అన్నదాతకిచ్చిన హామీలు వందశాతం నెరవేర్చాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

29 నెలల పాలనలో రైతుకు ప్రతి అడుగులో అండగా నిలిచాం

‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ మూడో ఏడాది రెండో దఫా సాయం విడుదల

50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లు జమ

వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద 6.67 లక్షల మంది రైతులకు రూ.112.70 కోట్ల లబ్ధి

వైయస్‌ఆర్‌ యంత్రసేవ పథకం కింద 1720 గ్రూప్‌లకు రూ.25.55 కోట్లు

మూడు పథకాల కింద రూ.2,190 కోట్లు విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌

రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.18,777 కోట్ల సాయమందించాం

ఆర్బీకేల్లో రూ.2,134 కోట్లతో యంత్రసేవ కేంద్రాల ఏర్పాటు

రైతు ఆత్మహత్యల పరిశీలన పోయి.. ఆర్బీకేల సందర్శనకు వస్తున్న బృందాలు

తాడేపల్లి: కరోనా మహమ్మారి సవాల్‌ విసిరిన సమయంలోనూ రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తూ.. 29 నెలల పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. కాబట్టే ఒకప్పుడు రైతన్న ఆత్మహత్యలు చూడటానికి రాష్ట్రానికి బృందాలు వస్తే.. ఈ రోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి బృందాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

రైతు పక్షపాత ప్రభుత్వంగా ఒకేసారి వరుసగా మూడో ఏడాది, రెండో దఫా వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయంతో పాటు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ యంత్ర సేవ పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను రైతులు, రైతు గ్రూపు ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నిధుల విడుదల చేశారు. రైతుల కళ్లలో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని నిధులు విడుదల చేస్తున్నామని సీఎం అన్నారు. అంతకు ముందు రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి  సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 
‘‘దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా దాదాపు 50 లక్షల పైచిలుకు రైతు కుటుంబాలకు ఈ రోజు వరుసగా మూడో సంవత్సరం రెండో విడత రూ.2,052 కోట్లు జమ చేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా రెండో విడతగా ఆగస్టులో విడుదల చేసిన రూ.977 కోట్లు కలుపుకొని.. ఇప్పుడు అందిస్తున్న సాయంతో అక్షరాల రైతు భరోసాకు రూ.2,052 కోట్లు అందిస్తున్నాం. ఇప్పటి వరకు రెండున్నరేళ్ల కాలంలో కేవలం రైతు భరోసా పథకానికి మాత్రమే రూ.18,777 కోట్లు ఇవ్వగలిగామని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 

దేశంలో ఎక్కడా లేని విధంగా, జరగని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు.. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సైతం వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రూ.13,500 సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. అంతేకాకుండా వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం కింద.. 6.67 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.112.70 కోట్ల సున్నావడ్డీ రాయితీని కూడా ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా లక్ష రూపాయలలోపు పంట రుణం తీసుకొని సకాలంలో (ఏడాదిలోపే) తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద.. వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం దేవుడి దయతో అధికారం చేపట్టిన నాటి నుంచి వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం కింద అక్షరాల రూ.1674 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపుగా రూ.382 కోట్లు వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద చెల్లించడం జరిగింది. ఇప్పుడందిస్తున్న వడ్డీ రాయితీ రూ.112 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వెయ్యి చిల్లర కోట్లు గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టిన రూ.1,180 కోట్లు రైతుల కోసం మనమే చిరునవ్వుతో కట్టామని మీ బిడ్డలా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 

రైతులకు మరింత సులభంగా పంట రుణాలు అందించేందుకు వీలుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఇందులో ఇప్పటికే 9,160 మంది బ్యాకింగ్‌ కరస్పాండెంట్లను కూడా ఆర్బీకేల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. మిగిలిన ఆర్బీకేల్లో కూడా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి.. అతి త్వరలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. కౌలు రైతులతో సహా.. రైతులందరికీ బ్యాంకు లావాదేవీలు అన్నీ జరుపుకునేందుకు, రైతుల పంట రుణాలు అందుకునేందుకు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు ఆర్బీకేల్లో చాలా ఉపయోగపడతాయి. ఇది జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీతో పాటు వైయస్‌ఆర్‌ యంత్రసేవ పథకం కింద 1720 రైతు గ్రూపులు (కమ్యూనిటీ  హైరింగ్‌ సెంటర్లు)లకు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని కూడా ఈ రోజే వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. రైతులకు సరసమైన అద్దెకే, రైతులే నిర్దేశించిన అద్దెకే యంత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 గ్రామస్థాయిలో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

వరి ఎక్కువగా సాగు అయ్యే గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1,035 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్థాయిలో కూడా సీహెచ్‌సీల ద్వారా యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. 

