సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దు 

గులాబ్‌ తుపాన్‌ పరిస్థితులపై కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై దిశానిర్దేశం

మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

సహాయక శిబిరాల్లో నాణ్యమైన ఆహారం, వైద్యం, తాగునీరు అందించాలి

పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: గులాబ్‌ తుపాన్, అనంతరం పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి తుపాన్‌ ప్రభావిత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని సూచించారు. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. తుపాన్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దన్నారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 

విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌ చేసి తొలగించే పనులు ముమ్మరంగా చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలన్నారు. సహాయ శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించారు. తాగునీటి వనరులు వర్షపు నీరు కారణంగా కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్‌ ట్యాంకర్లు ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. జనరేటర్లతో వాటర్‌ స్కీంలు నిర్వహించాలని, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌ చేయాలన్నారు. నష్టం అంచనాలు వెంటనే సిద్ధంచేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్యుమరేషన్‌ చేసేపటప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.

ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున, అకస్మాత్తుగా వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వంధార, నాగావళి నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంచేయాలని ఆధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన చోట వారిని సహాయ శిబిరాలకు తరలించాలని, రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నీటిని విడుదలచేయాలన్నారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, విజయనగరం నుంచి  మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు పాల్గొన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top