ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం

పుట్ట‌ప‌ర్తిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఐదో ఏడాది రెండో విడతలో వైయ‌స్ఆర్‌ రైతు భరోసా నిధులు విడుద‌ల చేసిన ముఖ్య‌మంత్రి 

ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేత‌

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు

రైతులకు పెట్టుబడిసాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు

మన ప్రభుత్వం రైతులకు అందించిన సాయం రూ.33,209.81 కోట్లు

పీఎం కిసాన్‌ నిధులు కూడా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను

నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలని అడుగులు వేశాం

గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడండి

చంద్రబాబు హయాంలో హెరిటేజ్‌ కంపెనీకి లాభాలు పెరిగాయి

పంట సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం

గడిచిన 4 ఏళ్లలో రూ.60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం

సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ రైతన్నకి భరోసా కల్పిస్తున్నాం

చంద్రబాబు పేరు చెబితే స్కామ్‌లే గుర్తుకొస్తాయి

రాష్ట్రాన్ని దోచుకునేందుకే చంద్రబాబుకు అధికారం కావాలి

మీ బిడ్డకు ఎల్లోమీడియా అండదండలు లేవు

రాబోయే రోజుల్లో మోసాలు, అబద్ధాలు నమ్మకండి

మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి

గెలిచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి సపోర్టు అవసరం లేదు

 పుట్ట‌ప‌ర్తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌  ప్రతీ విషయంలో అన్నదాతలకు అండగా నిలబడ్డామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్ల పాల‌న‌లో మొత్తం రూ.33,209.81 కోట్లు రైతుల‌కు సాయంగా అందించామ‌న్నారు. 14 ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని గతంలో ఎప్పుడూ ఆలోచన చేయలేదు. రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతలో వైయ‌స్ఆర్‌  రైతు భరోసా నిధులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడుదల చేశారు. పుట్టపర్తిలో బటన్‌ నొక్కి ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయం అందజేశారు.  

 ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే.....: 

దేవుడి దయ దేవుడి దయతో ఈ రోజు పుట్టపర్తి నుంచి మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వులు, చెరగని ప్రేమాభిమానాలు మధ్య ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడుకి, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఐదో ఏడాది- రెండో విడత రైతు భరోసా
ఈరోజు వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ కింద వరుసగా ఐదో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని అందించే మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మీ అందరి సంతోషాల మధ్య జరుపుకుంటున్నాం. పుట్టపర్తిలో స్వర్గీయులు, దేవుడిగా కొలుస్తున్న స్వామివారి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్న కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ దాదాపుగా 53.53 లక్షల మంది రైతన్నలకు మంచి చేస్తూ... బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ. 2204.77 కోట్లు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన రూ.1200 కోట్లు నేరుగా ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఆ తర్వాత త్వరలోనే పీఎం కిసాన్‌ కింద రావాల్సిన ఆ రూ.1000 కోట్లు కూడా వాళ్లుఇచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ రోజు ఇక్కడికి రాకమునుపు వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈ రోజు నేను బటన్‌ నొక్కుతున్నాను. మా డబ్బులతో పాటు మీ డబ్బులు జత అయితే రైతుల మొహంలో ఇంకా ఎక్కువ చిరునవ్వు కనిపిస్తోంది. మీ డబ్బులు కూడా క్రోడీకరించగలుగుతారా అని అడిగాం. ఈ నెలలో ఇస్తామన్నారు. ఇంతకంటే ఎక్కువ ఆలస్యమయితే రైతన్నలు ఇబ్బంది పడతారని.... మీ బిడ్డ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడకు వచ్చి బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. 

