జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ

27 లక్షల మందికి ఇళ్ల స్థలాలతో పాటు ఉచితంగా ఇల్లు

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

తాడేపల్లి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అదుపు చేసేందుకు రాష్ట్రంలో 13 దిశా పోలీసు స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ చట్టానికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ జయంతి రోజున రాష్ట్రంలో 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, వారందరికి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి సచివాలయంలో 8 మంది మహిళా మిత్రులను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 11 వేల మంది మహిళా పోలీసులను నియమించినట్లు చెప్పారు. ప్రతి సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉన్నారన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా బకాయి పెట్టిందని, మార్చి 31 వరకు ఉన్న బకాయిలన్నీ ఈ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని, జవాబుదారీతనం కోసమే ఇలా చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు.
 

Back to Top