సోమయాజులు నా  గురువు:సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విజయవాడ : దివంగత డీఏ సోమాయాజులు తనకు గురువుగా ఉండేవారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. డీఏ సోమయాజులు 67వ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుగా సోమయాజులు చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘సోమయాజులు గారు ఒక లివింగ్‌ ఎన్‌సైక్లోపిడియ వంటివారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేంది. మా అందరికి ఆయన క్లాసులు చెప్పేవారు. సొంతంగా పార్టీ పెట్టినప్పుడు నాతో పాటు మొట్టమొదటగా అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు గారు. ఆయన ఒక గురువుగా నాకు ప్రతీ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. 2014లో నేను తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా నా ప్రతి స్పీచ్‌ వెనకాల ఉండి నన్ను నడిపించిన వ్యక్తి సోమయాజులు అన్న అని గర్వంగా చెబుతున్నాను.

కృష్ణను చూస్తే సోమయాజులు అన్న మన మధ్యలోనే ఉన్నట్టుగా ఉంది. కృష్ణకు కూడా అన్ని విషయాలపై అవగాహన ఉంది. తండ్రిని మించిన తనయుడిగా కృష్ణ ఎదుగుతాడు. సోమయాజులు అన్న కుటుంబానికి నాతోపాటు ఇక్కడున్న వారంతా తోడుగా ఉంటారు. ఆయన కుటుంబానికి దేవుడు మంచి చేస్తాడ’ని నమ్ముతున్నట్టు తెలిపారు. కాగా, డీఏ సోమయాజులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన గతేడాది మే నెలలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు కృష్ణ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సోమయాజులు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు, పలువురు ఏపీ రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Back to Top