53 నెలల్లో 53 లక్షల రైతన్నలకు మేలు చేస్తూ..
ఈ 53 నెలల కాలంలోనే ఇప్పటికే 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ, ప్రతి రైతన్నకు నేరుగా బటన్‌ నొక్కి  రైతన్నలు, వారి కుటుంబాల ఖాతాల్లోకి రూ.61,500 ఇవ్వడం జరిగింది. 
దీనికి ఈ రూ.4,000 కలుపుకొంటే రూ.65,500 ప్రతి రైతన్నకు మంచి జరిగిస్తూ ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ ద్వారానే ఇవ్వడం జరుగుతోంది.
ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపు 53 లక్షల పైచిలుకు రైతులకు రూ.33,209 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా పంపగలిగాం.  రైతులుగానీ, అవ్వాతాతలుగానీ, అక్కచెల్లెమ్మలుగానీ, చదువుకొనే పిల్లలు గానీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ నా నిరుపేద వర్గాలు... వీరందిరికీ మంచి చేస్తే, ఇచ్చిన ప్రతిమాటా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లో స్థానం ఇస్తారని చెప్పడానికి ఒక వైయస్సార్‌ గారిని చూసినా ఒక జగన్‌ను చూసినా అర్థం అవుతుంది. 
 ఈరోజు జరుగుతున్న సామాజిక సాధికార యాత్రలను చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనార్టీలను నాయకత్వ రోల్‌లోకి తీసుకొచ్చి వాళ్ల చేత మీటింగులు పెట్టిస్తున్నా తండోపతండాలుగా జనాలు కదిలి వస్తున్నారంటే... ఎంతగా ప్రతి పేద వాడి గుండెల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానం ఉందో నిదర్శనంగా కనిపిస్తోంది.  మీ బిడ్డ జగన్‌ కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగులే నిదర్శనం. 


ప్రతి అడుగులోనూ రైతుకు మంచి చేస్తూ...
ఈ నాలుగు సంవత్సరాల కాలం.. ప్రతి అడుగూ రైతన్నకు మంచి జరగాలి, పేద వాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నిరుపేద వర్గాలు ముందడుగు వేయాలి, వాళ్లు బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలి, ఎదగాలని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని..
రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా.. ప్రతి విషయంలో రైతులకు మద్ధతుగా నిలబడ్డాం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్న ఆలోచించాలి. 

ఈ 53 నెలల్లోనే రైతుకు, రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతిచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్‌ చేసిన పనులను, తాను చేయలేకపోయాడో ఆలోచన చేయాలి. 
ఈ రోజు రాష్ట్రంలో 50 శాతం మంది రైతన్నలు.. ప్రతి రైతన్నకు ఉన్నది  అరహెక్టారు లోపు మాత్రమే. ఒక హెక్టారు వరకు తీసుకుంటే..70 శాతం మంది రైతన్నలు కనిపిస్తారు. అరహెక్టారు లోపు భూమితో 50 శాతం మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ రూ.13,500 పెట్టుబడి సహాయం కింద సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బ్రతుకుతారు  ? వారికి పెట్టుబడి సహాయం కింద డబ్బులు ఎలా వస్తాయి ? వ్యవసాయం ఎలా చేసుకోగలుగుతాడు  ? అప్పులు పాలు కాకుండా మందడుగు ఎలా వేయగలుగుతాడు ?  అని గతంలో ఎప్పుడూ ఆలోచన చేసిన పరిస్థితి లేదు.
అందుకే  మరి ఇలాంటి రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా పెట్టుబడి సమయంలో రైతులు ఇబ్బంది పడకూడదని...  వైయస్సార్‌ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితోపాటు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ రైతులకు, ఆర్వోఎఫ్‌ ఆర్‌ గిరిజన రైతులకు ప్రతి ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 

మరి 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని కూడా రైతులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు బుర్రలో ఎందుకు రాలేదని ప్రతి రైతన్న ఆలోచన చేయాలి. 

విత్తనం నుంచి అమ్మకం వరకూ ఆర్బీకేలు.
విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను ప్రతి అడుగులో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అది మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి  గతంలో ఇలాంటివి చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా చేశారా ?
పగటిపూటే రైతన్నలకు 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది మన ప్రభుత్వం మాత్రమే. గతంలో పగలూ, రాత్రి రెండు సమయాల్లో కలిపినా కూడా కనీసం 7 గంటలు కూడా  చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదన్నది, 
 వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం ఎందుకు పెంచలేదన్నది రైతులంతా ఆలోచన చేయాలి. గతంలో రైతన్నలకు పగటిపూటే 9  గంటల విద్యుత్‌ ఇవ్వాలంటే ఫీడర్ల సామర్ధ్యం సరిపోని పరిస్థితి. ఆ ఫీడర్ల సామర్ధ్యం పెంచేందుకు రూ. 1700 కోట్లు అవసరం అని అంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే చేశాం.