29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తీసుకువచ్చాం అనేది ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి దయతో వాతావరణం అనుకూలించి.. కరువు సీమ సైతం.. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న పరిస్థితులు చూశాం. ఇంతకు ముందు కరువు కాటకాలు తెలిసిన రైతులకు.. ఈసారి కరోనా సవాల్‌ విసిరినా కూడా ఈ సమయంలో రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వం ఇదని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను కూడా చెల్లించుకుంటూ వస్తున్నాం. వ్యవస్థలను ఎక్కడికక్కడ సరిదిద్దుకుంటూ.. రైతు నష్టపోకూడదని మార్కెటింగ్‌ మీద విపరీతమైన దృష్టిపెట్టాం. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ తీసుకువచ్చాం. పొగాకు సైతం కనీస గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతుంటే.. కొనుగోలులో జోక్యం చేసుకొని రైతుకు బాసటగా నిలిచాం. 

ఏ దేశంలోనైనా రైతు తాను పండించడానికి కావాల్సిన అన్నింటినీ ఎక్కువ ఖరీదు పెట్టి రిటేల్‌గా కొనుగోలు చేసి.. పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉంటుందని సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్‌ జే.ఎస్‌.కెనడీ అప్పట్లో చెప్పిన  మాటలు గుర్తుచేసుకుంటే... మన రాష్ట్రంలో మనం అధికారంలోకి రాకముందు ఇంచుమించు ఇలాగే ఉన్న పరిస్థితులను మార్చుతూ మన గ్రామంలోనే మన కళ్ల ఎదుటనే రైతు భరోసా కేంద్రాలను వన్‌స్టాప్‌ సెంటర్లుగా ఏర్పాటు చేశాం. నాణ్యతతో కూడిన విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్‌ అందిస్తున్నాం. రైతులకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ.. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్నింటిలో రైతులను చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప వ్యవస్థను తీసుకువచ్చాం. 

వ్యవసాయ సలహామండళ్లు.. ఏర్పాటు చేయడమే కాకుండా.. ఆర్బీకే, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి.. ఇలా నాలుగు అంచలుగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో, రెండవ శుక్రవారం మండల స్థాయిలో, ప్రతి నెల మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మీటింగ్‌ జరిగేట్టుగా నిర్దేశించాం. రైతులు ఏ పంట వేయాలి.. రైతులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందాలి.. ఆర్బీకేల్లో పరిస్థితులను ఎలా మెరుగుపర్చాలని రియల్‌ టైమ్‌ సలహాలు, సూచనలతో మార్పులు చేర్పులు చేసుకుంటూ అడుగులు ముందుకేస్తున్న గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 

ఈక్రాపింగ్‌ అనేది ప్రతి పంటకు ఆర్బీకేల్లో నమోదు చేసుకోవడంతో పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల కొనుగోలు, సున్నావడ్డీ అన్నీ కూడా పారదర్శకంగా సోషల్‌ ఆడిట్‌ చేసి.. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఈక్రాపింగ్‌ ద్వారా ప్రతి పథకాన్ని అనుసంధానం చేసే గొప్ప మార్పు గ్రామస్థాయిలో జరుగుతుందని అందరూ గమనించాలి. 

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటు ముమ్మరంగా జరుగుతుంది. వ్యవసాయ యంత్రీకరణ మొత్తం గ్రామస్థాయిలోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఖరీదైన పరికరాలను మండలస్థాయిలోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాం. యంత్రీకరణ ద్వారా వ్యవసాయం మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నాం. ప్రతి గ్రామంలోని ఆర్బీకేలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్, పశుసంవర్థక అసిస్టెంట్లు, కొన్ని చోట్ల ఆక్వా అసిస్టెంట్లు అందుబాటులో ఉండి ప్రతి సేవను అందించే కార్యక్రమం జరుగుతుంది. సహకార వ్యవస్థలో ప్రైమరీ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ నుంచి అన్నింటినీ పూర్తిగా ఆధునీకరిస్తున్నాం. అన్నింటిలో కంప్యూటరీకరణ చేపట్టడం జరుగుతుంది. సహకార వ్యవస్థలో హెచ్‌ఆర్‌ విధానం తీసుకువచ్చాం. విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. 

