మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

 వైయస్‌ఆర్‌ ఆసరా మూడో విడత కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయి: సీఎం జగన్‌
 
ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు :

 ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ మీ అభిమతానికే విడిపెట్టాను:

 స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు:

 అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం కింద ఇచ్చాం:

మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ.. అన్నగా… ప్రభుత్వం నిలబడుతుంది

మా హయాంలో పొదుపు సంఘాలు ఏ,బీ గ్రేడ్‌లకు చేరాయి

సున్నా వడ్డీ పథకం కింద రూ.3036 కోట్లు చెల్లించాం

రాజకీయంగా కూడా మహిళలను ఆదుకుంటున్నాం

మహిళలకు 50 శాతం నామినేట్‌ పోస్టులు ఇవ్వాలని చట్టం చేశాం

మహిళల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదు

ఏలూరు: మ‌న‌ది మహిళా పక్షపాత ప్రభుత్వమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 45 నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింద‌ని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామ‌ని చెప్పారు. మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వమ‌ని వివ‌రించారు. కోట్లమంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనదని నొక్కి చెప్పారు. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది అన్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని పాదయాత్రలో మాటిచ్చా..నేను విన్నాను... నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నానని చెప్పా..ఇచ్చిన మాట ప్రకారం అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 

మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి నుంచి (25–03–2023) ఏఫ్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,89,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరులో శ్రీకారం చుట్టిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

దెందులూరు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:

చెరగని ఆప్యాయతలు, చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ రోజు మీ అన్నకు, మీ తమ్ముడికి, మీ బిడ్డకు తోడుగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం...
దేవుడి దయతో ఈరోజు ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమాన్ని దెందులూరు నుంచి ప్రారంభిస్తున్నాం. దాదాపు 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ... మరో పదిరోజుల పాటు జరగబోయే ఆసరా సంబరాల్లో  రూ.6,419 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రతిమండలంలోనూ  ఒక పండగ వాతావరణం మధ్య ప్రతి అక్కా, ప్రతి చెల్లమ్మా తాను సాధించిన విజయాలు చెబుతుంది. 

మహిళా సాధికారితకు మీరే నిదర్శనం...
మన దెందులూరులో నా స్టేజ్‌ ఎదురుగా మిమ్నల్ని చూసినప్పుడు మహిళా సాధికారతకు అద్దం పడుతూ ఉన్న ఇంతమంది అక్కచెల్లెమ్మలు స్టేజ్‌ మీదే కాకుండా.. నా ఎదురుగా ఉన్న అక్కచెల్లెమ్మలందరూ కూడా కనిపిస్తున్నారు. కేవలం 45 నెలల కాలంలోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది ఇక్కడ కనిపిస్తోంది.
 
ఈ రోజు వైయస్సార్‌ ఆసరాగా మూడో విడతకు సంబంధించిన నిధుల విడుదల ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇంతకముందు చెప్పినట్టుగా పదిరోజుల పాటు ప్రతి మండలంలోనూ ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.


పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు...
డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటామని 2019లో నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను... నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నా అక్కచెల్లమ్మలకు తోడుగా ఉంటూ వచ్చాను. 

ఇచ్చిన మాట ప్రకారం...
ఇచ్చిన మాట ప్రకారం  నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ. 25,500 కోట్లకు పైగా అప్పుల ఊబిలోకి పోయి కొట్టుమిట్టాడుతున్నవారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఆ మాట తప్పకుండా వారికి అండగా ఉండే కార్యక్రమం చేశాం. ఈ 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ పదిరోజుల ఆసరా పండగ కార్యక్రమంలో భాగంగా మరో రూ.6419 కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి.

అసరా ద్వారా రూ.19,178 కోట్లు జమ...
ఎక్కడా ఎవ్వడూ లంచాలు అడగడు. ఎవ్వరూ వివక్ష చూపరు. నేరుగా మీ అన్న బటన్‌ నొక్కిన వెంటనే నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ రూ.6419 కోట్లు కలుపుకుంటే రూ. 19,178 కోట్లు నేరుగా ఒక్క ఆసరా ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతుంది.ఈ కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ వారికి తోడుగా ఉంటూ ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. 