రూపాయి కట్టకుండా రైతుకు పంటల బీమా
పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తూ, రైతన్నకు తోడుగా నిలబడుతున్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. ఈ 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదు. కానీ అదే చంద్రబాబు హయాంలో వరుసగా 5 సంవత్సరాలు కరువే కరువు. 
అయినా రైతుల తరఫున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నకు తోడుగా ఉండాలని, ప్రతి రైతుకూ బీమా అందాలనే ఆలోచన చేయలేదు. 

మీ బిడ్డ హయాంలో ఎందుకు జరిగింది. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు ఎందుకు చేయలేదో ఆలోచన చేయండి. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కరువే. గతంలో 30.84 లక్షల మంది రైతులే రూ.1250 కోట్లు ప్రీమియం కడితే... వారికి  బీమా సొమ్ము కింద ఇచ్చింది రూ.3411 కోట్లు. 

మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ సంవత్సరం దేవుడి దయతో కరువు రాలేదు.నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. చంద్రబాబు ఐదేళ్లూ కరువే. కరువున్నా కూడా కూడా రైతుల దగ్గర నుంచి రూ.1250 కోట్లు లాగేసుకుని కేవలం 30 లక్షల మంది రైతులకు ఇచ్చించి కేవలం రూ.3411 కోట్లు మాత్రమే.   మీ బిడ్డ హయాంలో నాలుగేళ్ల పరిపాలనలో కరువు లేకపోయినా,  పుష్కలంగా వర్షాలు పడినా ఇన్సూరెన్స్‌ సొమ్ము కింద ఇచ్చింది రూ.7,802 కోట్లు. 

కరువు రావటం రాకపోవటం మన చేతుల్లో లేకపోయినా, కరువు వస్తే ఆదుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఇది ఒక మనసున్న ప్రభుత్వానికి మనసు లేని ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో గమనించాలి. 
గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇవాళ ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. ఈ క్రాప్‌ ద్వారా ప్రతి ఎకరానూ నమోదు చేస్తున్నాం. పంట పండించే ప్రతి రైతన్నకూ పారదర్శకంగా ప్రతి అడుగులోనూ ఆ రైతన్నను చేయిపట్టి నడిపిస్తూ మంచి చేస్తున్నాం. 


సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ
గతంలో లేని విధంగా.... ఏ సీజన్‌ లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగియకమునుపే పంట నష్టపరిహారం ఇస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే.  మన ప్రాంతానికి కష్టాలు కొత్తవి కాదు. ఎప్పుడూ దుర్భిక్ష పరిస్థితుల్లోనే మన ప్రాంతముంటుంది.  కానీ గతంలో ఎప్పుడైనా ఇన్‌ పుట్‌ సబ్సిడీ సమయానికి ఇచ్చారా? ఇవ్వాల్సిన అందరికీ ఇచ్చారా? ఆలోచన చేయండి.
మీ బిడ్డ హయాంలో సమయానికే అందరికీ జరుగుతున్నప్పుడు .. గతంలో ఎగ్గొట్టిన ఆ పాలకులు ఎందుకు చేయలేకపోయారో ఆలోచన చేయండి ? 

గతంలో బాబు ఐదేళ్ల పాలనలో 17,94,000 మంది రైతన్నల వద్ద రూ.40,200 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తే.... మన పాలనలో మొదటి నాలుగేళ్లలోనే దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ... ఇ–క్రాప్‌ తెచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి రూ.60 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేయగలిగాం. 

