విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌కు పిచ్చి ముదిరిందని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కావాలనే రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర చేయిస్తున్నాడని, దీని వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించి, లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ రాజధాని వద్దు అని వారిని రెచ్చ గొడతారా?. విశాఖ వద్దు అమరావతి ముద్దు అంటే వారు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ అని, ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ కాదని, అన్యాయంగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారన్నారు. టీడీపీది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న చంద్రబాబు పార్టీని, దత్తపుత్రుడుని బ్రతికించాలని ఎల్లోమీడియా ఎంత కష్టపడ్డా ఏమీ ఉపయోగం ఉండదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలు పన్ని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజల గుండెల్లో ఉన్న సీఎం వైయస్ జగన్‌ను చంద్రబాబు ఆయన తాబేదారులు అంగుళం కూడా కదల్చలేరన్నారు.