తాడేపల్లి: కోవిడ్ సెకండ్‌వేవ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని గుర్తుచేశారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూపర్ స్పెషాలిటీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
వ్యాక్సిన్ పంపిణీపై ప్రస్తుత సదుపాయాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను సీఎంకు అధికారులు వివరించారు. వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ పంపిణీ చేసే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉందని అధికారులు తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
వ్యాక్సిన్లు, అవి పనిచేస్తున్న తీరుపై బ్రిటన్ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు, ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. దీనికి ఎలాంటి మౌలిక వసతులు కావాలన్న దానిపై కూడా ఆలోచనలు చేయాలని సూచించారు.
పల్లెల్లోకి డాక్టర్లు.. సరికొత్త వ్యవస్థకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లోకి డాక్టర్లు వచ్చి వైద్యం చేసేలా చూడాలని, ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చూడాలి. ప్రతి పీహెచ్‌సీల్లో కనీసం ఇద్దరు చొప్పున నలుగురు డాక్టర్లు ఉన్నారనుకుంటే.. ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలి. ప్రతి నెలకు రెండు సార్లు డాక్టర్ తనకు నిర్దేశించిన అదే గ్రామాలకు వెళ్లాలి. హోం విజిట్స్ కూడా చేసే విధంగా అధికారులు దీంతో గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితుల మీద డాక్టర్‌కు అవగాహన ఏర్పడుతుంది. ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారన్నదానిపైన కూడా వైద్యుడికి అవగాహన వస్తుంది. వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్‌లు డాక్టర్‌తో ఉంటారు. 104 వాహనాల ద్వారా వారికి చికిత్స అందించడం సులభం అవుతుంది. అవసరం అనుకుంటే 104లనుకూడా పెంచుకోవాలి.
డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ కూడా వేదికగా ఉంటుంది. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్‌కు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యకార్డుల్లో నమోదుకూ అవకాశం ఏర్పడుతుంది. మెరుగైన వైద్యం కోసం సరైన ఆస్పత్రికి వారు రిఫరెల్ చేయగలుగుతారు. గ్రామాల్లోకి డాక్టర్లు వెళ్లడం ద్వారా ఆరోగ్య సేవలు సక్రమంగా అందుతాయి. పల్లెల్లోకి డాక్టర్లు.. సరికొత్త వ్యవస్థపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ వ్యవస్థను ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకువస్తారన్న దానిపై తేదీని కూడా ఖరారు చేయాలని సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.