ఇతర పంటల కొనుగోలు కోసం కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా.. మనం మన ఆర్బీకేల్లో లిస్టు మొత్తం పెట్టి... ఆ రేటు కన్నా తక్కువకు పోతే ప్రభుత్వం అడుగు ముందుకు వేసి చేయి పట్టుకొని నడిపించింది. ఇందుకోసం రూ. 8 వేల కోట్లు వెచ్చించి ఇతర పంటల కొనుగోలు చేసిన పరిస్థితులు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుంది.

సున్నా వడ్డీకి నిజమైన అర్థం చెబుతూ పంట రుణాలు తీసుకుని.. సరైన సమయంలో కడితే ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా మొట్ట మొదటి సారి రైతన్నకు వచ్చింది కేవలం మీ బిడ్డ హయాంలోనే. 

14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదే సున్నా వడ్డీని నీరుగార్చిన పరిస్థితిలు ఎందుకు వచ్చాయో ఆలోచన చేయండి. 

సాగుతో పాటు పాడిలోనూ సాయం- అమూల్‌
వ్యవసాయం ఒక్కటే చేస్తే రైతన్నకు సరైన ధరలు రావు. రైతన్న బాగు కోసం ఇంకా ఎక్కువ చేయాలి. పాడిలో కూడా డబ్బులొచ్చేలా మన ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇవాళ  పాడి రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ.. చంద్రబాబు హెరిటేజ్‌ కు బాబు మిత్ర బృందాలు నడుపుతున్న  డెయిరీలకు లాభాలు పెరిగిన రోజులు గతంలోచూస్తే....ఈ  రోజు ఆ దుర్మార్గాలన్నీ తుదిముట్టిస్తూ..  సహకార రంగంలో విప్లవాన్ని సృష్టించాం. అమూల్‌ని ఆంధ్రప్రదేశ్‌లో రంగప్రవేశం చేయించి... పాడి రైతులకు పాల వెల్లువ ద్వారా ప్రతి లీటరుకు రూ. 10 నుంచిరూ. 22 రూపాయలు అదనపు ఆదాయం వచ్చేలా చేశాం. 

మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా  ఉన్న చంద్రబాబు హయాంలో పాడి రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు అడుగులు వేయాలన్న ఆలోచన చేయలేదో ఆలోచన చేయండి. 

100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే
ఇవాళ మనందరం రైతులం. మన భూములన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న భూములకు రికార్డులు అప్‌ డేట్‌ కాక మనందరి ప్రభుత్వం రాక ముందు వరకు గ్రామాల్లో విపరీతమైన సమస్యలు కనిపిస్తున్నా ఏరోజూ పట్టించుకోలేదు. 
ఇవాళ 100 సంవత్సరాల తర్వాత మళ్లీ మన గ్రామాల్లో ప్రతి ఎకరానూ సమగ్ర భూ సర్వే చేసి, రికార్డులు పూర్తిగా అప్‌ డేట్‌ చేసి భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ రైతన్నకు మంచి జరిగిస్తున్నది మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే  జరుగుతోంది. 
ఏకంగా 19.31 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్‌ భూములకు హక్కులున్న వారికి హక్కులు కల్పిస్తున్నాం.  22ఏలో ఇరుక్కున్న  చుక్కల భూములకు మేలు జరిగించే కార్యక్రమం కానీ... 22 ఏలో ఇరుక్కుని భూములు మీద హక్కులు కోల్పోతున్న షరతులు గల పట్టాల భూములు కానీ, సర్వీస్‌ ఈనాం పట్టాలు ఉన్న కులవృత్తుల రైతులు కానీ.. వీరందరికీ ఏకంగా 34.89 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులతో రైతులకు, భూ యజమానుల చేతుల్లో పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 

ఇన్ని లక్షల మంది రైతులు, లక్షల ఎకరాలు వాళ్ల భూములపై హక్కులు లేని పరిస్థితిలో అవస్థలు పడుతుంటే 14 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి వీళ్లను ఆదుకోవాలనే ఆలోచన ఎందుకు చేయలేదు?.

