తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ సెల్‌ఫోన్‌లో దిశ యాప్ ఉండాలని, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ``దిశ``పై ప్రత్యేక దృష్టిపెట్టాలని, వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయంతో విస్తృత ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలని, ‘దిశ’యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలని సూచించారు లా అండ్ ఆర్డర్‌పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం.. తదితర అంశాలపై సీఎం సమీక్షించారు.
``దిశ`` ద్వారా..
ఇప్పటి వరకు 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్ చేశారని, దిశ యాప్ ద్వారా 5238 మందికి సహాయం అందించామని పోలీస్ ఉన్నతాధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. దిశయాప్ ద్వారా 2021లో 684 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేశామని తెలిపారు. అందిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్న దానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామని చెప్పారు. దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామన్నారు. ‘దిశ’ అమలు కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందని తెలిపారు. గతంలో డీఎన్‌ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్నారు. సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్‌లో ‘దిశ’ యాప్ డౌన్లోడ్ కావాలి. వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ‘దిశ’యాప్ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలి`` అని సీఎం సూచించారు.
‘దిశ’ చట్టం ప్రగతిపై సమీక్ష..
‘దిశ’బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరాలు అందించారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి.
ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సమీక్ష..
పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. డిసెంబర్‌నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయని చెప్పారు. కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలని, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్నారు. వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
‘దిశ’ ఒన్‌స్టాప్ సెంటర్ల పనితీరుపై సమీక్ష..
ఈ ఏడాది సెప్టెంబరు వరకు 2652 కేసులను దిశ ఒన్‌స్టాప్ సెంటర్ల ద్వారా హేండిల్ చేశామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. సచివాలయాల్లో మహిళా పోలీసుల వ్యవస్థపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. దేవాలయాల్లో భద్రత కోసం 51,053 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.
సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి..
అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. శరవేగంగా బాధితులను ఆదుకోవాలన్నారు. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలన్నారు. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించారు. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
సైబర్ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం
సైబర్ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. సమర్థత ఉన్న అధికారులను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. సమర్థవంతమైన న్యాయవాదులను కూడా ఈ విభాగంలో నియమించాలన్నారు. ఏపీకి సంబంధంలేని డ్రగ్ వ్యవహారంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, లేని అంశాన్ని.. ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతోపాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.
బాధితుడికి భరోసాగా ఉండటమే ముఖ్యం..
కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యమని సీఎం వైయస్ జగన్ అన్నారు. ఫిర్యాదుదారులకు వెసులుబాటుగా వ్యవస్థ ఉండాలని, ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు పెరుగుతాయని వెనకడుగు వేయకూడదని, బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యమని సూచించారు.
కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలి..
మాదకద్రవ్య రహితంగా కాలేజీలు, యూనివర్శిటీలు–తక్షణ చర్యలకు సీఎం ఆదేశించారు. అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ ఉండాలన్నారు. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా? లేవా? అని సమీక్షించని సూచించారు. ఉంటే అలాంటి కాలేజీలను మ్యాపింగ్ చేయాలని, ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదని, దీన్ని ఒక సవాల్‌గా తీసుకోండి అని సూచించారు. ``కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి.. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి.. ఒక కార్యాచరణను రూపొందించుకోండి.. అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్ ఫ్రీగా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం`` అని సీఎం స్పష్టం చేశారు.
మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్‌ఈబీ సహా.. పోలీసులు ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. ``అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం. మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం. మద్యం అమ్మకాల వేళలు తగ్గించాం. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా మద్యం రేట్లు పెంచాం. దీనివల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది`` అని సీఎం వివరించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదని పోలీసులను ఆదేశించారు. దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఎస్‌ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కూడా చర్యలు తీసుకోవాలని, గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
మహిళా పోలీసులకు శిక్షణ ..
వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించామని సీఎం వివరించారు. సచివాలయాల్లోని మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలని, డిసెంబరు నాటికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలన్నారు. దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధం కావాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె.సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.