తాడేపల్లి: మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి మోడీకి సీఎం వైయస్ జగన్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు. వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలు - రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలి. - తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి. - పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి. - జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతుబద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. - రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి. - భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలి. - ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.