తాడేపల్లి: కమిషన్లు కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టు వ్యయం, ఎత్తు తగ్గిస్తున్నా కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. దీనిపై పార్లమెంటులో ప్రకటన చేసినా తేలుకుట్టిన దొంగాల్లా మౌనంగా ఉన్న చంద్రబాబు, కేంద్రమంత్రులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో అమరావతిది అంతులేని కథ అయితే... పోలవరంది ముగింపు లేని కథ అని తేల్చి చెప్పారు. పోలవరాన్ని ఏటిఎంలాగా వాడుకున్న చంద్రబాబు.. కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కడితే... వైయస్.జగన్ హయాంలో స్పిల్ వే, కాపర్ డ్యామ్ లు పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు కేంద్రాన్ని వైయస్.జగన్ ఆమోదింపజేస్తే... తాజాగా అంచనా వ్యయాన్ని, ప్రాజెక్టు ఎత్తుని తగ్గిస్తున్నా నోరు మెదపకుండా కూటమి నేతలు.. పోలవరాన్ని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే... ఇప్పటికీ చంద్రబాబుకి ఏటీఎంగానే పోలవరం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడి. ఎన్నో దశాబ్దాల కలగా ఉన్న ప్రాజెక్టును సాకారం చేసిన మహనీయుడు మాత్రం దివంగత మహానేత వైయస్సార్ గారు. ప్రాజెక్టు కోసం సర్వశక్తులు ఒడ్డి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. ఆయన మరణంతో ఆటంకాలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమరావతి అంతులేని కథ అయితే, పోలవరం ప్రాజెక్టు ముగింపు లేని కథ అవుతోంది. ఈ రెండింటికీ ప్రధాన కారణం చంద్రబాబు అసమర్థత, అనాలోచిత నిర్ణయాలే. విభజన చట్టం ప్రకారం కేంద్రం నిర్మించి ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం ఆశపడి తన చేతుల్లోకి తీసుకున్నాడు. డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు. 2004 ముందు వరకు అవినీతి, అక్రమాలతో ప్రాజెక్టును గాలికొదిలేసిన చంద్రబాబు 2014-19 మధ్య ఏటీఎంలా వాడుకున్నాడు. ఇప్పుడు 2024 తర్వాత కూడా అదే విధానాలు కొనసాగిస్తున్నాడు. పోలవరాన్ని తెలుగుదేశంకి ఉపయోగపడే ప్రాజెక్టుగా చూశాడే తప్ప, తెలుగు ప్రజలకు ఉపయోగపడే సంజీవనిలా చూడటం లేదు. ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాడు. ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం ముందుగా రెండు కాపర్ డ్యామ్ లు పూర్తి చేసి, ఆ తర్వాత డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటే అవన్నీ ఖాతరు చేయకుండా కమీషన్ల మీద ఆశతో ముందుగానే డయాఫ్రంవాల్ పూర్తి చేశాడు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానెల్, రివర్ డైవర్షన్ కూడా పూర్తి చేయకపోవడంతో వరద తాకిడికి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. దాదాపు వెయ్యి కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు పెంచి ఆమోదింపజేశాం గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులన్నీ సరిదిద్ధుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. అందులో భాగంగా ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ కట్టాం. స్పిల్ వేను నిర్మించాం, గ్యాప్ 3ని నింపాం. అప్రోచ్ ఛానల్, డౌన్ స్ట్రీమ్ ఛానల్ రెండూ కంప్లీట్ చేశాం. విద్యుత్ కేంద్రం పనులు కూడా సొరంగాల స్థాయిని దాటి ముందుకు తీసుకెళ్లాం. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పనులు 2013-14 ధరలకే చేస్తామని చంద్రబాబు ఒప్పుకుంటే మా ప్రభుత్వం వచ్చాక 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2019లో ఆమోదింపజేశాం. 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,396 కోట్లయితే 2017-18 ధరల ప్రకారం నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో పాత ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని నాడు జగన్ గారు పలుదఫాలు కోరారు. దీనిపై ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. తొలిదశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని సూచిస్తూ 2024 మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడంతో నిధులు ఇచ్చే ఫైలుపై ఆమోదముద్ర వేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు తెరచాటున బీజేపీ పెద్దలతో మంత్రాంగం నడిపారు. దీంతో ఆ ఫైలును కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. లేదంటే మార్చి ఆఖరులోనే రూ.12,157.53 కోట్లు పోలవరానికి విడుదలయ్యేవి. అంచన వ్యయం సవరించినా నోరెత్తని కూటమి నేతలు... 