వ్యాపార దిగ్గజాలతో అండ....
వైయస్సార్‌ ఆసరాగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది నేను మీ అభిమతానికి వదిలిపెట్టాను. ఈ డబ్బులు పెట్టుబడిగా వ్యాపారం, లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే వారికి ప్రభుత్వం కూడా అన్నిరకాలుగా అండదండలు ఇస్తూ... మీకు తోడుగా ఉంటుంది. వారికి తోడ్పాటు ఇస్తూ సలహాలిస్తూ.. అండగా నిలబడి ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్ధలైన ఎల్‌ అంట్‌ టీ, పీ అండ్‌ జి, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్‌ గుడి, హిందుస్తాన్‌ యూనీలీవర్‌ వంటి అనేక వ్యాపార దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని బ్యాంకులను కూడా వీరికి అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మకూ వ్యాపార మార్గాలు చూపించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది.

స్వయం ఉపాధి దిశగా...
ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన ఈ శ్రద్ధ వలన అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసరసరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేవులు ద్వారా పాడి, గొర్రెలు, మేకలు పెంపకం, పౌల్ట్రీ, పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాలలో పెద్ద ఎత్తున వీరిందరికీ స్వయం ఉపాధి మార్గాలు ప్రభుత్వం దగ్గరుండి కల్పించింది. ఆసరా, చేయూత సున్నావడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. వీటి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4355 కోట్లను వారికి అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. 

గత ప్రభుత్వంలో...
గత ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య పొదుపు సంఘాలకు సంబందించి సగటున వారికి బ్యాంకురుణాలు రూ.14వేలు ఇచ్చే కార్యక్రమం జరిగితే.. ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున బ్యాంకు రుణాలు ఏటా రూ.30వేలు అందుతున్నాయి.

99.95 శాతం రుణాల రికవరీ
దేశంలో పొదుపు సంఘాలకు ఏపీ రోల్‌మోడల్‌ 
అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి. వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. ఈ రుణాలు చెల్లించడంలో కూడా 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే పొదుపు సంఘాల విషయంలో ఆంధ్రరాష్ట్రం అక్కచెల్లెమ్మలు రోల్‌మోడల్‌గా నిలబడ్డారు. మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్రరాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. పొదుపు సంఘాలలో జరుగుతున్న విప్లవాన్ని ఎలా జరుగుతుందని ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి.. పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా వేసింది. ఇంతకముందు రూ.3 లక్షల రుణానికి సంబంధించి వడ్డీ 13 శాతం ఉండగా దాన్ని 7 శాతానికే తగ్గించడమైంది. రూ.5లక్షల రుణంపై వడీ 13 శాతం ఉంటే దాన్ని కూడా బ్యాంకులతో మాట్లాడి 9.5 శాతానికి తగ్గించడమైంది. ఈ వడ్డీ శాతంపై కూడా ఇంకా బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఈవడ్డీ శాతం కూడా ఇంకా తగ్గించుకుంటూ పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా  చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు ? ఆదాయం ఎంత వస్తుంది ?  ఏ మేరకు వడ్డీ రీజనబుల్‌ ? వడ్డీ ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి మీ తరపున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది. 

చేయూతతో మారిన పొదుపు సంఘాలు...
మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో చేయూత వల్ల పొదుపుసంఘాల పనితీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మరలా ఈ రోజు ఊపిరి పోసుకుంది. 
ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లగా మార్పు చెందాయి. ఈ సంఘాలు ఇంతకముందు ఎన్‌పీఏలు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్‌పీఏలు ఓవర్‌ డ్యూస్‌గా 18 శాతం మేరకు సంఘాలు ఉంటే.. ఈ రోజు ఎన్‌పీఎలు, ఓవర్‌ డ్యూలు శాతం 0.45 శాతం మాత్రమే. మనందరి ప్రభుత్వం సాధికారిత, అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా అండగా నిలబడిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అక్కచెల్లమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం.


గత ప్రభుత్వంలో
చంద్రబాబు హయాంలో మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఆ రోజులలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం అంటూ ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కచెల్లెమ్మలతో పనిఅయిపోయింది. అక్కచెల్లెమ్మలకిచ్చిన హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబరు నుంచి వారి తరపున కట్టాల్సిన సున్నావడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం.

అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన సున్నావడ్డీని మరలా తీసుకొచ్చి దీనికింద రూ.3036 కోట్లు ఇవాళ వడ్డీ రూపంలో తిరిగి చెల్లించడం జరిగింది.

2016 అక్టోబరులో నిలిచిపోయిన సున్నావడ్డీ అనే పథకాన్ని మన ప్రభుత్వం తిరిగి తీసుకునిరావడం వల్ల మన ప్రభుత్వం రూ.3615 కోట్లు సున్నావడ్డీ పథకం కింద చిరునవ్వుతో చెల్లించాం. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఈ 45 నెలల కాలంలో మీ అన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ఏ రకంగా ముందుకు వేసిందో కొన్ని ఉదాహరణలు చెబుతాను.

వివిధ పథకాల ద్వారా...
జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైయస్సార్‌ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు సాయం అందించాం. వైయస్సార్‌ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో 3.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.596 కోట్లు అందించాం.
వైయస్సార్‌ ఆసరా, సున్నావడ్డీ ద్వారా మరో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యాదీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువులు కోసం అందించిన సహాయం.. రూ.9947 కోట్లు. 
వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లలు వసతి భోజన సౌకర్యం కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి రూ.3363 కోట్లు ఇచ్చాం. 
30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్లపట్టాలిచ్చాం. 22 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు.  ఆ ఇళ్లు పూర్తైతే ప్రతి అక్కచెల్లెమ్మచేతిలోనూ ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా కూడా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 30 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న పరిస్థితులు.. ఇవన్నీ పూర్తైతే ఈ ఒక్క పథకం ద్వారా రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్లు వారి చేతిలో పెట్టినట్లవుతుంది.

మహిళా పక్షపాత ప్రభుత్వం....
ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మహిళా పక్షపాత ప్రభుత్వం. నా అక్కచెల్లెమ్మలకు విద్యా, ఆర్ధిక, సామాజిక, రాజకీయ సాధికారతను కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం... వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగుపడాతాయని నమ్మిన ప్రభుత్వం మనది.

కాబట్టి.. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడి, వారి రక్షణ మీద దృష్టిపెట్టిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. 
నా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అఢుగులు వేస్తున్నాం. ఆర్ధికంగా తోడుగా ఉండడం, రాజకీయంగా కూడా అక్కచెల్లెమ్మలను పైకి తీసుకురావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. 

నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50 శాతం...
నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జడ్పీ చైర్మన్‌ వరకూ, మున్సిపల్‌ చైర్మన్‌ నుంచి కార్పొరేషన్‌ మేయర్‌ వరకూ గుడి చైర్మన్‌ నుంచి ఏఎంసీ చైర్మన్‌ పదవుల వరకూ ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు.

అక్క చెల్లెమ్మల రక్షణ కోసం...
అక్కచెల్లెమ్మల రక్షణ కల్పించే విషయంలో అడుగులు వేగంగా వేసింది. అక్కచెల్లెమ్మలు ఎక్కడికి పోయినా, ఎప్పుడు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలి. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్‌ రిజిష్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా ఒక ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా లేదా పోన్‌ను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పదినిమిషాల్లో అక్కడికి వచ్చి అక్కా నీకేమైంది అని అడిగే గొప్ప వ్యవస్ధనుతీసుకొచ్చాం.

21 వ శతాబ్ధపు ఆధునిక మహిళ ఏపీ నుంచే..
ఈ రోజు దిశ యాప్‌ ద్వారా 26వేల మంది అక్కచెల్లెమ్మలకి మంచి జరిగింది. ఇవన్నీ మహిళలు విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్ధికంగా రాజకీయంగా ఎదగాలని, బాగుపడాలని 21వ శతాబ్ధపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో ఈ 45 నెలల పాలన జరిగింది. ఈ రోజు వివిధ పథకాల ద్వారా నా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు సొమ్ము ఇచ్చాం.

ఇంతలా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచించి, మంచి చేసిన పరిస్థితి గతంలో లేదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. నా అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా తపిస్తున్నాను. దేవుడి చల్లని ఆశీస్సులు మీ బిడ్డపై, ఈ ప్రభుత్వంపై ఉండాలని ఆశిస్తున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Back to Top