విజయనగరం: గుర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థినులకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. గురువారం గుర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన మజ్జి శ్రీనివాసరావు, విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదనపు తరగతి గదులు ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు. పలాస నియోజకవర్గ పరిశీలికలు కే.వి.సూర్యనారాయణరాజు(పులిరాజు) మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే బైజూస్ అన్లైన్ విద్యాబోధన సంస్థతో ఒప్పందం చేసుకుందని, విద్యార్థులకు పంపిణీ చేసే ట్యాబ్‌లలోనే బైజూస్ కంటెంట్ అప్ లోడ్ చేసి ఇవ్వనున్నారని అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు వైయస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గుర్ల ఎంపీపీ పొట్నూరు సన్యాసి నాయుడు ప్రమీల, జడ్పీటీసీ శీర అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ చిన్నారావు, తోట తిరుపతిరావు ,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కేంగువ మధు, వరద ఈశ్వరరావు , గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.