మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్‌గా ఎదగాలి

 జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కల నెరవేర్చడమే లక్ష్యం

పిల్లల చదువు భారం తల్లిదండ్రులపై పడొద్దు

పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు అద్భుతమైన పథకం విదేశీ విద్యా దీవెన

ఏ టాప్‌ యూనివర్సిటీలో సీటు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రిలిమ్స్‌ పాసైతే లక్ష రూపాయలు, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నాం

గత ప్రభుత్వంలో 3 వేల మందికి చెందిన నిధులు బకాయిలుగా వదిలేశారు

రాష్ట్రానికి మంచి చేసే అవకాశం మన విద్యార్థులకు రావాలి

తాడేప‌ల్లి:  మ‌న విద్యార్థులు పోటీ ప్ర‌పంచంలో లీడ‌ర్స్‌గా ఎద‌గాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతున్నారని చెప్పారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రూ. 8లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్‌ పాస్‌ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..
 అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కలెక్టర్లు, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులే కాకుండా విదేశీ విద్యాదీవెన పొందుతూ. విదేశాల్లో చదువుకుంటూ అక్కడ నుంచి వీసీలో పాల్గొన్న మన పిల్లలందరికీ అభినందనలు. 

రెండు మంచి కార్యక్రమాలకు శ్రీకారం.
ఇవాళ రెండు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడి దయ వల ఈ రెండు మంచి కార్యక్రమాలు చేయడం, ఆ ఆనందాన్ని పొందడం దేవుడిచ్చిన అదృష్టం.

రూ.1.25 కోట్లు వరకూ ఫీజు చెల్లించే కార్యక్రమం. 
ఈ రెండు కార్యక్రమాల్లో ఒక ప్రత్యేకత ఉంది. వీటి ద్వారా మన రాష్ట్రంలో ఎవరికైనా ఒక ఆకాంక్షను క్రియేట్‌ చేయగలుగుతున్నాం. మన రాష్ట్రంలో ఎవరైనా కష్టపడి చదవితే, మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మనం కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎటువంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం, జగనన్న తోడుగా ఉంటాడని భరోసాను ఈ కార్యక్రమం ద్వారా కల్పిస్తున్నాం.  సాచ్యురేషన్‌ విధానంలో, పారదర్శకంగా ఎవరికైనా టైమ్స్‌ రేటింగ్స్‌లో కానీ, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో కానీ టాప్‌–50 కాలేజీలకు సంబంధించి 21 ఫ్యాకల్టీలలో ఉన్న దాదాపు 350 కాలేజీలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరికి సీటు వచ్చినా మొత్తం ఫీజు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల పిల్లలకు రూ.1.25 కోట్లు వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, మిగిలినవారికి రూ.1కోటి వరకు.. దాదాపు మొత్తం ఫీజు అందించే కార్యక్రమం జరుగుతోంది. 

ఈ సంవత్సరం దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి.ఈ కార్యక్రమంలో వారికి ఫీజులు కోసం రూ.9.50 కోట్లు ఇవ్వడం జరుగుతోంది.   ఇదొక్కటే కాకుండా  విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటివరకు చదువుతున్న 408 మందిలో ఈ సీజన్‌లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందిని కలుపుకుంటే...వారికి కూడా రూ.41.60 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొత్తం ఈ 408 మంది పిల్లల కోసం రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమమిది.
ఈ పథకం చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం. కారణం మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు కూడా స్ఫూర్తి పొంది.. ఇదే మాదిరిగా టాప్‌ కాలేజీల్లో సీట్లు తెచ్చికుని.... మీ తలరాతలు మార్చుకోవడమే కాకుండా... మీరు బాగా ఎదిగిన తర్వాత మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిన సహాయాన్ని గుర్తుంచుకోవాలి. మంచి సీఈఓలుగా పెద్ద, పెద్ద సంస్ధల్లో మీరు పేరు సంపాదించుకున్న తర్వాత రాష్ట్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే నా తాపత్రయం, కోరిక.

ఎంత పెద్ద ఫీజులున్నా భరోసానిస్తూ...
ఈ ఫీజులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయా యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించిన 51 మందిని చూస్తే..  కార్నిగీ మిలాన్‌ యూనివర్సిటీలో దాదాపు రూ.90 లక్షలు ఫీజు. చెల్లెమ్మ రూపకు కార్నిగీ మిలాన్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌కు రూ.89 లక్షలు చెల్లించాం. తమ్ముడు సాంబశివకు న్యూయార్క్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోసం  రూ.89 లక్షలు ఫీజు చెల్లించాం. కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్‌ ఇంజనీరింగ్‌ విద్య కోసం రూ.75.87 లక్షలు, వాషింగ్టన్‌ యూనివర్సిటీ, సెయింట్‌ లూయిస్‌లో శ్రేయ కోసం రూ.75 లక్షలు ఫీజు, యూనివర్సిటీ ఆఫ్‌ మిచ్‌గాన్‌ యానాబర్‌లో మరియం కోసం రూ.67.50 లక్షలు ఫీజులు చెల్లించాం. ఇలా 51 మంది ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఫీజులన్నీ ఏ స్ధాయిలో ఉన్నాయంటే సీటు వచ్చినా కూడా అక్కడకు వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోదు. ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎంత అప్పుచేయాలి, ఎక్కడ అప్పు చేయాలి, ఒకవేళ అప్పులు చేస్తే తిరిగి చెల్లించడం ఎలా అన్నది ప్రతి తల్లిదండ్రికి సంశయం కలిగే పరిస్థితి. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం,  అటువంటి పరిస్థితులో ఉన్నవాళ్లకు ఇలాంటి టాప్‌ కాలేజీలలో సీటు వస్తే... ప్రభుత్వం మీకు అన్నిరకాలుగా తోడుగా ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పిస్తూ శాచ్యురేషన్‌ విధానంలో, ప్రతి ఒక్కరికీ మీరు స్ఫూర్తిగా నిలిచేలా.. అడుగులు పడుతున్నాయి.