ఆహార ధాన్యాల దిగుబడిలోనూ..
గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా 154 లక్షల టన్నులయితే... మనందరి ప్రభుత్వంలో మనం తీసుకున్న చర్యలు, దేవుడి దయ, రైతు కష్టం వలన ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగింది. మరి  బాబు వస్తే ఆహార ధాన్యాలు దిగుబడి ఎందుకు తగ్గింది, మన హయాంలో ఎందుకు పెరిగింది? ప్రతి రైతు ఆలోచన చేయాలి.

చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కూడా కరువే చూశాం.  కరువున్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి.  రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు చంద్రబాబు ఏం చేశాడు?  
చంద్రబాబు అధికారంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు.  బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాడు. 
అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు చేసిన పని రైతులను మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. 
చివరకు రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు...అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చి... కేవలం  ముస్టి వేసినట్లు ఐదేళ్ల కాలంలో రూ.15 వేల కోట్లు విదిల్చిన పరిస్థితులు గతంలో చంద్రబాబు హయాంలో చూశాం.

నాలుగేళ్లలో కరవనేదే లేదు.
ఈరోజు మీ బిడ్డ హయాంలో నాలుగు సంవత్సరాల కాలం 53 నెలల పాలనలో ఎక్కడా కరువు మండలంగా డిక్లేర్‌ చేయాల్సిన పరిస్థితి రాలేదు. దేవుడి దయతో వర్షాలు పడ్డాయి. 
కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్నిమండలాల్లో వర్షా భావంతో రైతన్నలకు కాస్త ఇబ్బందులు కలిగాయి. ఈ 53 నెలల్లో ప్రతి రైతన్నకూ తోడుగా నిలబడుతూ వైయస్సార్‌ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 33,210 కోట్లు నేరుగా రైతన్నలకు ఇచ్చాం. వ్యవసాయ రుణాల కింద వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ. 1834 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.7802 కోట్లు, ఇన్‌ పుట్‌ సబ్సిడీ కింద రైతులను ఆదుకుంటూ ఇచ్చిన సొమ్ము రూ.  1976 కోట్లు, విత్తన సబ్సిడీ కింద రూ. 1286 కోట్లు,  వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం రూ. 45 వేల కోట్లు ఇచ్చాం.  ఆక్వా జోన్లలో రూ. 1.50కే యూనిట్‌ ఇస్తున్న ప్రభుత్వం మనది మాత్రమే. 

ఇలా 53 నెలల కాలంలోనే ఒక్క రైతన్నకు మేలు చేసేందుకు రైతు కుటుంబాలకు మంచి జరిగేందుకు రైతన్నకు తోడుగా ఉండేదుకు రూ.1.75 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 3 సార్లు కుర్చీలో కూర్చున్న చంద్రబాబు.. 62 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం మీద ఇలాంటి ఏ ఒక్క ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయలేదో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఇలాంటి మద్ధతు మీ బిడ్డ మాత్రమే ఎందుకు చేయగలిగాడో ఆలోచించండి. 

బాబుకు అధికారం ఎందుకంటే ?
ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి.  చంద్రబాబుకు అధికారం ఎందుకు కావాలన్నది ఆలోచన చేయాలి. 
బాబుకు అధికారం... ప్రజలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు. నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు.  చంద్రబాబుకు అధికారం కావాల్సింది కేవలం తాను, తనతోపాటు ఒక గజదొంగల ముఠా కోసం మాత్రమే. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. 
ఇదీ చంద్రబాబు గజదొంగల ముఠా. 
ఈ గజదొంగల ముఠాకు అధికారం కావాల్సింది రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకొనేందుకు కావాలి. 

బాబు జమానా నో స్కీం ఓన్లీ స్కామ్‌. 
వాళ్ల హయాంలో చంద్రబాబు గురించి చెప్పాల్సి వస్తే, చంద్రబాబు పేరు చెబితే కనీసం.. ఒక్కటంటే ఒక్క మంచి స్కీమయినా చంద్రబాబు చేశాడని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకి గుర్తుకొస్తుందా? కారణం బాబు హయాంలో పేదవాడి గురించి, అవ్వాతతాల గురించి ఆలోచన చేయలేదు. 

