ఆణిముత్యం లాంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం

ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

విశాఖలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌ నిర్మాణం

మాల్‌ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయి

రూ.600 కోట్లతో 13 ఎకరాల విస్తీర్ణంలో మాల్‌ నిర్మాణం.. 

8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు

ఫేస్‌–2 కింద 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ స్పేస్‌.. మరో 3వేల మందికి ఉపాధి

స్టార్‌ హోటల్స్‌ నిర్మించాలని రహేజా గ్రూప్‌ ఆసక్తిగా ఉంది

రహేజా సంస్థకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తాం.. ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటాం

విశాఖపట్నం: విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతూ, మరింత మంచి జరిగిస్తూ ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌ నిర్మాణానికి విశాఖ వేదిక అయ్యింది. విశాఖ నగరం రూపురేఖలు మార్చే గొప్ప ప్రాజెక్టుగా ఇది నిలిచిపోతుంది’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని కైలాసపురం వద్ద రూ.600 కోట్లతో రహేజా గ్రూప్‌ నిర్మిస్తున్న దక్షిణ భారత అతిపెద్ది ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ మాల్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 13 ఎకరాల్లో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం జరుగుతుంది. ఇదే ఇనార్బిట్‌ మాల్‌ రహేజా గ్రూప్‌ హైదరాబాద్‌లో 7–8 ఎకరాల్లో కడితే.. విశాఖలో ఏకంగా 13 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసిన నీల్‌ రహేజా, సీఈవో రజినీశ్‌ మహజన్, సీవోవో శ్రవణ్‌కుమార్‌లకు మనస్ఫూర్తిగా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు. 

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మాల్‌ నిర్మాణం మన విశాఖలో జరుగుతుంది. రూ.600 కోట్లతో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ మాల్‌ ద్వారా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం జరిగిన తరువాత మిగిలిన 4 ఎకరాల్లో రాబోయే రోజుల్లో ఫేస్‌–2 కింద ఐటీ స్పేస్‌ క్రియేట్‌ చేయనున్నారు. ఇంటర్నేషనల్‌ స్టాండెడ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటన్నింటి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయి. 2.5 లక్షల ఎస్‌ఎఫ్‌టీలో ఐటీ స్పేస్‌ రావడంతో కనీసం మరో 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖను గ్లోబల్‌ చాట్‌లో పెట్టడంలో ఉపయోగపడే కార్యక్రమాలు. 

ఇటీవల విశాఖలో అదానీ డేటా పార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్థాపనలు చేశాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అదే రోజు భూమిపూజ చేశాం. ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోయే గొప్ప అడుగులు. ఆ కోవలోనే దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మాల్‌ నిర్మాణం విశాఖలో జరుగుతుంది. 

ఇవే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5స్టార్‌ హోటల్స్‌ నిర్మించిన సంస్థలు మన విశాఖలో పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రంలో రాజ్‌ విల్లాస్‌ మాదిరిగా ఇటీవల ఒబేరాయ్‌ సంస్థ సూపర్‌ లెగ్జరీ రిసార్ట్స్‌ నిర్మాణానికి భూమిపూజ చేశాం. మైఫేర్‌ సంస్థ 7స్టార్‌ లెగ్జరీ రిసార్ట్‌ నిర్మించబోతుంది. అదే కోవలో మాకు కూడా సపోర్టు చేస్తే మేమూ లెగ్జరీ రిసార్ట్స్‌ నిర్మిస్తామని నీల్‌ రహేజా ఆసక్తి చూపారు. రాబోయే రోజుల్లో రహేజా గ్రూప్‌ కూడా 7స్టార్‌ లెగ్జరీ రిసార్ట్స్‌ నిర్మించనున్నారు. రహేజా సంస్థకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తాం. ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వీటన్నింటి ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారనున్నాయి. 

హిందూపూర్‌లో కూడా 350 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టులో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్‌ పార్కు ద్వారా 15 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా అడుగులు ముందుకువేశాం. ఆ ప్రాజెక్టుకు సపోర్టు చేస్తే యుద్ధప్రాతిపదికన టేకప్‌ చేస్తామని చెప్పారు. దానికి సంపూర్ణ సహకారాలు అందిస్తాం’ అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

Back to Top