టెలీ మెడిసిన్‌ మరింత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలి

క్వారంటైన్‌ల్లో సదుపాయాలు మెరుగుపర్చడంపై దృష్టిపెట్టండి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ విధానం మరింత సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని, ఫోన్‌ చేసిన 24 గంటల్లోనే పూర్తిగా వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలలో తప్పనిసరిగా బైక్‌లు, థర్మో బ్యాగ్‌లు వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా కేసులు కాకుండా టెలీ మెడిసిన్‌కు ఇతర కేసులు ఎన్ని వస్తున్నాయో వివరాలు ఇవ్వాలని, డాక్టర్లు ప్రిస్కిప్షన్‌ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలన్నారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ కరోనా పరీక్షలు పూర్తి చేశామని అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు. పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని, ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు కూడా ఇందులో భాగమని సీఎం సూచించారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన వారి రాక దేశంలో ప్రారంభమైందని, గల్ఫ్‌ నుంచే కాకుండా యూకే, యూఎస్‌ నుంచి కూడా కొంతమంది రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. వారందరికీ క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారంటైన్‌ కేంద్రాలు బాగుండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న 75 వేలకు పైగా పడకలను ముందస్తుగా వినియోగించుకోవాలన్నారు. వాటి సంఖ్యను లక్ష వరకూ పెంచాలని ఆదేశించారు. 75 వేల క్వారంటైన్‌ పడకలు వినియోగించినా, మిగిలినవి స్పేర్‌లో ఉంచాలన్నారు. వాటన్నింటిలో ఏ లోటు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. క్వారంటైన్‌లలో సదుపాయాలను మెరుగుపర్చడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. 
 

Back to Top