2024లో అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం మరోసారి దక్కినా చంద్రబాబు అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్నా పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రానికి సంజీవనిలాంటి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చేస్తున్నాడు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎన్నోసార్లు గళమెత్తినా కూటమి నాయకులు సమాధానం చెప్పకుండా తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరించారు. చివరికి నిన్న లోక్‌సభలో పోలవరం జలాశయం కాదు.. కేవలం బ్యారేజ్ మాత్రమేనని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ కనీసమట్టం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ప్రాజెక్టును పూర్తిచేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆ మేరకు పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లుగా తేల్చినట్టు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ వాస్తవానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ మట్టంలో నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తిచేయాలంటే రూ.55,656.87 కోట్లు నిధులు అవసరం. కానీ సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లని చెప్పడం ద్వారా జలశాయాన్ని ప్రాజెక్టుగా మార్చేశారని అర్థమైపోయింది. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 41.15 మీటర్లకు పరిమితం చేస్తే బ్యారేజే.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటినిల్వను పరిమితం చేస్తే 115.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. కానీ కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం గోదావరి వరదల సమయంలో మాత్రమే కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీటిని అందించే అవకాశం ఉంటుంది. 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేస్తే పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థీరికరించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. ఇదంతా తెలిసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లోక్‌సభలో పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లేనని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చిచెప్పినా టీడీపీ ఎంపీలు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈవిధంగా ఒక పక్క పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తూ నిందలు మాత్రం వైయస్ఆర్‌సీపీ మీద వేస్తున్నారు. అడుగడుగునా పోలవరం ప్రాజెక్టును నాశనం చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమైపోయారు. పోలవరమైనా, అమరావతైనా డబ్బులు తప్ప ప్రజల శ్రేయస్సు గురించి చంద్రబాబు ఆలోచించడం లేదు. నాడు- నేడు బెంచీల సాక్షిగా చంద్రబాబు అబద్దాలు... సీఎం చంద్రబాబు పార్వీతీపురం మన్యం జిల్లా బామిని స్కూలుకి వెళ్లి.. సినిమా ఫక్కీలో డ్రామా క్రియట్ చేశారు. అందులో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మా పై విమర్శ చేశారు. మీరు సెట్టింగ్ లో పెట్టిన ప్రతీదీ వైయస్.జగన్ నాడు-నేడు కార్యక్రమంలో సరఫరా చేసినవే. వైయస్.జగన్ హయాంలో ఇచ్చిన బెంచీల మీద కూర్చుంటూ.. మీరు వైయస్.జగన్ విద్యావ్యవస్ధను నాశనం చేశారని చెప్పడానికి మీది నోరా? తాటి మట్టా? చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేశారా? వైయస్.జగన్ సీఎం అయిన తర్వాత.. వేల సంఖ్యలో స్కూళ్లను బాగు చేశాడు. ట్యాబులు పంపిణీ నిలిపివేశాడు. విద్యార్ధులకు దురదృష్టకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. లోకేష్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెడితే.. అందులో పాల్గొన్న ఒక విద్యార్థి తన సూపర్ హీరో వైయస్.జగన్ అని చెప్పాడు. కారణం ఏంటంటే.. మా స్కూళ్లను బాగు చేశాడని చెప్పాడు. ఆ పసిపిల్లవాడికున్న జ్ఞానం కూడా మీకు లేదు. విద్యాలయాలను, వైద్యాలయాలను బాగుచేసిన గొప్ప ముఖ్యమంత్రి వైయస్.జగన్. ప్రజలందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు. మంత్రుల చౌకబారు విమర్శలు.. నిన్న వైయస్.జగన్ ప్రెస్ మీట్ చాలా శ్రద్ధగా విన్న మంత్రులందరూ... ఇవాళ వాటాలేసుకుంటూ విమర్శించడం మొదలుపెట్టారు. 16 నెలల్లో ఏపీలో 16 రోజులైనా ఉన్నావా అంటూ లాఠీ, పవర్ లేని హోంమంత్రి అనిత ప్రశ్నిస్తోంది. ఆమె పేరుకే హోంమంత్రి తప్ప.. ఆ బాధ్యతల నిర్వహణలో ఏమాత్రం ప్రమేయం లేదన్న విషయం అందరికీ తెలుసు. వైయస్.జగన్ ను మాత్రం పోటీ పడి విమర్శిస్తారు. వైయస్.జగన్ వారానికి నాలుగు రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. నీకేమైనా డౌట్ ఉంటే ఓసారి వచ్చి కాఫీతాగి వెళ్లవచ్చు.. