వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించ‌డం అభినందనీయం

219 వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

2022–23 వార్షిక రుణ ప్రణాళికను వెల్లడించిన ఎస్‌ఎల్‌బీసీ:

2022–23 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం : రూ.,3,19,480కోట్లు

ఇందులో 51.56శాతం వ్యవసాయ రంగానికి (రూ.1,64,740కోట్లు)

 మొత్తంగా ప్రాథమిక రంగానికి 73.76శాతం (రూ. 2,35,680 కోట్లు)

పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విజ్ఞప్తి

వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట 

అమ‌రావ‌తి:  ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ 2020–21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం మనసారా అభినందనీయమ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు ప్రశంసనీయమ‌న్నారు. అగ్రికల్చర్‌ టర్మ్‌ లోన్‌ విషయానికొస్తే వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న దానికన్నా 167.27శాతం సాధించారన్నారు. అలాగే ప్రాథమికేతర రంగానికి నిర్దేశించుకున్నదానికంటే రెట్టింపు రుణాలు అంటే 208.48శాతం ఇచ్చార‌ని మెచ్చుకున్నారు.  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వ‌హించారు. వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

ఈసందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఏమన్నారంటే...:

ఈసందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
– కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీశాయి.
– కోవిడ్‌ ప్రభావం తగ్గుతున్న కొద్దీ తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
– 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5శాతంగా ఉంది. 
– అయితే అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీనికారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడిచమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. 
– ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరిందని కేంద్ర గణాంకాలశాఖ వివరాలు వెల్లడించింది. గత 8 ఏళ్ల వ్యవధిలో ఇదే అత్యధికం. నిరాశ కలిగించే మరొక విషయం ఏంటంటే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38శాతం ఉంది. 
– ఈ కారణాల వల్ల రిజర్వ్‌ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్‌ పాయింట్లు పెంచింది. అలాగే రెపోరేటును 40 బేసిక్‌ పాయింట్లు పెంచింది. జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్‌ పాయింట్లకు రిజర్వ్‌బ్యాంకు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. 
– ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు  త్రైమాసికాలలో ద్రవ్యోల్బణం 6శాతానికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. దీనివల్ల నగదు నిల్వలు క్రమంగా తగ్గుతాయి. 
– ఈ పరిణామాలన్నీ కూడా దిగువ తరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తయారీ రంగంపైకూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. సరుకులు కొనేవారు లేకపోతే, వారు పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.
–ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు విశేష కృషిచేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా అవసరమైన చర్యలను తీసుకోవాలి. తక్కవ వడ్డీలకు విరివిగా రుణాలు ఇవ్వాలి. 
– ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తోంది. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రత్యక్షంగా నగదు బదిలీచేస్తోంది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంది. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి, వారిని సాధికారితవైపు నడిపించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోంది.

– ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ 2020–21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం మనసారా అభినందనీయం. కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు ప్రశంసనీయం. అగ్రికల్చర్‌ టర్మ్‌ లోన్‌ విషయానికొస్తే వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న దానికన్నా 167.27శాతం సాధించారు. అలాగే ప్రాథమికేతర రంగానికి నిర్దేశించుకున్నదానికంటే రెట్టింపు రుణాలు అంటే 208.48శాతం ఇచ్చారు. 
– అయితే మరికొన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎగుమతులకోసం నిర్దేశించుకున్న దాంట్లో 31.01 శాతం, విద్యారంగానికి సంబంధించి 50.03శాతం, హౌసింగ్‌కు సంబంధించి 36.11శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. సామాజిక ఆర్థిక ప్రగతిలో విద్య, హౌసింగ్‌.. ఈ రెండుకూడా అత్యంత కీలకమైనవి. ఈ రంగాలకు సంబంధించి బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో ముందడుగువేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 
– అలాగే వ్యవసాయరంగానికి ఇచ్చే రుణాలను పరిశీలిస్తే ఖరీఫ్‌లో షార్ట్‌ టర్మ్‌ క్రాప్‌ ప్రొడక్షన్‌ రుణాలు 87.40శాతం, అదే ఖరీఫ్‌లో అగ్రికల్చర్‌ టర్మ్‌ లోన్స్‌ 59.88శాతం  మాత్రమే ఇచ్చారు. కాని వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారు. రబీ సీజన్‌ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోంది. కాకపోతే ఖరీఫ్‌ సీజన్‌లో ఎందుకు రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోలేకపోయామన్న విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. 
– అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యంలో 82.09శాతం, పౌల్ట్రీకి సంబంధించి 60.26శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ రంగాలకు రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. 
– అలాగే 2021–22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53శాతమే రుణాలు అందాయి. వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధపెట్టాలి. రైతులు, కౌలు రైతులు సాగుచేస్తున్న ప్రతి కమతాన్ని కూడా ఇ–క్రాపింగ్‌ చేస్తున్నాం. సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చు. ఈ డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి, బ్యాంకర్లు అండగా నిలవాలి. ఆర్బీకేలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఇద్దరూ కూడా కౌలు రైతులకు ఈ విషయంలో సహాయకారిగా నిలవాలి.

