అమరావతి: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో.. నెల రోజులపాటు నియమ నిష్ఠలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని ముఖ్యమంత్రి అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ఆయన అన్నారు. కఠినమైన ఉపవాస దీక్ష(రోజా) ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ రంజాన్ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అని ఆయన అన్నారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలు అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.