నేడు శ్రీనివాస సేతు ప్రారంభం

ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌

అనంతరం తిరుమలలో శ్రీవారికి పట్టు వ్రస్తాల సమర్పణ  

రేపు నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభ 

అమరావతి: సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమల వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో నిర్మిం చిన శ్రీనివాస సేతు (ఫ్లైఓవర్‌) ప్రారంబోత్సవం, ఎస్‌వీ ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ వర్చువల్‌ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ (తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలోని వడమాలపేట వద్ద 307 ఎకరాల్లో 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్‌ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు.

ఆ తర్వాత తిరుమల చేరుకుని వకుళమాత రెస్ట్‌ హౌస్, రచన రెస్ట్‌ హౌస్‌లు ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని, రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు.   

నీటి పథకాలకు ప్రారంబో త్సవం 
మంగళవారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. 

Back to Top