మరపురాని మహానేత

ఆ రూపం ఎప్పటికీ చెదరని జ్ఞాపకమే..

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన మహానేత పాలన

ప్రజాప్రభుత్వం అన్నమాటకు స్వచ్ఛమైన నిర్వచనం

మరణించి 11 ఏళ్లు గడిచిపోయినా.. కొట్లాది గుండెల్లో కొలువైన నేత

ప్రజలతో విడదీయలేని బంధం వైయస్‌ఆర్‌

కొందరుంటారు.. తమదైన వ్యక్తిత్వంతో బలమైన ముద్ర వేస్తారు. చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోతారు. ప్రజల హృదయాల్లో అలా నిలిచిపోతారు. మనిషిగా, మంచిమనిషిగా ప్రజలందరి మనిషిగా పది కాలాలపాటు ప్రజల గుండెల్లో కొలువుదీరే వుంటారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వమే.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిది. మహానేత మనందరి మధ్య నుంచి వెళ్లి పదకొండు సంవత్సరాలు పూర్తిగా గడిచిపోయాయి. 12వ వర్ధంతి వచ్చింది. మరిచిపోలేని నవ్వు, రాజసంవుట్టి పడే నడక, ప్రేమ మీర పలకరింపు. అనుక్షణం ప్రజలకోసం పరితపించిన ఆ మనసు మన జ్ఞాపకాలను తడుతూనే వుంటుంది. గుండె తడి తెలిసేలా చేస్తూనే వుంటుంది. 

గొప్ప ముఖ్యమంత్రిగా గుర్తుచేసుకుంటూనే ఉంటాం..
డాక్టర్‌ వైయస్‌ఆర్‌కు ప్రజాభిమానమే పెట్టినకోట. ఆ కోటలో ఆయన మహారాజులా జీవించారు. మనస్సున మారాజులా గుర్తుండిపోయారు. రాజకీయాల్లో నాయకులెందరున్నా వైయస్‌ఆర్‌ ఒక్కడిగా వెలిగిన ప్రత్యేకతను స్వంతం చేసుకున్నారు. చేసే ప్రతి పనిలోనూ వందకు వందశాతం అంకితభావం. అందుకే డాక్టర్‌గా, రాజకీయ నాయకునిగా ఆయన్ను మరచిపోలేం. ముఖ్యమంత్రుల్లో మరింత గొప్ప ముఖ్యమంత్రిగా ఆయన్ను గుర్తు చేసుకుంటూనే వుంటాం. 

తలపెట్టినవన్నీ నెరవేర్చాలనే దృఢ సంకల్పం..
ఎన్నెన్నో కలలు. ఎన్నెన్నో ఆలోచనలు. ఆ కలల్లో ...ఆలోచనల్లో ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు. తలపెట్టినవేవీ నెరవేరకుండా పోకూడదన్న దృఢసంకల్పం. వైయస్‌ఆర్‌ను అనుక్షణం రగిలించి కదిలించిన ఇంధన శక్తులు ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. అట్టడుగు వర్గాలు, పేదల గురించి వైయస్‌ఆర్‌ చేసిన ఆలోచనలు ప్రజా ప్రభుత్వం అన్నమాటకు స్వచ్ఛమైన నిర్వచనమిచ్చాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలకు దారివేస్తూ...స్వల్పకాలిక ప్రయోజనాలను తక్షణమే సాధిస్తూ వైయస్‌ఆర్‌ గణనీయమైన మార్పులు తెచ్చారు. 

గడిచిన పదేళ్ల కాలం అదే విషయాన్ని చెప్పింది..
వైయస్‌ఆర్‌ లేని లోటు తీర్చలేనిది. ప్రజాపాలనలో అంతబలమైన ముద్ర రాజన్నది. ఆయన లేకుండా గడిచిన పదేళ్ల కాలం అదే విషయాన్ని చెప్పింది. వైయస్‌ఆర్‌  మరణానంతరం రాజకీయాలు రాజకీయం కోసమే అన్నట్టుగా సాగాయి.  ప్రజలంటే పట్టింపులేని రాజకీయమే రాజ్యమేలింది. అందుకే రాజన్న తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు అలాగే నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నత్తనడక నడిచింది. వ్యవసాయం ఏడ్చింది. విద్యారంగం స్తబ్దుగా నిలిచింది. పేదింటి గడపలకు మంచికోసం ఎదురుచూపులే మిగిలాయి. అలవిగాని మేధావితనం, అక్కరకు రాని గారడీమాటల విన్యాసాలు ప్రజలకు నష్టం చేశాయి. చివరకు రాష్ట్రం చీలింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, చంద్రబాబు పాలనలో సామాన్యుల, బడుగు బలహీనవర్గాలు బిక్కుబిక్కుమంటూనే గడిపాయి.

