ఐదు నెలల్లో సీక్రెట్‌ జీవోలు ఇవ్వలేదా?.
– సోషల్‌ మీడియా అరెస్టులన్నీ ఎందుకు పబ్లిక్‌ డోమైన్‌లో ఎందుకు చూపించడం లేదంటూ.. సీక్రెట్‌ జీవోల జాబితా చూపారు.

సోషల్‌ మీడియాపై కుట్ర:
– విజయమ్మ గారిపై ఐ–టీడీపీ ద్వారా దారుణంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని ఆమె ఖండిస్తూ లేఖ రాస్తే, అది ఫేక్‌ అంటూ మరో ప్రచారం చేశారు. చివరకు ఆమె వీడియో ద్వారా చెప్పాల్సి వచ్చింది.
– సీనియర్‌ అని చెప్పుకోవడం కోసమైనా, హుందాతనం ప్రదర్శించనక్కర్లేదా?.
– మీరు చేసిన దారుణ అసత్య ప్రచారాలు, మార్ఫింగ్‌ వీడియోలను జగన్‌గారు కాబట్టి తట్టుకున్నారు. ఇప్పుడు కూడా వందలాది సోషల్‌ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు. నోటీసులు పంపిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. అరెస్టు చేస్తున్నారు. చివరకు జైళ్లకూ పంపిస్తున్నారు. 
– మొత్తంగా పోలీస్‌ వ్యవస్థ చంద్రబాబుకి దాసోహం కావడం దౌర్భాగ్యం. రీట్వీట్‌ చేసినా కేసులు పెడుతున్నారు. 
– తప్పుడు పోస్టులు ఎవరు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. మరి మేమిచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కదానిపై అయినా స్పందించారా?.
– జగన్‌ హయాంలో కక్ష సాధింపులు జరిగాయని చెప్పడం హాస్యాస్పదం. అర్థరాత్రి అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. రాబోయే ప్రభుత్వాలకు ఎలా పగ తీర్చుకోవాలో మీరు నేర్పిస్తున్నారు.

అంతా ప్రచార ఆర్భాటమే:
– ఉచిత ఇసుక గురించి చంద్రబాబు చెప్పినప్పుడల్లా నవ్వొస్తుంది. 2024లో మా ప్రభుత్వం ఉన్నంత వరకు లారీ ఇసుక మా జిల్లాలో రూ.16 వేలకు వచ్చేది. ఈరోజు రూ.26 వేలతో కొనాల్సిన దుస్థితి. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్నారు. 
– పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు. అసెంబ్లీ సమావేశాల్లో దానికి సమాధానం చంద్రబాబు చెప్పాలి. ప్రాజెక్టును బ్యారేజ్‌గా స్థాయి ఎందుకు తగ్గిస్తున్నారు.
– చంద్రబాబు హయాంలో మోసపోని వర్గమంటూ ఏదీ ఉండదు.  మద్యం సేవించే వారిని ఎవరిని అడిగినా రూ.99 లిక్కర్‌ గురించి, దాని నాణ్యత గురించి చెబుతారు. వీరు తీసుకొచ్చిన ఇదే క్వాలిటీ, ఇదే బ్రాండ్‌ మందు వేరే రాష్ట్రాల్లో రూ.80కే వస్తుంటే ఇక్కడ మాత్రం రూ.99కి అమ్ముతున్నారు. 
– సభలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్‌ చేస్తున్నారు. అందుకేనా మీరు రోజూ సభకు వస్తున్నది. ఇప్పటికైనా డైవర్షన్‌ పాలిటిక్స్‌ మాని, ప్రజా సమస్యలపై చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోండి.

Back to Top