రాష్ట్రానికే.. స్ఫూర్తిదాయకం వేల్పుల సచివాలయ కాంప్లెక్స్..!!

భవన సముదాయానికి ప్రారభోత్సవం చేసిన  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి

జాతిపిత, మహానేతల విగ్రహాల ఆవిష్కరణ

వైయ‌స్ఆర్ జిల్లా : వేల్పుల గ్రామంలో ఆధునాథన హంగులతో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయ భవన సముదాయం రాష్ట్రానికే.. స్ఫూర్తిదాయకంగా  నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంశించారు.

సుమారు రూ.3.22 కోట్లు పైగా వెచ్చించి పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఎన్. ఆర్.ఈ. జి.ఎస్. మొదలైన ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్మించిన వేల్పుల గ్రామ సచివాలయ భవనాల సముదాయాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 

ఈ సందర్బంగా  ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కడప-పులివెందుల ప్రధాన మార్గం పక్కనే.. ఒక ఎకరా సువిశాలమైన స్థలంలో.. ఆహ్లాదకరమైన వాతావరణంతో.. జిల్లాకే కాకుండా.. రాష్ట్రానికే ఆదర్శనీయంగా సచివాలయ భవన సముదాయాన్ని అత్యంత అధునాతన హంగులతో తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు. ఆధునాథన సౌకర్యాలు, వసతులతో.. రూపుదిద్దుకున్న వేల్పుల సచివాలయ భవన సముదాయం చూపరులను మరింత ఆకట్టుకుంటోందని.. ఈ విషయంలో స్థానిక నాయకులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఈ భవనాల నిర్మాణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. 

కార్యక్రమంలో ముందుగా.. సచివాలయ ఆవరణలో మొత్తం రూ.3.22 కోట్ల వ్యయంతో నిర్మించిన వేర్వేరు భవనాలకు సంబందించిన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అందులో.. రూ.40 లక్షలతో నిర్మితమైన గ్రామ సచివాలయ భవనం, రూ.21.80 లక్షలతో నిర్మితమైన రైతు భరోసా కేంద్రం, రూ.16 లక్షలతో నిర్మితమైన డిజిటల్ లైబ్రరీ, రూ.19.50 లక్షల తో నిర్మితమైన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రూ.40 లక్షలతో నిర్మితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం, రూ.17 లక్షలతో నిర్మితమైన పోస్ట్ ఆఫీస్, రూ.8 లక్షలతో నిర్మితమైన బస్ షెల్టర్, రూ.13 లక్షలతో నిర్మితమైన సీసీ పవర్స్, రూ.13 లక్షలతో నిర్మించిన వెయిటింగ్ హాలు, ఓపెన్ స్టేజి, రూ.16.50 లక్షలతో నిర్మితమైన ఓవర్ హెడ్ ట్యాంకు,  రూ.3 లక్షల వ్యయంలో నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్స్ భవనాలకు, తదితరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..  ప్రారంభించారు. 

కార్యాలయ భవనాలతో పాటు.. సచివాలయ ఆవరణలోనే అత్యంత నాణ్యతతో.. జీవకళ ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి నివాళులర్పించారు.

అనంతరం ఒక్కొక్క కార్యాలయ భవనంలో ఫర్నీచర్ అమరికలు, సదుపాయాలను భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కో ఛాంబర్ వద్ద సంబందిత సిబ్బందితో ఫోటోలు దిగారు. అంతేకాకుండా.. స్థానిక నాయకులు, ప్రజలను ఒక్కొక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రోడ్డు మార్గం ద్వారా.. ఇడుపులపాయ ఎస్టేట్ కు రాత్రి 7 గంటలకు బయలుదేరి, 7.40 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, వేముల జెడ్పిటిసీ బయపురెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్ పర్సన్ ఉషారాణి, సర్పంచ్ నిర్మల,  స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top