తాడేపల్లి: గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తయని చెప్పారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:
ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనతోపాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్ గారికి, గ్రీన్ కో కంపెనీ, ఆర్సెలర్ మిట్టల్ గ్రూపు, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, ఆయా లొకేషన్‌లలో ఉన్న అధికారులు, కంపెనీల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ గారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు.
ఈ రోజు 3 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్ధాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం.
మొదటి ప్రాజెక్టు గ్రీన్‌కోకు సంబంధించి దాదాపు 2300 మెగావాట్ల సౌరవిద్యుత్తుకు సంబంధించి.. రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు. పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ. పీక్ అవర్స్‌లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్‌లో మరలా నీళ్లని వెనక్కి పంప్ చేసి, పీక్ అవర్స్‌లో పవర్‌ని జనరేట్ చేయడానికి ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా క్రియేట్ చేస్తున్నాం. ఈ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల ఫ్యూచర్ జనరేషన్స్‌లో మొత్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల బొగ్గు వంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే.. రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు సమగ్రంగా పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులతో అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్టీలో విప్లవానికి దారితీస్తాయి. ఇవి రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సయమంలో విద్యుత్ ఉత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు క్రియేట్ అవుతుంది.
దేవుడు గొప్పవాడు, అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులు సృష్టించాడు. ఎండబాగున్నప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తే.. సాయంత్రం 6 నుంచి ఉదయం వరకు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు సోలార్ వస్తుంది. విండ్ ఎనర్జీ సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు వాడుకోవచ్చు. పీక్ అవర్స్‌లో నీళ్లతో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ఆ ఫీక్ అవర్స్‌లో ఇవి ఒక ఆర్టిఫీషియల్ బ్యాటరీలగా పనిచేస్తాయి. దీని వల్ల ఫీక్ అవర్స్‌లో పవర్ జెనరేషన్ సాధ్యమవుతుంది.
దీనివల్ల శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పూర్తిగా పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ అన్నది వస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించబోయే ఎనర్జీగా నిలబడితే.. అందులో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్ధానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. ఇవాళ ఆంధ్రరాష్ట్రంలో దాదాపుగా 8998 మెగావాట్ల సోలార్ అండ్ విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు పగటì పూటే ఉచితంగా విద్యుత్ అందుబాటులోకి రావాలని.. 16వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7200 మెగావాట్లకు సంబంధించి.. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సెకీతో రూ.2.49కే మన రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో 25–30 సంవత్సరాల పాటు రూ.2.49కే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్‌ను ఇచ్చే వెసులుబాటు వస్తుంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25–30 సంవత్సరాల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఉండేందుకు... ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. ఒకవైపు ఇవన్నీ చేస్తూనే.. మరోవైపున పంప్డ్ స్టోరేజిను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 41వేల మెగావాట్లకు సంబంధించి 37 లోకేషన్లలో ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించిన 29 లొకేషన్లలో ఉన్న ప్రాజెక్టులకు ఫీజబులిటీ స్టడీలు జరుగుతున్నాయి. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టులకు డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్‌మెంట్లు కూడా పూర్తయ్యాయి.ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో కూడా ఒప్పందం చేసుకుంటున్నాం.
ఇందులో యాగంటిలో 1000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు మొత్తం దాదాపు 2వేల మెగావాట్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు ఫీజబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ– ఫిప్టీ వాటాతో ప్రాజెక్టును అభివృద్ధి చేసేటట్టుగా ఇవాళ ఎంఓయూ కుదుర్చుకున్నాం.
మరోవైపు ఎన్‌హెచ్‌పీసీ, ఏపీ ప్రభుత్వం ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా... మరో 2750 మెగావాట్లకు సంబంధించి మూడు లొకేషన్లలో ఫీజబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్‌హెచ్‌పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సామర్ధ్యాన్ని పెంచుతూనే.. మరోవైపు మనదగ్గరున్న సామర్ధ్యాన్ని మిగిలిన ప్రైవేటు డెవలపర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చి, తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రరాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడబోతుంది.
ఈ రోజు మనం శంకుస్ధాపన చేస్తున్న ఈ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే..
గ్రీన్‌కో కంపెనీ రూ.10,350 కోట్లతో 2300 మెగావాట్ల సౌరవిద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేస్తున్నాం.
దీనివల్ల 2300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి.
ఇదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మరో 1014 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేస్తున్నాం. దీనిలో 700 మెగావాట్ల సోలార్ పవర్ కాగా, 314 మెగావాట్లు విండ్‌పవర్ జనరేట్ చేస్తారు. రూ.4,500 కోట్ల పెట్టుబడితో ఈ రెండు ప్రాజెక్టులలో 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఎకోరన్ ఎనర్టీ ప్రాజెక్టుకు సంబంధించి 2000 మెగావాట్ల (1000 మెగావాట్ల సోలార్, 1000 మెగావాట్ల విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు కూడా ఇవాళ శంకుస్ధాపన చేస్తున్నాం. దాదాపు రూ.11,000 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మరో 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.
ఇక మరో 2,000 మెగావాట్లకు సంబందించి ఇవాళ మనం ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. రూ.10,000 కోట్ల పెట్టుబడులతో పాటు ఈ ప్రాజెక్టు వల్ల 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీజబులిటీస్ అధ్యయనం చేస్తుంది. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఆ ప్రాజెక్టులో కూడా కలిసి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మన పిల్లలకు స్ధానికంగా అక్కడే ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా... అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్ కూడా మరో వందసంవత్సరాల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి మెగావాట్‌కు రూ.1లక్ష రాయల్టీ కింద ఆదాయం వస్తుంది. దీంతోపాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా వస్తుంది. అదికాకుండా ఈప్రాజెక్టులకు తమ భూములు ఇస్తూ... రైతులు ఎక్కడైతే సహరిస్తున్నారో... వారికి కూడా ఈ కంపెనీల నుంచి ప్రతిఎకరాకు లీజు రూపంలో రూ.30 వేలు ఏడాదికి ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసును కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల రైతులకూ మంచి జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన పరిస్థితి ఉండే పరిస్థితులు. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకు మంచి జరుగుతుంది.
ఈ ప్రాజెక్టుల వల్ల ఉపాధితో పాటు జీఎస్టీ ఆదాయమే కాకుండా, రైతలకూ, ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వానికి భూములు ఇచ్చినందుకు లీజు రూపంలో ఆదాయం వస్తుంది. ఇది కాక మెగావాట్‌కు రూ.1లక్ష రూపాయిలు రాయల్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. దీనివల్ల అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి, పెట్టుబడి పెట్టేవాళ్లకు, ఏ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులను స్వాగతిస్తున్నామో ఆ ప్రాంతంలో రైతులకు కూడా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా పర్యావరణానికి ఇది మేలు చేసే కార్యక్రమం అని సీఎం ప్రసంగం ముగించారు.