– చిరువ్యాపారులకు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోంది. వడ్డీలేకుండా రూ.10వేల చొప్పున రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. వడ్డీభారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకులు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ దాదాపుగా 14.15లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయి. ఇదే ధోరణిని కొనసాగించాలని కోరుతున్నాను. తదుపరి విడత రుణాలు జులైలో ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. 

– 2021–22లో ఎంఎస్‌ఎంఈలకు 90.55శాతం రుణాలు ఇచ్చారు. ఈ రంగంలో కూడా లక్ష్యం కంటే తక్కువగా రుణాలు ఇచ్చారు. దీనిపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. 

– రాష్ట్రంలో భారీ ఎత్తున గృహనిర్మాణం జరుగుతోంది:
– విలువైన భూముల పట్టాలను పేదలకు అందించడం జరిగింది:
– వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంది:
– పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తిచేస్తున్నాను:
– ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుంది:
– టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులతో బ్యాంకులు టైప్‌ కావాల్సి ఉంది:
– ఈ అంశంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి:

– రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం విశేష కృషిచేస్తున్నాం. ఈకార్యక్రమంలో దాదాపు కోటిమంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనైనా, అర్భన్‌ ప్రాంతాల్లోనైనా మహిళా సాధికారిత ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం. వడ్డీలేని రుణాలు, ఆసరా, చేయూత.. తదితర కార్యక్రమాల ద్వారా మహిళలకు ఈ ప్రభుత్వంగా అండగా నిలుస్తోంది. ఈ మహిళలకు బ్యాంకులు అండగా నిలవాలి. తీసుకున్న రుణాలను మహిళలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. కార్పస్‌ ఫండ్‌ కింద బ్యాంకుల వద్ద ఉన్న మహిళలు  డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారని, కానీ తీసుకున్న రుణాలపై అధికంగా వడ్డీని వసూలు చేస్తున్నారని మహిళలు అంటున్నారు. ఈ అంశంపై బ్యాంకులు దృష్టిసారించాలి. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 

– అంతేకాక ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు  బ్యాంకులు సహకారం అందించాలి:
– వార్షిక రుణ ప్రణాళికలో ఈ అంశాలను ప్రయార్టీగా తీసుకోవాలి:
– దీనికోసం వార్షిక రుణ ప్రణాళిక తయారీలో ప్రభుత్వాధికారుల భాగస్వామ్యాన్నికూడా తీసుకోవాలి:
– దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించుకున్న అంశాలకు వార్షిక ప్రణాళికలో చోటు దక్కతుంది:
– ప్రభుత్వం ఏయే అంశాలపై దృష్టిపెడుతుంది, వాటికి ఏ రకంగా బ్యాంకులనుంచి మద్దతు లభించాలన్నదానిపై తగిన కసరత్తు జరుగుతుంది:
– దీనివల్ల ఆయా రంగాలకు మేలు జరుగుతుంది:

– ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నాం:
– వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట వేస్తున్నాం:
– ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంచుతున్నాం:
– నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుంది:
– డ్రోన్‌ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలి:

– రాష్ట్రంలో మౌలికసదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం:
– హార్బర్లు, పోర్టులను నిర్మిస్తున్నాం:
– వీటికీ బ్యాంకులు తగిన రీతిలో సహకారం అదించాలి:

– వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోకూడదు:
– దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీచేసింది:
– ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యంకోసం ఈ పథకాలు అమలు చేస్తున్నాం:
– ఈ అంశాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలి:

– కోవిడ్‌ సమయంలో బ్యాంకులు ప్రభుత్వానికి చాలా బాగా సహకరించినందుకు బ్యాంకర్లందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను:

Back to Top