విజయవాడ: కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను దేశం మొత్తం ప్రశంసిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ధ్వజమెత్తారు. అత్యంత సమర్థవంతంగా కరోనా నివారణకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న చర్యలను దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం చెబుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. కరోనా నివారణకు ఎన్ని నిధులు ఖర్చు అయినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తూ.. మరో పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ప్రజల ప్రేమానురాగాలను సీఎం చురగొంటున్నారన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మంచిపేరు వస్తుందనే ఈర్ష్య, ద్వేషాన్ని పెంచుకున్న చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం విషప్రచారాలు చేయడం మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. టీడీపీ హాయంలో దాదాపు 5వేల డాక్టర్లకు సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉంటే ఏ ఒక్క పోస్టును కూడా చంద్రబాబు భర్తీ చేయలిగాడా..? రాష్ట్రంలో పీహెచ్‌సీని అయినా బాగుచేసిన పాపానపోయారా..? చంద్రబాబు ఆస్పత్రులను అభివృద్ధి చేసి ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఆస్పత్రుల అభివృద్ధికి నయాపైసా ఖర్చు చేయలేదు.. ఒక్క డాక్టర్‌ను నియమించలేదు. ఎన్నికల సమయంలో ఉత్తుత్తి జీఓలు ఇవ్వడం తప్ప.. చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచాడు. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.680 కోట్లు బకాయిలు పెట్టివెళ్లిపోయాడు. ఆ బకాయిలను సీఎం వైయస్ జగన్ తీర్చి యధావిధిగా రోగులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. కేవలం నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు నిలిపివేసి వేల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న నీచపు చరిత్ర చంద్రబాబుది. చివరకు మందుల బిల్లులు కూడా చెల్లించకుండా వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.300 కోట్ల బకాయిలను మందుల కంపెనీలకు చెల్లించారు. దుర్మార్గపు పాలన కొనసాగించిన చంద్రబాబు.. దురదృష్టవశాత్తు ఇప్పుడు సీఎంగా ఉండి ఉంటే.. రాష్ట్రంలో చాలా భయానక పరిస్థితులు ఎదురయ్యేవన్నారు. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షనేతగా చంద్రబాబు తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే రానున్న రోజుల్లో ఆ స్థానం కూడా దక్కడం కూడా కష్టమే. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చేయని టెస్టులు మనం చేస్తున్నాం. టెస్టులు ఎక్కువగా చేస్తే కేసులు ఎక్కువగా నమోదు అవుతాయని భయం కూడా లేకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలన్న సీఎం ఆలోచన మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 16,43,319 టెస్టులు చేశాం. ఆ టెస్టుల్లో 96,298 మందికి పాజిటివ్‌గా నమోదు అయితే అందులో ప్రభుత్వం తీసుకున్నఅందించిన వైద్యం ద్వారా 46,301 మందిని తిరిగి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు పంపించాం. ప్రస్తుతం 48,956 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో హోంక్వారంటైన్ కోరుకున్నవారు 15 వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో 138 కోవిడ్ ఆస్పత్రుల్లో 13,992 మంది అడ్మిట్ అయి ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్‌లో 15,815 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 96,298 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయితే వారిలో 1,041 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ప్రతి పది లక్షల మందికి టెస్టులు చేస్తే పాజిటివ్ రేట్ 5.06గా రావడం జరిగింది. మార్చి నెలలో ఒకటి, రెండు ల్యాబ్‌లకు పరిమితమైతే.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 20 ల్యాబ్‌లకు వెళ్లాం. 2 వేల టెస్టుల నుంచి నేడు ప్రతి రోజూ రోజు 50 వేల టెస్టులు చేస్తున్నాం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. టెస్టుల కోసం ప్రతి రోజు రూ.5 కోట్లు వెచ్చిస్తున్నాం. కేసులు పెరుగుతున్న పరిస్థితిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. కేసులు ఎక్కువగా పెరగడానికి కారణం.. ఎక్కువగా టెస్టుల సామర్థ్యం పెంచడం.. ఆ టెస్టులు కూడా రెడ్‌జోన్‌లు, క్లస్టర్లలో చేస్తున్నాం. రాష్ట్రంలో 138 కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసుకున్నాం. వీటిల్లో ఐసీయూ బెడ్స్ 4300, నాన్ ఐసీయూ విత్ ఆక్సిజన్ 17,380 బెడ్స్, నాన్ ఐసీయూ విత్ అవుట్ ఆక్సిజన్ 17,370 ఏర్పాటు చేసుకున్నాం. ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశాం.. త్వరలో డాక్టర్ల రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వెంటిలేటర్లు కూడా 1,513 ఉంటే అదనంగా 1000 వెంటిలేటర్లను కేంద్రం నుంచి సేకరించడం జరుగుతుంది. ఎక్స్‌రే 271, పల్స్ ఆక్సి మీటర్లు 22,908, పీపీఈ కిట్లు 8,60,415 సిద్ధం చేశాం. ఎన్95 మాస్కులు 7,02,384 సిద్ధం చేశాం. 104 కాల్‌సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 హైఅండ్ ట్రీట్‌మెంట్ ఇచ్చే ఆస్పత్రులను సిద్ధం చేశాం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, విశాఖపట్నంలలో ఆస్పత్రులను సిద్ధం చేశాం. మరో ఐదు ఆస్పత్రులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళంలో కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నాం. 217 వాహనాలను ప్రత్యేకించి కోవిడ్ పాజిటివ్ కేసులను తరలించేందుకు కేటాయించాం. 105 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాం. వీటిల్లో 46,698 బెడ్స్ అందుబాటులో ఉంచాం. మెడికల్ టీమ్‌ను కూడా అందుబాటులో ఉంచాం. త్వరలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తాం. ట్రీట్‌మెంట్‌ను, ఆహారం అందజేతను పరిశీలించనున్నాం.