మరింత ఉన్నతస్ధాయికి చేరాలని ఆకాంక్షిస్తూ...
ఈ 408 మందిలో వార్షికాదాయం రూ.8లక్షలలోపు ఉన్నవారెవరైనా.. ఇందులో కవర్‌ అవుతారు. ఇది దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా వారికి ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతున్నాయి. 
మీ అందరికీ మరోసారి అభినందనలు. దీనివల్ల అట్టడగువర్గాలు అత్యధికంగా బాగుపడాలని మనసారా కోరుకుంటున్నాను. దాదాపుగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల నుంచి 45 శాతం ఉంటే.. మిగిలిన 55 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్లున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది అట్టడుగు వర్గాల నుంచి ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వారి కుటుంబాలను కూడా ఈ స్థాయి నుంచి మరో స్ధాయికి తీసుకునే పోయేవిధంగా దేవుడు మిమ్నల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. 

స్ఫూర్తి నిచ్చే వ్యక్తులగా ఎదగాలని..
ఇవాళ ఇంకో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో యువత  ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్‌ కావాలని కలగంటారు. ఇక్కడ నుంచి కూడా స్ఫూర్తి నిచ్చే వ్యక్తులు, వారి విజయాల కథలు రావాలన్న తపన, తాపత్రయంతో దీనికి సంబంధించి మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.ఎవరైనా ప్రిలిమ్స్‌ పాసైనవారికి రూ.1 లక్ష  ఇచ్చేట్టుగా, ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు వెళితే మరో రూ.50 మొత్తంగా రూ.1.50 లక్షలు వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం. ఎన్నిసార్లు వాళ్లు రాసినా ఈ సపోర్టు వారికి కంటిన్యూ అవుతుంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది స్ఫూర్తి పొందుతారు. ఇంకా ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మన రాష్ట్రం నుంచి  అవుతారన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.

ఈకార్యక్రమం ద్వారా 95 మంది తమ్ముళ్లు ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేసారు వాళ్లకు రూ.1లక్ష ఇస్తున్నాం. 11 మంది ప్రిలిమ్స్‌ స్టేజ్‌ నుంచి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. వారికి మరో రూ.50 వేలు కూడా ఇస్తూ ఈ రోజు ప్రారంభిస్తున్నాను. 

ఈ రెండు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీ మందు ఉంచే విషయం ఏమిటంటే.. ప్రభుత్వంలో శాచ్యురేషన్, ట్రాన్స్‌ఫరెన్సీ అనే పదాలను మీ ముందుంచుతున్నాం. అర్హత ఉంటే.. ఎవరికైనా ప్రభుత్వం మంచి చేస్తుంది. ఎక్కడా, ఎవరికీ రికమండేషన్‌లు పనిచేయవు. ఎవరితోనూ సిఫార్సులు అవసరం లేదు. ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. క్వాలిఫై అయి దరఖాస్తు చేసుకుంటే చాలు. నేరుగా మన ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది. 

 చేతులు దులుపుకున్న గత ప్రభుత్వం 
గతంలో ఇదే విదేశీ విద్యాదీవెనను గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించాయి. కానీ ఇవాళ మనం చేస్తున్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో ఒక మోసంగా మిగిలిపోయింది. ఒకవైపు ఫీజులు రూ.70 లక్షలు, రూ.60లక్షలు, రూ.50లక్షలు కనిపిస్తుంటే.. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలా చేయడం వల్ల ఏ ఒక్కరికీ మంచి జరగదు. అప్పులు పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పటికీ బ్రతుకులు మారవు. ఏదో చేశామంటే చేశామన్న పరిస్థితి. దాన్ని కూడా సక్రమంగా మనసు పెట్టి చేయలేదు. చిత్తశుద్ధి లేదు. దాదాపుగా 3,326 మందికి 2016–17 సంవత్సరానికి సంబంధించి రూ.318 కోట్ల బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీలకు సంబంధించిన కాలేజీల్లోనూ పారదర్శకత లేదు. ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా, రికమెండేషన్‌లు పెట్టుకుని కొంతమంది మాత్రమే అర్హత పొందేవారు. ఇవన్నీ ఇప్పుడు మార్పుచేశాం. 

అర్హతే ప్రామాణికంగా ఎంపిక.
అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాం. సిఫార్సులు, రాజకీయ జోక్యం, అవినీతి, లంచాలు లేవు. ఎవరికైనా 21 ఫ్యాకల్టీలలో, టాప్‌ 50 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా రూ.1.25 కోట్లు వరకు గరిష్టంగా పరిమితిపెట్టాం. మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలని ఇవన్నీ చేస్తున్నాం. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలి, రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ కథనాలు స్ఫూర్తిగా నిలవాలని మనసారా కోరుకుంటున్నానని చెబుతూ.. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top