చంద్రబాబు హయాంలో స్కీముల గురించి కాదు.. కేవలం స్కాముల గురించి ఆలోచన మాత్రమే చంద్రబాబు హయాంలో జరిగింది.  స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ఒకస్కామ్, ఫైబర్‌ గ్రిడ్, మద్యం, ఇసుక ఇంకో స్కామ్‌. రాజధాని భూములు ఇంకో స్కాము. ఏది ముట్టుకున్నా స్కాములే తప్ప చంద్రబాబు హయాంలో స్కీములు గుర్తుకురావు. 

ఆలోచన చేయండి...అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ముఖ్యమంత్రిమాత్రమే. అప్పుల గ్రోత్‌ రేటు కూడా అప్పటి కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో ఇప్పుడు తక్కువే. 
మరి అలాంటప్పుడు... మీ బిడ్డ హయాంలో బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా ఇప్పటికే 53 నెలల కాలంలోనే రూ. 2.40 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యాయి. 

మరి చంద్రబాబు హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి పోయాయో ఆలోచన చేయాలని కోరుతున్నా. నేను చెబుతున్న  ఇవన్నీ కూడా నిజాలు. ప్రతి మనిషీ ఆలోచన చేయదగ్గ నిజాలు.
మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్‌ స్కూళ్లు ఎందుకు మారుతున్నాయి? ఇంగ్లీషు మీడియం ఎందుకు వచ్చింది? 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన కోసం ఐఎఫ్‌పీలు ఎందుకు పెడుతున్నాడు? 8వ తరగతిలో ట్యాబులు ఎందుకు పెట్టగలుగుతున్నాం. పిల్లలు చదువుతున్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీషులో మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తోంది ? మీ బిడ్డ హయాంలో పిల్లల చదువుల రూపురేఖలు ఎందుకు మారుతున్నాయి  ?
చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఎందుకు మన పిల్లల చదువులు, బడులు రూపురేఖలు ఎందుకు మారలేదో ఆలోచన చేయాలి. 

గ్రామాల్లో తోడుగా వాలంటీర్ సైన్యం.
ఇవాళ ఏ పేదవాడికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్‌మార్నింగ్‌ చెబుతూ... గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ అదే గ్రామంలో జల్లెడ పడుతూ వాలంటీర్లు ప్రతి ఇంటికీ వచ్చి అక్కా మీ ఇంట్లో ఎవరికి బాగాలేదు ? ఎవరికి బాగాలేకపోయిన ఉచితంగా వైద్యం చేయించేందుకు, మందులిచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా అని చెప్పే సైన్యం గ్రామాల్లో ఉంది.

ఆరోగ్య శ్రీ మరింత  మెరుగ్గా...
గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా హాస్పటళ్లకు పోతే అక్కడ పక్కన పెట్టే పరిస్థితి నుంచి నేడు 3,250 ప్రొసీజర్లకు పెంచి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు కూడా లేని పరిస్థితి.

ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని...1600 పైచిలుకు 104, 108 వాహనాలు కొనుగోలు చేసి కేవలం.. 108కు ఫోన్‌ చేసినా, 104కు ఫోన్‌ చేసినా గ్రామాల్లోనే ఇంటికి వచ్చి జల్లెడ పట్టి చేయి పట్టుకొని నడిపిస్తూ, ఏ పేదవాడు వైద్యానికి అప్పులపాలు పాలయ్యే పరిస్థితి రాక కాకుండా తపిస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ హయాంలోనే జరుగుతోంది. 

వ్యవసాయం తీసుకున్నా, చదువులు, ఆరోగ్య రంగం తీసుకున్నా ఎక్కడైనా కనీ వినీ ఎరుగని మార్పులు కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత తీసుకున్నా.. దిశ యాప్‌ 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ కనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆ అక్కచెల్లెమ్మలు  ఫోన్‌ షేక్‌ చేస్తే 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి మీకు అండగా తోడుగా నిలిచిన గొప్ప వ్యవస్థ.  గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు గతంలోఎప్పుడూ చూడని విధంగా, వినని విధంగా చేయిపట్టుకుని నడిపించే మంచి అన్న, తమ్ముడు  ఇవాళ ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నాడు. 

