వ్యవసాయానికి పాడి తోడైతేనే గిట్టుబాటు

అనంతపురంలో అమూల్‌ రంగప్రవేశం అభినందనీయం

నా పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశాను.. విన్నాను

పాడి రైతన్న, అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని అమూల్‌తో ఒప్పందం

అమూల్‌ది ప్రపంచంలోనే 8వ స్థానం, దేశంలో నంబర్‌ వన్‌ సంస్థ

పాలుపోసే అక్కచెల్లెమ్మలే అమూల్‌ సంస్థ యజమానులు 

అమూల్‌ రాకతో ప్రైవేట్‌ డెయిరీలు కూడా పాల ధరలు పెంచాల్సిన పరిస్థితి

రాష్ట్రంలో 4,900 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 11,690 ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం

పాల సేకరణతో జరిగే మోసాలపై దృష్టి.. ఇప్పటికే 20 కేసులు నమోదుచేశాం

అక్కచెల్లెమ్మలు వారికాళ్ల మీద వారు నిలబడాలనే తపనతో ఇవన్నీ చేస్తున్నాం

‘అనంత’లో జగనన్న పాలవెల్లువ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘‘వ్యవసాయానికి పాడి తోడైతేనే గిట్టుబాటు ఉంటుంది. పాడి పెంపుదలకు, పాల ఉత్పత్తికి అమూల్‌ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో కూడా అమూల్‌ సంస్థ రంగప్రవేశం అభినందనీయం. ఇదొక మంచి శుభవార్త. పాడి పరిశ్రమ ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, రైతన్నకు కూడా మంచి జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఇప్పటికే పాత 6 జిల్లాల్లో అమూల్‌ అడుగుపెట్టిందని, ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ‘జగనన్న పాలవెల్లువ’ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అనంతపురం జిల్లాలో 85 గ్రామాల్లో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అమూల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌ సోధి, కైరా మిల్క్‌ యూనియన్‌ ఎండీ అమిత్‌ వ్యాస్, బనస్కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ సంగ్రామ్‌ చౌదరి, సబర్‌ మిల్క్‌ యూనియన్‌ ఎండీ అనిల్‌ బయాటీలకు సీఎం వైయస్‌ జగన్‌ కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

అమూల్‌ ప్రపంచంలోనే 8వ స్థానం, దేశంలో నంబర్‌ వన్‌ సంస్థ. అమూల్‌ యజమానులంతా పాలుపోసే అక్కచెల్లెమ్మలే. అందుకే మార్కెట్‌లో ఇతర ప్రైవేట్‌ డెయిరీలు ఇచ్చే ధర కంటే ఎక్కువ ధర ఇచ్చి పాలు కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా పాల నుంచి చాక్లెట్‌ తయారు చేసే గొప్ప స్థాయికి అమూల్‌ ఎదిగింది. మార్కెట్‌లో సాటి, పోటీ ఎవరూ లేని పరిస్థితికి అమూల్‌ ఎదిగింది. 

ఎటువంటి మోసాలు, దళారీలు లేకుండా అత్యధిక రేటు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే పరిస్థితి కాకుండా.. ప్రాసెసింగ్‌ చేయడం వల్ల వచ్చిన లాభాలను కూడా బోనస్‌ రూపంలో 6 నెలలకు ఒకసారి అక్కచెల్లెమ్మలకు తిరిగి వెనక్కు ఇస్తారు. ఇంతకంటే గొప్ప సంస్థ సహకార రంగంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. మన రాష్ట్రంలో సహకారం రంగాన్ని పూర్తిగా నీరుగార్చిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కొద్దోగొప్పో సహకార రంగాలు ఉన్నాయంటే.. అవి కూడా ప్రైవేట్‌ వ్యక్తులు హస్తగతం చేసుకొని నడిపిస్తున్న అన్యాయ పరిస్థితుల్లో రాష్ట్ర సహకార రంగం ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి.. నిజంగా సహకారం రంగం అంటే ఇలా నడుపుతారు.. పాలు పొసే అక్కచెల్లెమ్మలు లాభాలు పొందుతారని చూపించింది దేశం మొత్తంలో అమూల్‌ సంస్థ. 

