వివేకానందుడి ప్ర‌బోధం ఆచ‌ర‌ణీయం 

 రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మరియు స్టాంపుల శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం: భార‌తీయ ఆధ్యాత్మిక‌తకూ, త‌త్వ‌సారానికి ప్ర‌తీకగా నిలిచి, ప్ర‌పంచ వ్యాప్తంగా సంబంధిత హైంద‌వ సంస్కృతి గొప్ప‌దనాన్ని చాటిన మ‌హ‌నీయుడు వివేకానంద అని  రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మరియు స్టాంపుల శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు. ఆయ‌న బోధ‌లు నేటి త‌రానికి ఆచ‌ర‌ణీయం,అనుస‌ర‌ణీయం అని అన్నారు.  జాతీయ యువ‌జ‌నోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని స్థానిక సూర్య‌మ‌హ‌ల్ జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న వివేకానందుని విగ్ర‌హానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల  శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయులు ఎక్క‌డున్నా ఈ రోజు వారి బోధ‌న‌ల‌ను మ‌ననం చేసుకుంటారు. వారిని స్మ‌రించుకుంటారు. వివేకానందుడి జీవితాన్ని ఆయ‌న బోధ‌న‌ల‌ను అంతా చ‌ద‌వాల‌ని మీ అంద‌రికీ కోరుతున్నాను. ఆయ‌న బోధ‌న‌ల‌ను చ‌దివితే జీవితంలో ప్ర‌తి క‌ష్ట కాలంలోనూ, ప్ర‌తి ఆప‌ద‌లోనూ అవి మీకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని మీకు తెలియ‌జేస్తున్నాను. 

ఆయ‌న‌కు త‌ల్లిదండ్రులు పెట్టిన పేరు న‌రేంద్రుడు. రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస శిష్యుడిగా భార‌తీయ ఆధ్యాత్మిక తత్వాన్ని అల‌వాటు చేసుకుని వివేకానందుడిగా మారారు. 1893లో అమెరికా వెళ్లిన ఈ యువ‌కుడు అక్క‌డ స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నంలో పాల్గొన్నాక అప్పుడు తెలిసింది ఈ యువ‌కుడి గురించి ప్ర‌పంచానికి. ఆయ‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు తెలిశాయి.. ఆ రోజు. భార‌తీయుల‌కు కూడా అప్ప‌టిదాకా ఆయ‌న గురించి పెద్ద‌గా తెలియదు. 

ప్ర‌పంచ మ‌తాల‌కు చెందిన గురువులంతా చేరిన స‌భ‌లో ఆయ‌న చేసిన ప్ర‌సంగం మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. ఆయ‌న భార‌తీయ త‌త్వ గొప్ప‌దనాన్నీ భార‌తీయులు, కానీ ప్ర‌పంచం కానీ తెలుసుకునేలా చేశారు. చాలా చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న చ‌నిపోయారు. ఇటువంటి జయంతులు ఆయ‌నను స్మ‌రించుకునేందుకు ఆయ‌న జీవ‌న సారాన్ని ఆచ‌రించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప్ర‌తి ఏటా ఇటువంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం. ఆయ‌న చెప్పిన చిన్న చిన్న సూత్రాలే జీవితాల‌కు ఆద‌ర్శం. జీవిత గ‌మ‌నంలో ఎద‌రుయ్యే వైఫల్యాలు ఉన్నా ప్ర‌య‌త్నాన్ని మాన‌వ‌ద్దు అంటారు. ప్ర‌తి సూత్రం ఒక దిశ‌ను చూపి, మ‌న‌లో ఉత్సాహాన్ని నింపుతుంది. అంత గొప్ప ఆధ్యాత్మిక త‌త్వ‌వేత్త స్వామి వివేకానందుడు. కెర‌టం నాకు ఆద‌ర్శం ప‌డినందుకు కాదు ప‌డినా లేచినందుకు అని చెప్పారాయ‌న. ఆయ‌న మ‌న‌కేంటి ప్ర‌పంచానికే పూజనీయుడు. మ‌న‌లోని శ‌క్తిని ప్రేరేపించేందుకు ఆయ‌న ప్ర‌బోధాలు ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇవాళ ఆయ‌న సూక్తులు ఆయ‌న బోధ‌న‌లు చిర‌స్మ‌ర‌ణీయం అని పేర్కొంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top