నా అక్కచెల్లెమ్మలు ఎలా ఉన్నారు ? వారి పిల్లలు ఎలా ఉన్నారు ? వారికి ఎలా మంచి చేయాలన్న ఆలోచనతో వారి కోసం ఒక సున్నావడ్డీ కార్యక్రమం, ఒక చేయూత కార్యక్రమం, అవ్వాతాతల మంచి కోసం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 ఇస్తున్న  పెన్షన్‌ పెంచుకుంటూ... అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల మొహాల్లో చిరునవ్వులు చూడాలని ఏకంగా రూ.3000 వరకు పెంటుకుంటూ పోతుంది మీ బిడ్డ ప్రభుత్వం .

ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? మీ బిడ్డ హయాంలో ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయాలి. ఈ ఆలోచనలకు పదును పెట్టాలి. 

నేను ఒక్కటే చెబుతున్నా...
మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం చేతకాదు. ఈనాడు పత్రిక సపోర్టు ఉండదు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దగ్గరకు పోయి సపోర్ట్‌ చేయాలని అడగడు, దత్తపుత్రుడి వద్దకు వెళ్లి నాకు తోడుగా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పడు. కారణం మీ బిడ్డ వీళ్లని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. 


అబద్దాలు, మోసాలు నమ్మకండి
అబద్ధాలు నమ్మకండి, మోసాలు నమ్మకండి. రాబోయే రోజుల్లో అబద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారి సైన్యం వస్తుంది. మోసం ఇంకా చేసేందుకు పెద్ద పెద్ద మాటలు చెబుతుంది. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారిస్తామని చెబుతారు. 

వీళ్ల చరిత్ర- అబద్దాలు, మోసం మాత్రమే.
ఆలోచన చేయండి. ఈ వ్యక్తుల చరిత్ర గురించి ఆలోచన చేయండి.  మోసాలు, అబద్ధాలు నమ్మకండి.  మీకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. 

కారణం గెలవడానికి ఒక ఈనాడు సపోర్ట్‌ అవసరం లేదు. ఆంధ్రజ్యోతి సపోర్ట్, టీవీ5 సపోర్ట్, దత్తపుత్రుడి సపోర్ట్‌ అవసరం లేదు. 
గెలవడానికి కావాల్సింది పైన దేవుడి దయ, కింద మంచి చేసిన ఆ ప్రజల ఆశీస్సులు కావాలి. మధ్యలో ఇంకొకడెవడూ అవసరం లేదు. ఇదే మీ బిడ్డ నమ్ముకున్న ఫిలాసఫీ.

గతంలో ఎప్పుడూ జరగని విధంగా 31 లక్షల ఇంటిస్థలాలు ఇచ్చి అందులో నా అక్కచెల్లెమ్మల పేరుతో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. 
ఒక్కో ఇల్లు పూర్తి అయితే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోనూ రూ. 5– రూ.15 లక్షల ఆస్తి పెట్టినట్లవుతుంది. ఒక్క ఇళ్ల వలనే రాష్ట్రంలో రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. ప్రతి ఇంటికి చేసిన ఇలాంటి మంచినే మీ బిడ్డ నమ్ముకున్నాడు. మీ అందరితో నేను కోరేది ఒక్కటే. ఆలోచన చేయండి. మీ బిడ్డ చెబుతున్న ప్రతి విషయం ఆలోచన చేయాలని కోరుతున్నా.

మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాను. 

కాసేపటి క్రితం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ మాట్లాడుతూ... దాదాపు 31 రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చాడు. రూ.35 కోట్లు ఖర్చవుతుంది. అవి కావాలన్నాడు. ఈ 31 రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలకు రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నాను. మంచి జరగాలని మనసారా మరొక్కసారి కోరుకుంటూ .. దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Back to Top