తండ్రి ప్రజావారసత్వాన్ని కొనసాగిస్తూ..
వైయస్‌ఆర్‌లా ప్రజలకోసం పరితపించే నాయకుడికోసం ప్రజల్లో ఓ అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణలో పాదయాత్రికుడై కనిపించాడు వైయస్‌ జగన్‌. ఆయనలో తమకో ఆసరా...ఓ భరోసా కనిపించింది ప్రజలకు. అప్పటికే వైయస్‌ జగన్‌ మీద ప్రజాభిమానం ఒక్కసారిగా వెల్లువెత్తే గోదారయింది. ప్రజల నమ్మకం వమ్ము చేయని నాయకునిగా వైయస్‌ జగన్‌ అడుగులేశారు. తండ్రి ప్రజావారసత్వాన్ని కొనసాగిస్తూ అసలుసిసలు ప్రజాపాలనకు నిర్వచనమిస్తున్నారు. అందుకే వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాల సవ్వడి మళ్లీ వినిపిస్తోంది. అది పరవళ్లు తొక్కే కృష్ణమ్మ, గోదారమ్మలను తలపిస్తోంది. 

జనంతోనే.. జనం మధ్యనే..
జనంతోనే కలిసి, జనం మధ్యనే నిలిచి గెలిచిన వైయస్‌ఆర్‌ మరిచిపోలేని మహానేత. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ  బాగుపడాలంటే జలధారల్ని రైతన్నల దర్గరకు తీసుకువెళ్లాలి. అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది. అప్పుడే పల్లెలు బాగుపడతాయి. ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ఇవి వైయస్‌ఆర్‌ అనునిత్యం స్మరించిన మాటలు. 

కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన..
జలయజ్ఞంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయితే దగ్గర దగ్గర కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి. అది జరిగితే నా జన్మధన్యమైనేట్టే. మిగతా సంక్షేమ పథకాలన్నీ నా జీవితానికి బోనస్‌...అని వైయస్‌ అనుకునేవారు..ఇది ప్రజా హృదయ నేత ఆలోచన, ఆశయం. సంక్షేమం ఒక కన్ను. అభివృద్ధి మరో కన్నుగా రాష్ట్రాన్ని పాలించిన వైయస్‌ఆర్‌ దక్షత వున్న నాయకుడు. సమర్థుడైన ప్రజానాయకుడు. అందుకే ప్రజల హృదయాల్లో మరపురాని నేతగా నిలిచిపోయారు. 

ఆ నవ్వు ప్రజలకు ఓ నమ్మకమయింది..
సామాన్య జనజీవితాల్లోని ఆశలు, ఆకాంక్షలు, కష్టాలు, కన్నీళ్లు, ఆటుపోట్లు వైయస్‌ఆర్‌కు తెలిసినంతగా మరొక నాయకుడికి తెలియవు. అందుకే ఆయన పాలించిన ఐదు సంవత్సరాల మూడు నెలలకాలంలో ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన పడ్డ కష్టం ప్రతిఫలిస్తుంటుంది. ఆయన పాలన కోట్లాది మంది ప్రజల జీవితాలను ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన నవ్వు ప్రజలకు ఓ నమ్మకమయింది. ఆయన మాట ప్రజలకు భరోసా అయింది. ఓ రాజకీయ నాయకుడిగాకన్నా...ప్రజాబంధువుగా వైయస్‌ఆర్‌ ఎప్పటికీ చెదరని జ్ఞాపకమే. 

వ్యక్తిత్వ బలమే విజేతగా నిలిపింది..
వైయస్‌ఆర్‌ వ్యక్తిత్వబలం అటు జీవితంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఆయనను విజేతగా నిలిపింది. ఆటుపోట్లను తట్టుకునే గుండెదిటవు మనిషి. అవరోధాలను అధిగమిస్తూ ముందుకు ...మునుముందుకే అడుగులేసిన ధీశాలి. ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి అను నేను...అని మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆ గొంతు..ప్రజల గుండె గొంతుకై ప్రతిధ్వనిస్తూనే వుంది. ప్రజలకు చేయూత, బతుకు భరోసా అందిన చోటల్లా వినిపించే పేరు వైయస్‌ఆర్‌. పొలాల్లో పారే నీటి గలగలల్లో ధ్వనించే శబ్దం వైయస్‌ఆర్‌. పేదింటి ముంగిళ్లలో వెలుగుపూలు పూసినప్పుడు ఆ పువ్వుల్లో నవ్వు వైయస్‌ఆర్‌. అక్కా చెల్లెమ్మలు ముందడుగు వేస్తుంటే...ఆ అడుగుల సత్తువలో వైయస్‌ఆర్‌. పింఛన్లు అందుకునే అవ్వాతాతల కళ్ల మెరుపుల్లో కనిపించేది వైయస్‌ఆర్‌. ప్రజలతో విడదీయలేని బంధం వైయస్‌ఆర్‌. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top