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేయవద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు ఏపీలో ఎన్ని రోజులుండేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంగతి వదిలేద్దాం.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడుంటున్నారు. హైదరాబాద్ వెళ్లడం లేదా? చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఎన్నిరోజులకొకసారి హైదరాబాద్ వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్తున్నారు? మీ హెడ్ క్వార్టర్ హైదరాబాదా? అమరావతా? అమరావతిలో మీకు అద్భుతమైన ఇళ్లు ఉందా? అద్దె కొంపల్లో ఉంటున్నారు. హైదరాబాద్ లో మాత్రం అద్భుతమైన ఇళ్లు ఉంది మీకు, అది ఎవరూ చూడ్డానికి కూడా వీల్లేదు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చూపిస్తారు. అమరావతి హెడ్ క్వార్టర్ లో మీరు ఇంతవరకు ఇల్లే లేదు. మంత్రులకు వైయస్.జగన్ ను విమర్శించే స్దాయి ఉందా? ఆయన్ను పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు, మరి మీ చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యే, లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యే? వైయస్.జగన్ మాజీ ముఖ్యమంత్రి అని విషయం మర్చిపోతున్నారు. మమ్నల్ని జగన్ బ్యాచ్ అంటున్న మీరందరూ ఎల్లో బ్యాచ్ కాదా? ఇసుక బ్యాచ్ కాదా? లిక్కర్, మట్టి బ్యాచ్ కాదా? ఎమ్మెల్యేలందరూ కొట్టుకు తినడమే పని. మీ ఎల్లో మీడియాలోనే రాస్తున్నారు. బెల్టుషాపులు, మద్యం షాపులు, డబ్బులు గుంజుకుంటున్న మీకు వైయస్.జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? పౌరసరఫరాలమంత్రి సిగ్గులేని మాటలు.. రైతులను గాలికొదిలేసి, వారి దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా నిండా ముంచేసిన... పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వైయస్.జగన్ గురించి మాట్లాడుతున్నాడు. గోనె సంచులు లేక రైతులు లబోదిబోమంటున్నారు. అంతా వ్యాపారులే కొంటున్నారు. రైతు సేవాకేంద్రాల్లో 17శాతం తేమ చూపిస్తే... వ్యాపారుల దగ్గరకు వెళ్లినతర్వాత 24 శాతం చూపిస్తుంది. దీంతో వాళ్లు రైతుల ధాన్యాన్ని వెనక్కి పంపించడమో, 4,5 కేజీలు తగ్గించడమూ చేయమంటున్నారు. అయినా పౌరసరఫరాలశాఖ మంత్రి సిగ్గులేకుండా కబుర్లు చెబుతున్నాడు. అసలు ఎక్కడ కొన్నారో తెలియదు. రైతులను దుర్మార్గమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారు.ధాన్యం కొనడంలో పౌరసరఫరాలశాఖ విఫలమై... రైతులు అల్లాడిపోతుంటే...దాని గురించి మాట్లాడ్డం మానేసి మంత్రి మనోహర్ వైయస్.జగన్ ను విమర్శిస్తాడు. పీడీఎస్ రైస్ లో కమిషన్లు మాత్రం బాగానే దండుకుంటాడు. పీడీఎస్ బియ్యం ఎగుమతి ఆగిపోయిందా? పుల్ గా ఎగుమతి అవుతున్నాయి, కమిషన్లు దండిగా దండుకుంటున్నారు. మంత్రులు కాస్తా నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడే అలవాటు చేసుకోవాలి. వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్య వ్యవస్ద మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆసుపత్రులు సరిగ్గా పనిచేయడం లేదు. మందులు లేవు, ఆరోగ్యశ్రీ లేదు. ఆయన మరలా వైయస్.జగన్ గురించి మాట్లాడతాడు. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఉండడానికి వీల్లేదని వైయస్.జగన్ భర్తీ చేశారు. పాఠశాలలు, వైద్యశాలలు పేద ప్రజలకు ఉపయోగపడేవని భావించి బాగుచేసిన వైయస్.జగన్ ను.. అదే పాఠశాలలు పాడు చేసిన లోకేష్ ఆయన తండ్రి చంద్రబాబు, మంత్రులు విమర్శిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకు ఓటేశామా? అని తలలు పట్టుకుంటున్నారని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు అమ్ముకోవడంతో పాటు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఇద్దరు మంత్రులు ఉన్నారు. పోలవరం గురించి ఇంత అన్యాయంగా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుని, పార్లమెంటులో చెబుతుంటే ఏం చేస్తున్నారు? రూ.55 వేల కోట్లు లేవు రూ.30వేల కోట్లకే ఫినిష్ అని, 41.15 కే ఫినిష్, 45.72 లేదని చెబుతుంటే నోరుమెదపడం లేదు. కారణం చంద్రబాబుకు డబ్బు మీద తప్ప పోలవరం మీద శ్రద్ధ లేదు. అవసరమైతే పోలవరం మీద రైతులను చైతన్యపరిచే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. మెడికల్ కాలేజీలు మీద మేం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చంద్రబాబు ప్లేటు తీసిన లోకేష్, భవిష్యత్తులో ఆయన సీటు తీసేయడం ఖాయం. దేవుడిని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. కేవలం రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డుపెట్టుకునే నీచమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు.