నీటి నిల్వ 41.15 మీటర్లే

 పోలవరానికి ఆ మేరకే తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు.. పీపీఏకు రూ.55 కోట్లు 

గత బడ్జెట్‌ కంటే రూ.423.5 కోట్లు అధికం 

రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టీకరణ

ఫలితంగా సామర్థ్యం 194.6 నుంచి 119.4 టీఎంసీలకు తగ్గింపు 

రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

అమరావతి : పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లే అని తాజా బడ్జెట్‌ సాక్షిగా మరోమారు స్పష్టమైంది. తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించారనేది బట్టబయలైంది. పోలవరం ప్రాజెక్టుకు నిర్దేశించిన గడువు 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం 2025–26 బడ్జెట్‌లో రూ.5,936 కోట్లు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణకు రూ.55 కోట్లు కేటాయించింది. 

గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన 2024–25 పూర్తి బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించలేదు. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా స్పిల్‌ వేను 2021 జూన్‌ 11 నాటికి గత ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 119.4 టీఎంసీలకు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157.53 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. 

పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసినా.. ఆ మంత్రివర్గ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కె.రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయ­లేదు. దీన్నిబట్టి రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసేందుకు అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర కేబినెట్‌.. నిర్మాణంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును మరో ఏడాది పొడిగించింది. 

ఈ మేరకు 2024–25 సవరించిన బడ్జెట్‌లో రూ.5,512.50 కోట్లను కేంద్ర జల్‌ శక్తి శాఖ కేటా­యించింది. ఇందులో రీయింబర్స్‌మెంట్‌ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు వెరసి రూ.2,807.69 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఈ నిధుల్లో 75 శాతం వ్యయం చేసి.. యూసీల (వినియోగ ధ్రువీకరణ పత్రాలు)ను పీపీఏ ద్వారా పంపితే మిగతా నిధులు విడుదల చేస్తామని చెప్పింది. 

ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 58 రోజులు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపితే సవరించిన బడ్జెట్‌లో కేటాయించిన వాటిలో మిగతా నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది సవరించిన బడ్జెట్‌లో కేటాయించిన దాని కంటే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.423.50 కోట్లను కేంద్రం అధికంగా కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

బాబు నిర్వాకం వల్లే నీటి నిల్వ తగ్గింపు
»  విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. కమీ­షన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తి­డితో నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. 

»    ఇందుకోసం 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్‌ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్‌ చేస్తామన్న కేంద్రం షరతుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. 

గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులను చేపట్టాల్సిన చంద్ర­బాబు.. దానికి భిన్నంగా కమీషన్లు వచ్చే పనులనే చేపట్టి పోలవరంలో విధ్వంసం సృష్టించారు. దీంతో కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్ర­బాబు ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే.

»    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు చేసిన తప్పులను వైఎస్‌ జగన్‌ సరిదిద్దుతూ పనులను వేగవంతం చేశారు. 2017–18 ధరల ప్రకారం రూ.55,656 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు రీయింబర్స్‌ కాకుండా అడ్వాన్సుగా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. 

»   అయితే, 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి, మిగతా పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు అంగీకరించడం ద్వారా పోలవరాన్ని మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. 

తద్వారా వరద ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుంది. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే. 

Back to Top