కృష్ణా: `ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకుపచ్చని తోరణంగా తీర్చిదిద్దుదాం. బాధ్యతగా మొక్కలు నాటుదాం.. వాటిని సంరక్షిద్దాం.` అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో 16 వందల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న 33 ఎకరాల లేఅవుట్‌లో`జగనన్న పచ్చతోరణం` కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. మొక్కనాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైన వారితో సీఎం వైయస్ జగన్ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం ఏం మాట్లాడారంటే.. 16 వందల పేదలకు ఇదే 33 వేల ఎకరాల లేఅవుట్‌లో ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం. ఎకరా ఎంత అవుతుందని అధికారులను అడిగితే.. రూ.3 కోట్లు అని చెప్పారు. 16 వందల మంది పేదలు వారికి కేటాయించిన స్థలాల్లో మొక్కలు నాటుతుంటే చూసేందుకు కనువిందుగా ఉంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా సుప్రీం కోర్టుకు వెళ్లి తెలుగుదేశం పార్టీ వారు ఏ రకంగా కేసులు వేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. పేదలకు భూములు ఇస్తుంటే కూడా అడ్డుకుంటుంటున్నఅన్యాయ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రం ఉందంటే.. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయో.. ఇంతకంటే నిదర్శనం లేదు. కచ్చితంగా దేవుడి ఆశీర్వదిస్తాడు. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చిన రోజున (ఆగస్టు 15) పేదలలందరికీ దేవుడు స్వతంత్ర్యం ఇస్తాడని నమ్ముతున్నా. 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశీస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద 1.40 కోట్ల ఇళ్లు ఉంటే.. మరో 30 లక్షల పట్టాలు ఇవ్వనున్నాం. దాదాపు 20 శాతం ప్రజలకు సంతృప్తస్థాయిలో ఇళ్లపట్టాలు ఇవ్వనున్నాం. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తును పరిశీలించి 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తాం. దాదాపుగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ఈ రోజు శ్రీకారం చుట్టాం. సంవత్సరకాలంలో 20 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పంచాయతీలు ఉంటే దాదాపు 17 వేల లేఅవుట్‌లు తయారవుతున్నాయి. ఈ 17 వేల లేఅవుట్లలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. అందరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలి. చెట్లు ఉంటే వర్షాలు బాగా పడతాయి. చల్లదనం ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. ప్రతిజ్ఞ `ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టు.. ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి. ప్రకృతిలోని సమతులస్థితి అవసరాన్ని గుర్తిస్తూ.. ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, ఊరూ.. వాడా.. ఇంటా.. బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.`