అడవిలో అగ్గిపుట్టించిన యోధుడు అల్లూరి

దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తాను త్యాగం చేసుకున్న మహావీరుడు 

మన గడ్డ నుంచి, మన మట్టి నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి

అలాంటి యోధుల్లో మహా అగ్నికణం.. మన అల్లూరి సీతారామరాజు

లక్షలాది యోధులు, వీరుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్ర భారతదేశం

స్వాతంత్య్రం అమృతంతో సమానం

అల్లూరి నడయాడిన నేలకు, నేలకొరిగిన ప్రదేశానికి అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరుపెట్టాం

మహా మనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదు..

అల్లూరి 125వ జయంతి సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

భీమవరం: ‘‘తన జీవితాన్ని, మరణాన్ని తరతరాలకు సందేశం ఇచ్చేలా బతికి, చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహా మనిషి అల్లూరి సీతారామరాజు. అడవిలో కూడా అగ్గిపుట్టించిన ఆ యోధుడు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తాను త్యాగం చేసుకున్న ఆ మహావీరుడు అల్లూరికి నా వందనం. తెలుగు జాతికి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత, అడవి బిడ్డలకు ఆరాధ్యదైవుడు.. అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వానికి, గొప్పదనానికి, త్యాగానికి ఆయన 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకని ఆ మహాయోధుడి విగ్రహ ఆవిష్కరణకు భీమవరం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వేదికపై ఉన్న మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవికి, ఇతర పెద్దలు, మిత్రులకు సభ అధ్యక్షుడి హోదాలో సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. సభకు వచ్చిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలకు, అందరికీ హృదయపూర్వకంగా పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

అల్లూరి 125వ జయంతి సందర్భంగా భీమవరంలో సభను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘అల్లూరి సీతారామరాజుగారి 125వ జయంతిని పురస్కరించుకొని మనమంతా ఏకమయ్యాం. ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని, మన స్వాతంత్య్ర యోధులు కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజారీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సంవత్సరం. మన దేశ స్వాతంత్య్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. మనల్ని మనం పాలించుకోవడం ప్రారంభమై 75 సంవత్సరాలు అవుతుంది. మన గడ్డ మీద మన పూర్వికులు, స్వాతంత్య్ర సమర యోధులు, వారి భవిష్యత్తును, జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారు. అలాంటి స్వాతంత్య్రం అమృతంతో సమానం. 

మరణంలేని ఓ విప్లవ వీరుడు..
75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 వరకు చూస్తే దాదాపు 190 సంవత్సరాలు తిరిగి చూస్తే పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధ చేస్తూనే అడుగులు ముందుకువేసింది. లక్షల మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి భారతదేశం. అటువంటి మహాత్యాగ మూర్తుల్లో మనగడ్డ మీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరు అయినా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులు, పోరాట యోధుల్లో మహా అగ్నికణం.. ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. అడవిలో కూడా అగ్గిపుట్టించిన ఆ యోధుడు.. సామాజిక ఐకమత్యం అవసరాలను తెలియజెప్పాడు. భావాల పరంగా ఎన్నడూ కూడా మరణంలేని ఓ విప్లవ వీరుడు.. ఆ అల్లూరిని స్మరించుకునేందుకు 125వ జయంతి సందర్భంగా మనమంతా ప్రధానమంత్రి సమక్షంలో సమావేశమయ్యాం. 

అల్లూరి జిల్లాలోనూ మ‌హ‌నీయుడి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌..
తెలుగు జాతికి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పదనానికి, త్యాగానికి గొప్పగా నివాళులర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే ఆయన నడియాడిన నేలకు, ఆయన నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మన ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో.. అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. ఆ జిల్లాలో కూడా మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతుంది. 

అల్లూరి త్యాగం చిర‌కాలం నిలిచిపోతుంది..
తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని తరతరాలకు సందేశం ఇచ్చేలా బతికి, చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తాను త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా  వందనం. ఎప్పటికీ ఆ మహావీరుడు చరితార్థుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని తెలియజేస్తూ.. అమరహే అల్లూరి సీతారామరాజు’’ అంటూ నినదిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top