తాడేపల్లి: కలెక్టర్లు, ఎస్పీలపై పూర్తి నమ్మకం, విశ్వాసం పెట్టాను. నా బలం కలెక్టర్లు, ఎస్పీలని ప్రతీసారి చెప్తున్నాను. మీరు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలు, నాలుగో విడత లాక్‌డౌన్, అభివృద్ధి కార్యక్రమాలు వంటి పలు అంశాలపై సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే.. కోవిడ్ – 19 నివారణలో అద్భుతంగా పనిచేశారు. గ్రామ వలంటీర్లు, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా పనిచేశారు. మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం. ఇంతకు ముందు మనం అనుసరించిన పద్ధతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనుసరిస్తున్న పద్ధతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్ – 19 నివారణపై మన దృష్టి పోకుండానే.. మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఎకానమీ పూర్తిగా ఓపెన్ కావాలి. దీంట్లో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యం కావాలి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మత పరమైన కార్యక్రమాలు, సదస్సులు తప్పా.. మిగిలిన చోట్ల కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని ప్రారంభించాల్సి ఉంది. చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతిదీ ఓపెన్ చేయాలి. రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలు ప్రారంభం అవుతాయి. తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి. కోవిడ్ – 19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కోవిడ్ సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలి. ప్రజలు తమకు తాముగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలి. ప్రజలకు అందుబాటులో టెస్టింగ్ సదుపాయం తీసుకెళ్లాలి. వైయస్‌ఆర్ విలేజ్, వార్డు క్లినిక్స్ నిర్మాణం ప్రాధాన్యతగా గుర్తించాలి.