గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఖాళీల భ‌ర్తీపై దృష్టిపెట్టండి

ఉగాది నాడు ఉత్త‌మ సేవ‌లందిస్తున్న వ‌లంటీర్ల‌కు స‌త్కారం, ప్రోత్సాహ‌కాలు

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చాలి

సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనది

సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఉండాలి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష

తాడేప‌ల్లి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాల‌ని, ఆధార్‌ సేవలను అందించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాల‌ని సూచించారు. సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమం తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టిపెట్టాలని అధికారుల‌కు సూచించారు. అలాగే ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ కూడా యూనిఫామ్స్ అందించాల‌న్నారు. హార్డ్‌ వేర్‌ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, నెలకోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని ఆ మేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు కనబరచాలన్నారు. ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరుపట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. నిర్దేశించిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశమని సీఎం చెప్పారు. ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తికావాలని ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. 

ప్ర‌భుత్వ‌ సేవలకోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థఉండాలని సీఎం సూచించారు. దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందుపరచాలని, పోర్టల్‌లో ఈమేరకు మార్పులు చేర్పులు చేయాలని ఆదేశించారు. సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనద‌ని, అత్యంత‌ సమర్థవంతంగా ఈకార్యక్రమం కొనసాగాల‌న్నారు. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు కూడా మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంద‌న్నారు. 

సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య నిరంతరం సమన్వయం ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేదిశగా ఆలోచన ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను మారుతున్న పరిస్థితులకు, సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

స‌మీక్షా స‌మావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఎంఏఅండ్‌యూడీ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, హౌసింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, సీఎం సలహాదారు (గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్‌.ధనుంజయ్‌ రెడ్డి, జీఎస్‌డబ్యూఎస్‌ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే,  విఎస్‌డబ్యూఎస్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ షన్‌ మోహన్, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top