పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ నంబర్‌ వన్‌

పులివెందులలో అపాచీ లెదర్‌ ఇండస్ట్రీస్‌కు సీఎం శంకుస్థాపన 

రూ.70 కోట్లతో 27.94 ఎకరాల్లో పరిశ్రమ, 2 వేల మందికి ఉపాధి

శ్రీకాళహస్తిలో కూడా రూ.350 కోట్లతో పరిశ్రమ, 5 వేల మందికి ఉపాధి

అపాచీ సంస్థకు మన సహాయ, సహకారాలు అందిద్దాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పులివెందుల: ఆంధ్రరాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా, వరల్డ్‌ బ్యాంకు సంయుక్తంగా సెప్టెంబర్‌ 2020లో విడుదల చేసిన ర్యాంకింగ్‌లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. పులివెందులలో అపాచీ లెదర్‌ ఇండస్ట్రీస్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అపాచీ లెదర్‌ ఇండస్ట్రీస్‌కి 28 ఎకరాలు కేటాయించామని, దీని ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, తైవాన్‌ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. 

అపాచీ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభించిన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. ‘అపాచీ కంపెనీ అడిడాస్‌ షూ తయారు చేస్తుంది. అపాచీ ఇండస్ట్రీస్‌ మన దేశంలోనే కాకుండా వియాత్నం, చైనాలో ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చే సరికి  2006లో నాన్న (దివంగత మహానేత వైయస్‌ఆర్‌) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తడాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. 150 మిలియన్‌ యూస్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి..  అక్కడ 11 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. తడాలో విజయవంతంగా ఏటా 1.80 కోట్ల జతల షూ తయారవుతున్నాయి. 

ఇండస్ట్రీస్‌ విస్తరణలో భాగంగా పులివెందులలో 10 మిలియన్‌ డాలర్లతో కంపెనీ పెడుతున్నారు. దీని ద్వారా రూ.2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇందులో దాదాపుగా 50 శాతం మంది అక్కచెల్లెమ్మలే ఉద్యోగులుగా ఉంటారు. శ్రీకాళహస్తిలో కూడా అపాచీ లెదర్‌ ఇండస్ట్రీస్‌కి భూమి కేటాయించడం జరిగింది. రూ.350 కోట్లతో శ్రీకాళహస్తిలో కూడా ఫ్యాక్టరీ పెడుతున్నారు. దాని వల్ల 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం జరుగుతుంది. మన ప్రాంతం వారితో అపాచీ సంస్థ వారు సంతోషిస్తే.. ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టి.. ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. అందరం కలిసికట్టుగా వీళ్లను ఆహ్వానించడమే కాకుండా ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాల సహాయ సహకరాలు అందించాలి’ అని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు.
 

Back to Top