గుంటూరు: ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేక చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసులకు పీపీసీ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చేశారని వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు తెచ్చుకోవాలన్న ఆయన, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల దగ్గరకు వెళ్లలేక పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్‌ను తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు మా అభ్యర్థులను అభినందించాల్సింది పోయి, అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని 10 రోజులుగా జైలులో పెట్టడం దుర్మార్గమని ఆక్షేపించారు. బ్యాలెట్ బాక్స్‌ను ఎక్కడికో తీసుకెళ్తుంటే అడ్డుకుని మళ్లీ అధికారులకు అప్పగించే ప్రయత్నం మాత్రమే తమ నాయకులు, కార్యకర్తలు చేశారని చెప్పారు. వీడియోల్లో చూసినా ఇదే కనిపిస్తోందని, ఇందులో హత్యాయత్నం ఎక్కడుందని, దోషులను వదిలేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారిపై కేసులు పెడతారా? అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పోలీసులు, వైయస్సార్‌సీపీ మధ్య జరుగుతున్నట్లు ఉంది తప్ప, వెన్నుపోటు పార్టీ కూటమికి, వైయస్సార్‌సీపీ మధ్య అన్నట్లు లేదని ప్రార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా అంతులేని అన్యాయం, అక్రమ కేసులు, 307 సెక్షన్లు, అరెస్టులే కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున నాశనం చేసిన ఘనత భారతదేశంలో ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. పోలీసుల ద్వారా కొత్త పద్ధతుల్లో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారన్న ఆయన, అది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. మీడియాతో మాట్లాడిన నేతలు ఇంకా ఏమన్నారంటే..: ● అప్పిరెడ్డిపై పెట్టింది మామూలు తప్పుడు కేసు కాదు. : సజ్జల రామకృష్ణారెడ్డి. వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ గుంటూరు సబ్‌జైలులో అక్రమ కేసులో అరెస్టయి నిర్బంధంలో ఉన్న మా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మె్మల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఇప్పుడే కలిసి వచ్చాం. ఆయనపై బనాయించిన కేసు మామూలు తప్పుడు కేసు కాదు. ఇంత అన్యాయమైన కేసును గతంలో ఎప్పుడూ చూసి ఉండము. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా అరాచకంగా మార్చేశారో సుప్రీంకోర్టు కూడా గమనించింది. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే చర్చ జాతీయ స్థాయిలో కూడా జరుగుతోంది. బ్యాలెట్ బాక్స్‌ను పక్కకు తీసుకెళ్తుంటే అడ్డుకున్న మా పార్టీ అభ్యర్థులను అభినందించాల్సింది పోయి వారిపైనే అక్రమ కేసులు పెట్టారు. బ్యాలెట్ బాక్స్‌ను ఆపి తిరిగి అధికారులకు అప్పగించే ప్రయత్నం మాత్రమే మా నాయకులు, కార్యకర్తలు చేశారు. ఆ వీడియోల్లో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి ఘటనలో మా నాయకుడు అప్పిరెడ్డిని పది రోజులుగా జైలులో నిర్బంధించడం దారుణం. - పోలీసులు యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘన: చాలా రోజులుగా మా పార్టీ సీనియర్ నాయకులను ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి జైలుకు పంపాలనే కుట్ర జరుగుతోంది. పోలీసులు తమ బాధ్యతను మరిచిపోయి ఒక కిరాయి సైన్యంలా వ్యవహరిస్తున్నారు. యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు వెన్నుపోటు పార్టీ కార్యకర్తల్లా పని చేస్తుంటే.. పోలీసుల వెనక నిలబడిన ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో గెలిచినట్లు మీసాలు తిప్పుతున్నారు. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడగాల్సిన ఎన్నికల్లో, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దగ్గరకు వెళ్లే ధైర్యం లేక పోలీసులకు కాంట్రాక్టు ఇచ్చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. డీజీపీ నుంచి కింది స్థాయి పోలీసు సిబ్బంది వరకు రాజ్యాంగం, చట్టం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల పేరుతో ఒక నాటకం నడిపించారు. - ఎస్పీ, కలెక్టర్ స్టేట్‌మెంట్స్‌కు భిన్నంగా ఎఫ్‌ఐఆర్: ఈ కేసులో హత్యాయత్నం, దాడులంటూ ఎస్‌ఐ రాత్రి 11.30 గం.కు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే, అదే రాత్రి 12.30 గం.కు జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెబుతారు. ఇంతకన్నా విడ్డూరం ఇంకా ఏమైనా ఉంటుందా. ఇంకా వీడియోల్లో ఎక్కడా అప్పిరెడ్డి లేరు. ఎస్సై లేరు. బస్సు లేదు. దాడికి వచ్చిన జనాలు కూడా లేరు. ఒక మహిళా అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌ను పక్కకు తీసుకెళ్తున్నారని అనుమానించి ప్రశ్నించడం, దాన్ని తిరిగి అధికారులకు అప్పగించే ప్రయత్నం చేయడం మాత్రమే కనిపిస్తోంది. అలాంటి ఘటనకు డెకాయిటీ, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు పెట్టి జైలులో నిర్బంధించడం ఎంతవరకు న్యాయం? ఈ అరాచక సంస్కృతి ఇక్కడితో ఆగదు. చంద్రబాబు నాటిన విత్తనం రేపు పెరిగి వ్యవస్థలనే కూల్చేసే ప్రమాదం ఉంది. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ● పోలీసులు, వైయస్సార్‌సీపీ మధ్యనే స్థానిక ఎన్నికలు. : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలు, అక్రమ కేసులు, ఎన్నికల బీభత్సం గురించి మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి, పోలీసులకు మధ్యే స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప వెన్నుపోటు పార్టీ, వైయస్సార్‌సీపీ మధ్య కాదు. ఎక్కడ చూసినా అన్యాయం, దుర్మార్గం, హత్యాయత్నం (సెక్షన్. 307) కేసులు పెట్టి, మా పార్టీ నాయకులను అరెస్టు చేయడం కనిపిస్తోంది. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్న మా పార్టీ నాయకులను టార్గెట్ చేసి జైలులో పెడుతున్నారు. ఆ తర్వాత తమకు నచ్చినట్లు ఎన్నికల ఫలితాలు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి పద్ధతులు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. - తెలుగుదేశం కార్యకర్తల్లా పని చేస్తున్న పోలీసులు: పోలీసులంతా పసుపు చొక్కాలు వేసుకోకుండానే వెన్నుపోటు పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు. అన్యాయం చేస్తున్నది మీరే.. వాటికి బాధ్యత వహించాల్సింది కూడా మీరే. ప్రతి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎంత ఉప్పు తింటే అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఇది వైయస్సార్‌సీపీ మీద జరుగుతున్న దాడి కాదు. ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా నిర్వహించామో, ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఎలా నిర్వహిస్తోందో ప్రజలు గమనించాలి.