ఆర్బీకే స్థాయిలో సీఎం యాప్‌ (కంటిన్యూయస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌) అందుబాటులోకి తీసుకువచ్చాం. దాని ద్వారా వ్యవసాయ ధరలు ఆర్బీకే పరిధిలో పడిపోతే.. రైతు ఇబ్బంది పడకుండా ఆర్బీకేలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు వెంటనే అలర్ట్‌ అయ్యి.. జాయింట్‌ కలెక్టర్లకు, అగ్రికల్చర్‌లోని మార్కెటింగ్‌ శాఖకు సందేశాన్ని పంపిస్తారు. వెంటనే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతన్నలను ఆదుకునేలా ఆర్బీకేలో బలోపేతం చేయడం జరిగింది. 

ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు ఎంఎస్‌పీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. మరో 7 పంటలకు కనీస గిట్టుబాటు ధర రైతులకు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్బీకేల్లో పోస్టర్లు పెట్టి.. రేటు పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చాం. 

కొత్తగా వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు ఇవన్నీ మంజూరు చేసుకుంటూ వస్తూ మార్కెటింగ్‌ వ్యవస్థ (ఏఎంసీ)లను ఆధునీకరించేందుకు నాడు–నేడు తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నాం. కల్తీ నివారణ మీద మన ప్రభుత్వం పెట్టినంత దృష్టి.. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఆర్బీకేల్లో నాణ్యమైన విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్‌ సప్లయ్‌ చేయడమే కాకుండా వాటికే ప్రభుత్వమే గ్యారంటీ కల్పించడమే కాకుండా.. ప్రైవేట్‌ రంగంలో ఎక్కడా కల్తీతో సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించకుండా ఎస్పీలు, కలెక్టర్లు ముమ్మరంగా తనిఖీలు చేసేలా ఆదేశాలిచ్చాం. రైతుకు నష్టం జరగకూడదని తపన పడుతున్న ప్రభుత్వం మనది. 

రాష్ట్రంలోని దాదాపు 18.07 లక్షల మంది రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెండు సంవత్సరాల్లో రూ.18,000 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. ఇవేకాకుండా.. గత ప్రభుత్వం వదిలేసినపోయిన రూ.10,000 కోట్ల విద్యుత్‌ బకాయిలను చిరునవ్వుతో మన ప్రభుత్వం కట్టింది. నాణ్యమైన కరెంటు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫీడర్ల మార్పునకు రూ.1700 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేశాం. 29 నెలల కాలంలో వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 31.07 లక్షల మంది రూ.3716 కోట్లు అందించగలిగాం. రూ.2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి అందుబాటులో ఉంది. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అందుబాటులో ఉంది. ఇవికాకుండా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా ధాన్యం సేకరణ కోసం రెండు సంవత్సరాల్లో రూ.36,000 కోట్ల పైచిలుకు ఖర్చు చేశాం. మరో రూ.1800 కోట్లను పత్తి పంట కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోలు కోసం రూ.6434 కోట్లు రెండున్నర సంవత్సరాల్లో ఖర్చు చేశామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. 

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను సైతం రైతుల కోసం మన ప్రభుత్వం చిరునవ్వుతో తీర్చింది. గత ప్రభుత్వం వదిలేసిన రూ.384 కోట్ల విత్తన బకాయిలను సైతం.. రూ.10,000 కోట్ల కరెంట్‌ బకాయిలను సైతం మన ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది. ఇవే కాకుండా పంట నష్టపోయిన రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీని రూ.1055 కోట్లు చెల్లించాం. ఎప్పుడూ జరగని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగా ఆ పంట నష్ట పరిహారం చెల్లించే కొత్త ఒరవడిని తీసుకువచ్చాం. 

రైతన్నకు దన్నుగా నిలిచేందుకు ఏపీ అమూల్‌ పాల వెల్లువ తీసుకువచ్చాం. వైయస్‌ఆర్‌ జలకళ ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు వేయించి తోడుగా నిలిచాం. ఆక్వా రైతులకు కరెంట్‌ సబ్సిడీ కింద సంవత్సరానికి రూ.780 కోట్ల చొప్పున రూ.1.50కే కరెంట్‌ సబ్సిడీ అందుబాటులోకి తీసుకువచ్చి.. రెండు సంవత్సరాల్లో రూ.1560 కోట్లు ఆక్వా రైతులకు సబ్సిడీ రూపంలో తోడుగా నిలిచాం. 

కాబట్టే ఒకప్పుడు మన రైతన్న ఆత్మహత్యలు చూడటానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే.. ఈ రోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి.. కేంద్రాల నుంచి బృందాలు వచ్చి తిలకిస్తున్నాయని సగర్వంగా తెలియజేస్తున్నాను. దేవుడి దయతో ఇక మీదట కూడా సకాలంలో వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, వ్యవసాయం పండగలా కొనసాగాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు కనిపించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి చల్లని దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా మన ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటున్నాను’’. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top