నాడు–నేడుతో పాఠశాలల అభివృద్ధి

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గిస్తాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్కూళ్ల అభివృద్ధికి ప్రభుత్వంతో పలు కార్పొరేట్‌ సంస్థలు ఒప్పందం

 

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలలు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని, నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పలు కార్పొరేట్‌ సంస్థలతో సమావేశమయ్యారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు ఐదు కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చాయి. హెటిరో, వసుధ ఫార్మా, ఆదిశిల ఫౌండేషన్, లారస్‌ ల్యాబ్స్, రెయిన్‌ కార్బస్‌ సంస్థలు పాఠశాల విద్యాశాఖ ద్వారా గుర్తించిన 2,566 ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌తో ఐదు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.  

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నాడు – నేడు ద్వారా 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లను రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.  ఇంగ్లిష్‌ ల్యాబ్‌ సహా 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కచ్చితంగా ప్రతీ స్కూల్‌లో అన్ని సదుపాయాలు ఉండడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం, ఆ తరువాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతామన్నారు. అమ్మ ఒడి ద్వారా పిల్లల తల్లులను ఆదుకుంటామని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉంది. నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గిస్తామన్నారు.

నాడు – నేడు కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలపై కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందేనని, అందుకనే మీ సహకారాన్ని కోరుతున్నామని, నాడు – నేడు కార్యక్రమాన్ని ఇతర సంస్థలకూ మీరు చెప్పాలి. తద్వారా అందరూ భాగస్వాములు కావాలని కార్పొరేట్‌ సంస్థలకు సూచించారు. 

   
Back to Top