రేపు ఏలూరు వెళ్లనున్న సీఎం వైయ‌స్ జగన్‌

అస్వస్థతకు గురైన వారిని పరామర్శించనున్న ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి:  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిని ప‌రామ‌ర్శించేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు అక్క‌డికి వెళ్ల‌నున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరుతారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు.  

ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం వైయ‌స్ జగన్‌  ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని  ఆదివారం  ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా రేపు ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top