గ్రామ సచివాలయాల్లో ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల జాబితా

నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష
 

తాడేపల్లి: ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉంచాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే ఎవరిని సంప్రదించాలని, ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను పొందుపరచాలని సూచించారు.  ఆసుపత్రుల నాడు- నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సీఎం వైయస్‌ జగన్‌కు వైద్య సేవలపై వివరించారు. 5 వేల హెల్త్‌ సబ్‌ సెంటర్లకు జనవరిలో పనులు ప్రారంభిస్తామని, జనవరి మూడు లేదా నాలుగో వారంలో పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లో 72 ఆసుపత్రులు, బెంగళూరులో 35, చెన్నైలో 23 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అమలులోకి వచ్చాయన్నారు. డిసెంబర్‌ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పారు. డిసెంబర్‌ 15 నుంచి ఆసుపత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రితో అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం రోగులకు మందులు అందించాలని సూచించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే కార్యక్రమాలు నాణ్యతతో ఉండాలని సూచించారు. తీవ్రవ్యాధులతో బాధపడుతున్న వారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పద్ధతి సులభతరంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఏఎన్‌ఎం సహాయంతో స్లాట్‌ బుక్‌ చేయించాలన్నారు. వెంటనే పరీక్షలు, సర్టిఫికెట్‌ జారీ చేసేలా చూడాలని వైయస్‌ జగన్‌ సూచించారు. రోగుల కోసం ప్రత్యేక వాహన సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు.
 

Back to Top