న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ప్రారంభమైన వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరయ్యారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఏపీ, ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లలో చేపట్టాల్సిన జాయింట్ ఆపరేషన్‌లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టనున్నారు. రోడ్ల నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బ్యాంకులు, టెలిఫోన్ టవర్లు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. నక్సల్ అణిచివేత కోసం కోసం పోలీసు బలగాల ఆధునీకరణ, మెరుగైన మౌలిక వసతులు, రిజర్వ్ బెటాలియన్ ఏర్పాటు, హెలికాప్టర్లు, యూఏవీలు తదితర అంశాలను చర్చించనున్నారు.