పోలవరం స్పిల్‌ వే పిల్లర్ల నిర్మాణం పూర్తి 

52 మీటర్ల ఎత్తులో.. 52 స్పిల్‌ వే పిల్లర్ల నిర్మాణం

స్పిల్‌ వే బ్రిడ్జిలో మొత్తం 48 గేట్లకు గాను ఇప్పటికే 28 గేట్ల ఏర్పాటు

త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్‌ ప్యాక్‌లు

పశ్చిమ గోదావరి: పోలవరం నిర్మాణం శరవేగంగా పరుగులు పెడుతోంది. ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి 2022 ఖరీఫ్‌ నాటికి నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఆ దిశగానే పనుల్లో వేగం పెంచింది. పూర్తి కార్యాచరణ రూపొందించుకొని ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్‌ వే పిల్లర్ల నిర్మాణాన్ని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ.. మేఘా పూర్తిచేసింది. 52 మీటర్ల ఎత్తున.. 52 పిల్లర్లను నిర్మించింది. స్పిల్‌ వేలో 2వ బ్లాక్‌లో ఫిష్‌ లాడర్‌ నిర్మాణం చేపట్టడం వల్ల దీని డిజైన్లకు సంబందించి అనుమతులు ఆలస్యం కావడంతో 2వ పిల్లర్‌ నిర్మాణం ఆలస్యమైంది. ఇటీవలే డిజైన్లు అన్నీ అనుమతులు వచ్చాక త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి స్లాబ్‌ లెవల్‌కు అంటే సరాసరి∙52 మీటర్ల ఎత్తుకు అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. 

ఎంఈఐఎల్‌. మేఘా సంస్థ పోలవరం పనులు చేపట్టి 2019 నవంబర్‌ 21న కాంక్రీట్‌ పనులు మొదలు పెట్టింది. స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ పొడవు 1128 మీటర్లకు గానూ ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. స్పిల్‌ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా, ఇప్పటికే 188 గడ్డర్లు పిల్లర్లపై ఏర్పాటు చేశారు. 4 గడ్డర్లు మాత్రమే పిల్లర్లపై పెట్టాల్సి ఉంది. 2019 నవంబర్‌ లో స్పిల్‌ వే పిల్లర్లు కాంక్రీట్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు.  

జూలై 2020లో స్పిల్‌ వే పిల్లర్లు పై గడ్డర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించిన ఎంఈఐఎల్, స్పిల్‌ వే బ్రిడ్జ్‌ స్లాబ్‌ కాంక్రీట్‌ 2020 సెప్టెంబర్‌ 9న మొదలు పెట్టి అతితక్కువ సమయంలోనే స్పిల్‌ వే పనులను పూర్తి చేసింది. ఇప్పటికే స్పిల్‌ వే బ్రిడ్జ్‌లో పూర్తయిన స్లాబ్‌ సంఖ్య 45, మిగిలిన 3 స్లాబ్‌లు పనులు త్వరలోనే పూర్తి చేయనున్నారు. మొత్తం 49 ట్రూనియన్‌ భీమ్‌లు పనులు పూర్తి చేయడంతో పాటు స్పిల్‌ వే బ్రిడ్జిలో మొత్తం 48 గేట్లకు గాను ఇప్పటికే 28 గేట్లను ఏర్పాటు చేశారు. త్వరలోనే గేట్లకు సిలిండర్లు, పవర్‌ ప్యాక్‌లు అమర్చేందుకు ప్లాట్‌ ఫాం ఏర్పాట్ల పనులు కూడా జరుగుతున్నాయి. 
 

Back to Top