ప్రధాని మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలి

590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఏపీకి సరిపోవడం లేదు

910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్, 20 ట్యాంకర్లను కేటాయించండి

లేఖ ద్వారా ప్రధాన మంత్రిని కోరిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఏపీకి అదనంగా ఆక్సిజన్‌ కేటాయించాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ‘పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి, దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థ కోవాగ్జిన్‌ ఒక్కటే. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించాయి. ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీ అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలి’ అని లేఖ ద్వారా ప్రధాని మోదీని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయవచ్చన్నారు. 

ఏపీకి 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ కేటాయించాలని కోరారు. అదే విధంగా 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏపీకి కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుతున్న 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఏపీకి సరిపోవడం లేదని తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని,  ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న 210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 400 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ప్రధాని మోదీని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top