తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్, మంత్రులు పాల్గొన్నారు. సంక్షేమం దిశగా సీఎం వైయస్ జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం వైయస్ జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. అనంతరం పలువురు అర్చకులను సీఎం వైయస్ జగన్ సన్మానించారు. తెలుగు ప్రజలందరికీ సీఎం వైయస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలి. పంటలు బాగా పండాలి. రైతులకు మేలు కలగాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి. పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలి. మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. తెలుగు వారికి.. మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలి. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాల’’ని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.