ఇప్పటికే ఆరు జిల్లాల్లో అమూల్‌ ఆపరేట్‌ చేస్తుంది. ప్రకాశం, చిత్తూరు, వైయస్‌ఆర్‌ కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అమూల్‌ అడుగుపెట్టింది. పాత ఆరు జిల్లాల్లో అమూల్‌ రంగ ప్రవేశం చేసి.. అక్కడ అక్కచెల్లెమ్మలకు మంచిచేసే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. 7వ పాత జిల్లా అనంతపురంలో కూడా అమూల్‌ అడుగుపెట్టడం వల్ల అక్కచెల్లెమ్మలకు చాలా మంచి జరుగుతుంది. 

అమూల్‌ రాకముందు పరిస్థితి ఎలా ఉన్నాయో.. ఒక్కసారి గుర్తుచేసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా పాదయాత్ర జరిగేటప్పుడు ప్రతి జిల్లాలో పాలుపోసే అక్కచెల్లెమ్మలు, రైతులు నా దగ్గరకు వచ్చి ఒక కెన్లీ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ చూపించి.. ఈ లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.23.. ఒక లీటర్‌ పాల ధర రూ.23 కూడా రాకపోతే ఎలా బతుకుతామని వారి సమస్యను నాతో చెప్పుకున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం.. నిజంగానే పాలుపోసే అక్కచెల్లెమ్మలకు ఎటువంటి మోసం లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మంచి జరిగించాలని ఉద్దేశంతో అమూల్‌ సంస్థను తీసుకువచ్చాం. 

మంచి పరిణామం ఏంటంటే.. అమూల్‌ రావడం వల్ల మిగిలిన పాలసేకరణ ప్రైవేట్‌ డెయిరీలు కూడా లీటర్‌కు రూ. 5 నుంచి రూ.20 ధరలు పెంచాయి. గ‌తంలో గ్రామీణ స్థాయిలో మోసాలు. పాల క్వాలిటీ ఏంటో అక్కచెల్లెమ్మలు తెలుసుకునే అవకాశం లేదు. వారు చెప్పిందే క్వాలిటీ, వారు ఇచ్చిందే రేటు అన్న పరిస్థితులు ఉండేవి. అమూల్‌ వచ్చిన తరువాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అమూల్ రాక‌తో చివరకు ప్రైవేట్‌ డెయిరీలు కూడా అమూల్‌తో పాలసేకరణలో పోటీపడేందుకు మార్కెట్‌లో రేట్లు పెంచక తప్పనిపరిస్థితి ఏర్పడింది. ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలి.. వారికి మంచి జరిగిచ్చేందుకు రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి ప్రాంతంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాదాపు 4,900 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 11,690 ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 

అమూల్‌ అడుగుపెట్టే ప్రతి గ్రామంలో ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అక్కచెల్లెమ్మలు పాలపోసేటప్పుడు ఏఎంసీయూ, బీఎంసీయూల్లో మీటరింగ్‌ ఉంటుంది కాబట్టి వెంటనే పాలు ఎన్ని లీటర్లు, ఏ క్వాలిటీ, ఎంత ధర అనేది అక్కచెల్లెమ్మల కళ్ల ముందే పారదర్శక వ్యవస్థ ఉంటుంది. ఎవరూ అక్కచెల్లెమ్మలను మోసం చేయలేని పరిస్థితికి వ్యవస్థ తయారవుతుంది. దీని వల్ల అక్కచెల్లెమ్మలకు మంచిరేటు రావడమే కాకుండా.. మోసపోకుండా కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. 

పాల సేకరణలో జరిగే మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధ్యాస పెట్టింది. పాలసేకరణ ప్రక్రియలో ఎక్కడా మోసంలేకుండా చూసే బాధ్యతలో భాగంగా తనిఖీలు కూడా విస్తృతంగా చేయడం మొదలుపెట్టాం. పలు ప్రాంతాల్లో దాదాపుగా 20 కేసులు బుక్‌ చేశాం. మోసం జరగకుండా అన్ని అడుగు వేయడం జరిగింది. పట్టుబడిన కేసుల్లో ప్రైవేట్‌ డెయిరీల ఏజెంట్లు లీటర్‌కు 45 పైసల నుంచి రూ.10.95 పైసల వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు తేలింది. ఇలాంటి మోసాల‌ను అరిక‌డుతున్నాం. అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలి.. వారికి ఏదైనా ఆదాయం వారి గ్రామంలోనే ఏర్పాటు కావాలి.. అదనపు ఆదాయం వల్ల అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడే పరిస్థితికి మెరుగైన అవకాశాలు ఇవ్వాలనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేవుడి దయతో అమూల్‌ వల్ల మంచి జరగాలని మనసారా ఆశిస్తూ.. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 

Back to Top