డీశాలినేషన్‌ చేసిన సముద్రజలాలు పరిశ్రమలకు అందించాలి

రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేయాలి

మంచినీటిని ఆదా చేయడంపై ప్రభుత్వం దృష్టి

డీశాలినేషన్‌ ప్లాంట్లను ప్రమోట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి

పరిశ్రమలకు నీటిని అందుబాటులో ఉంచే బాధ్యత ఏపీఐఐసీదే

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

మంచినీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధ జలాల పంపిణీపై సమీక్ష

తాడేపల్లి: మంచినీటిని ఆదా చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, డీశాలినేషన్‌ చేసిన సముద్రజలాలను పరిశ్రమలకు అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సముద్ర తీరాల ప్రాంతాల్లో డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. పైపులైన్‌ ద్వారా ఈ నీటిని పరిశ్రమాలకు అందించేలా ఆలోచన చేయాలని సూచించారు. మంచినీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధి చేసిన జలాల పంపిణీపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీల‌క్ష్మీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. డీశాలినేషన్‌ ప్లాంట్లను ప్రమోట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రీసైకిల్‌ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలన్నారు. రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేసుకోవాలని సూచించారు. పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదేనని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన క్వాలిటీ నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పకడ్బందీగా డీశాలినేషన్‌ చేసి, శుద్ధమైన నీటిని పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అందించాలన్నారు. 

సాగుకోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారుచేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడెక్కడిæనుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు, ఆ నీటికి బదులుగా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధంచేయాలని సూచించారు. 
 

Back to Top